About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

శ్రీరామనవమి సంద్గర్భంగా ఏప్రిల్ 2017 మన ఆరోగ్యం మాసపత్రికకి

శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగము
   కొత్త తెలుగు సంవత్సరం హేవళంబి మొదలవగానే మొదటి తెలుగు పండుగ ఉగాదిని అందరం ఆనందంగా జరుపుకున్నాం. కొత్తసంవత్సరం మొదటి నెలలో వచ్చేది శ్రీరామనవమి.
   రామ మందిరంగాని, రామభజన మందిరంగాని లేని ఊరు మన తెలుగు దేశంలో లేనేలేదు. ఇది అందరూ అంగీకరించే విషయమే. రామాయణం గురించి తెలియనివాళ్ళు కూడా లేరు. చిన్న పిల్లలకి కూడా రాముడు నాయకుడుగా కథలు చెప్తూనే ఉంటాం. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా వింటూ ఉంటారు.
  రామఅనే పదం తేలికగా పలకబడుతుంది. ఆ రెండక్షరాల నామాన్ని తారకమంత్రం అంటారు. ఈ నామం జపిస్తే మోక్షాన్ని పొందవచ్చు. రామ నామాన్ని పరమేశ్వరుడు కూడా జపిస్తాడట. వాల్మీకి అంటాడు చరితం రఘునాథస్య శతకోటి స్రవిస్తరమ్ అని.
   శ్రీరాముడు పుట్టినప్పుడు తన కుమారుడు శ్రీరాముణ్ణి ఉయ్యాలలో వేసి కౌసల్యాదేవి ముత్తైదువుల్ని పిలిచి పేరంటం చేసింది. పేరంటానికి వచ్చినవాళ్లందరికీ గుగ్గిళ్ళు  పంచిపెట్టిందిట. వచ్చిన పేరంటాళ్ళు కొసల్యాదేవి ఇచ్చిన వాయనం తీసుకుని ఇంటికి వెడుతూ...
మాజన్మ సఫలంబు-మరి నేటికాయె...ఇంటికి బోయేము-ఇంతిరో మేము...పసుపు కుంకుమలను-పరిమాళిచ్చి...గుగ్గిళ్ళు పంచెనే-కుసుమ శ్రీగంధి అని పాడుకుంటూ కౌసల్యకి వెళ్ళి వస్తామని చెప్పి వెళ్ళారని చరిత్ర ద్వారా తెలుస్తోంది.
   అనాటి సంస్కృతే ఈనాటికీ నడుస్తోంది. ఇప్పుడు కూడా పేరంటానికిగాని, భజనలకిగాని, వ్రతాలకిగాని పిలిచినప్పుడు పేరంటాళ్లకి ఉడికించినవిగాని, నానబెట్టినవిగాని శనగలతో కలిసిన తాంబూలాన్నే పేరంటాళ్లకి పంచుతున్నారు.
  తమ పిల్లలు శ్రీరాముడు సీతాదేవి వంటి గొప్పవాళ్ళుగా తయారవాలని వాళ్లకున్నంత గొప్ప కీర్తిని తెచ్చుకోవాలని ప్రతి తల్లితండ్రులూ కోరుకుంటారు. అందుకే ఉయ్యాల్లో పడుక్కోబెట్టి వాళ్లని నిద్రపుచ్చుతూ ఎన్నో జోలపాటలు పాడుతున్నారు.
   పెరుగుతున్న పిల్లలు పెద్దవాళ్లకి ఉండే మంచి గుణాల్ని, వంశం యొక్క గొప్ప చరిత్రని వర్ణిస్తూ కూడా జోలపాటలు పాడుతారు. ఎందుకంటే, పెద్దవాళ్లలో ఉండే మంచి నడవడిక, గుణగణాలు, అన్నీ తమ పిల్లలు పుణికి పుచ్చుకోవాలని!.
 అందువల్ల అప్పటి వరకూ నిలబడుతూ వచ్చిన వంశ ప్రతిష్ఠని పిల్లలు తమ తరంలో కూడ నిలబెట్టాలని కోరిక. వాటినే పాటలుగా పాడడం వల్ల వాటిని వింటూ నిద్రపొయే పిల్లలు తమ పెద్దల గొప్పతనాన్ని తెలుసుకుని అదే మార్గంలో నడుస్తారు.
   రాముడి గుణగణాలు వర్ణిస్తూ జోలపాడుతుంటే పిల్లలు మంచి మార్గంలో పెరగడమే కాదు, భగవంతుడి ఆశీస్సులు కూడా పొందుతారని తల్లి భావన. ఊయల ఊపుతూ పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు ఆ పిల్లల్ని రాముడిగానే భావించి ...
జోజో దశరథ కుమారా...కొసల్య వరపుత్ర...కరుణా కటాక్షా...రఘుకుల భూషణా... రాజపూజితుడా... సీతాంగనాపతీ శ్రీరామచంద్రా అంటూ అనేక జోలపాటలు పాడుతారు.
   మహారాజు కొడుకు శ్రీరామచంద్రుడికి జరగని సంబరాలు ఏమున్నాయి కనుక! సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు అవతారం కదా! శ్రీరాముడికి స్నానం చేయించేప్పుడు ...
బంగారు గిన్నెలో పలు నెయ్యి బోసి...సంపంగి తైలాన శిరసొప్పనంటి...మెత్తని కస్తూరి మేనలుగుతీర్చి...వేన్నీళ్ళు చన్నీళ్ళు సమముగా చేసి...మూడు దోసిళ్ళతో సమముగా బోసి అంటూ పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి.
   దశరథమహారాజుకి కొడుకు కనుక పుడుతూనే ఎన్నో సంపదలు ఉన్నాయి. రాముడి స్నానానికి వాడే వస్తువులు కూడా అంత గొప్పగా ఉంటాయి.
   కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టు ఎవరి పిల్లలు వాళ్లకి ముచ్చటే కదా! సంపదలు ఎటువంటివి అయినా ప్రతి తల్లికి తమ బిడ్డ రాముడిలా గుణవంతుడై గొప్ప పేరు తెచ్చుకోవాలనే ఉంటుంది. కాని, ఆయనకి ఉన్నన్ని సంపదలు ఉండాలి అని మాత్రం అనుకోరు. అందుకే తల్లులందరూ అదే పాటతో తమ పిల్లలకి మూడు దోసిళ్లతో ముద్దుగా పోసి స్నానం చేయిస్తున్నారు.
   లోకోత్తరపురుషుడైన శ్రీరాముడి చరిత్రని వాల్మీకి మహాకవి రామాయణం అనే పేరుతో ఆదర్శప్రాయమైన సమాజం నిలబడాలనే తపనతో రచించాడు. పరమ పవిత్రమైన గాయత్రీ మంత్రంలో ఉన్న ఇరవై నాలుగు బీజాక్షరాల్ని ఇందులో పొందు పరిచాడు. శ్రీమద్రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి. వెయ్యి శ్లోకాలకి ఒక గాయత్రీ మంత్రాక్షరాన్ని నిలిపి  ఇదం రామాయణం కృత్స్నం గాయత్రీ బీజ సంయుతం\ త్రిసంధ్యం య: పఠేన్నిత్య సర్వపాపైర్యముచ్యతే | అని ప్రవచించాడు.
   వాల్మీకి గిరి సంభూతా, రామసాగరగామినే\శ్రీమద్రామాయణీగంగా, పునాత్రిభువనత్రయమ్ |  గంగ ఏ విధంగా త్రిలోకాల్ని పవిత్రం చేస్తుందో అదే విధంగా రామాయణం కూడా మూడు లోకాల్ని పవిత్రం చేస్తోంది. రామో విగ్రహవాన్ ధర్మ:, రామస్సత్య పరాక్రమ:  వంటి వాక్యాలు రాముడు ఆదర్శప్రాయుడైన పురుష శ్రేష్టుడు అని తెలియ చేస్తున్నాయి. ఒక శత్రువు అందులోను రాక్షసుడు అయిన మారీచుడు మరొక రాక్షస చక్రవర్తి రావణాసురుడితో  శ్రీరాముడు పరిపూర్ణ మానవుడు! అంటాడు. అంతకంటె గొప్పతనం ఏముంటుంది..?
   తల్లీ పిల్లలు, తండ్రీ పిల్లలు, అన్నదమ్ములు, భార్యాభర్తలు, స్నేహితులు, సేవకులు వంటి వారి మధ్య ఉండవలసిన అనుబంధాలు, అనురాగాలు, ఆత్మీయతలు, వాత్సల్యాలు మానవ దైవ పరంగా నిర్దేశిస్తూనే రాక్షసత్వ, పశుత్వ స్వభావాలు దాని వల్ల కలిగే పతనాలు కూడా శ్రీరాముని చరిత్ర ద్వారా తెలుసుకోగలిగే విధంగా శ్రీమద్రామాయణ కావ్యం సాగింది.
   రామాయణం కావ్యంగానే కాకుండా నృత్య నాటకాలుగా, యక్ష గానంగా, వీధి భగవతంగా, పల్లె పాటలుగా, తోలుబొమ్మలాటలుగా ప్రదర్శింప బడుతూ అక్షరజ్ఞానం లేని పామరులు కూడా దశరథ కుమారుడు శ్రీరాముడి ద్వారా ధర్మాధర్మాల విచక్షణ గ్రహించి, రామతారకాన్ని జపించి మంచి ప్రవర్తన కలిగి మోక్షాన్ని కూడా పొందుతున్నారు.
   శ్రీరాముడు పుట్టినది చైత్ర శుద్ధ నవమి. వివాహం జరిగినది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి. శ్రీరాముడి కళ్యాణాన్ని కూడా మనం పుట్టిన రోజునాడే జరిపిస్తున్నాము.
   ఎందుకంటే, రామదాసు శ్రీరామచంద్రుడి వివాహాన్ని ఆయన పుట్టిన రోజు అయిన చైత్ర శుద్ధ నవమి రోజే జరిపించాడు. 18వ శతాబ్దంలో భద్రాద్రిని ఉద్ధరించిన శ్రీ ముక్తేవి పెరుమాళ్ళుగారు రామదాసు నిర్ణయించినట్టే నడవమని చెప్పారు.
   శ్రీరాముడి పెళ్ళికి వచ్చిన వాళ్లల్లో వసిష్ట మహర్షి వంటి గొప్ప మహర్షులు, అరుంధతీదేవి వంటి పెద్ద పేరంటాళ్ళు ఉన్నట్టే సామాన్య ప్రజలు కూడా ఉన్నారు.
   ఈనాటి సామాజిక వ్యవస్థలో కూడా ఆనాటి సంస్కృతే  నడుస్తోంది. అందుకు నిదర్శనం పెళ్ళిళ్లల్లో పాడుతున్న కట్నాలు, తలంబ్రాలు, అప్పగింతల పాటలు. అనుసరిస్తున్న పెళ్ళి తంతు కూడా ఈ విషయాన్ని తెలియచేస్తోంది.
   శ్రీరాముడి పెళ్ళి హడావిడి మొత్తం మొదటి నుంచి చివరి వరకు పాటల్లో భద్రపరచబడి ఉన్నాయి.
కొండ పొడుగు పందిళ్ళు వేసిరట...ముత్యాల పందిట్లోను...నవరత్నాలు వానలు కురియ...రంగైన ముత్యాలు రత్నాలు...సీతారాముల తలంబ్రాలు ఇలా నడుస్తాయి పాటలు.
   మనం ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం జరిపించడంలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే...వివాహం యొక్క పవిత్రతని తెలుసుకుని దంపతులు ఒకరి కోసం ఒకరన్నట్టుగా జీవించాలి  అని.
   పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది”” అన్న సామెత చెప్పినట్టు..  సేవకోసం పుట్టేవాళ్ళు పుడుతూ ఉండగానే వాళ్ళ గొప్పతనం తెలియ చేస్తూ శుభశకునాలు కనిపిస్తాయట. అటువంటి వారి చరిత్ర విన్నా కూడ శుభాలు కలుగుతాయి.
   అటువంటి గొప్ప సంస్కృతి ఎప్పటికీ నిలబడాలన్నదే శ్రీ సీతారముల కళ్యాణం ప్రతి సంవత్సరం జరిపించడంలో గల ముఖ్యోద్దేశం.
   శ్రీ సీతారాముల్ని గౌరవిస్తూ ప్రతి ఇంట దంపతులు తమ తమ పెళ్ళి రోజు వేడుకల్ని కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. వాళ్ళ సంతోషం కోసమో పదిమందినీ పిలుచుకుని అందరితో సంతోషాన్ని పంచుకోవాలనో జరుపుకుంటున్నా.. కస్టాలు అనుభవవిస్తున్నా,  సుఖాలు అనుభవిస్తున్నా జీవితం చివరి వరకు విడిపోకుండా అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. ఇదే మన తరతరాల సంస్కృతి.
   శ్రీరామనవమి రోజు ఇంట్లో శ్రీ సీతారాముల్ని పూజించి... అందరూ కలిసి జరుపుకునే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండువుగా చూడడం ఆచారంగా వస్తోంది.
   రాబోయే ఎండలకి వడదెబ్బ కొట్టకుండా ముండే జాగ్రత్త పడడం కోసం పెద్దలు నిర్దేశించిన వడపప్పు, బెల్లము మిరియాలు ఏలకులతో తయారు చేసిన పానకం, అరటిపళ్ళు వంటి ఇంకా ఇతర ప్రసాదాలు కళ్యాణంలో భగవంతుడికి నివేదన చేస్తారు.
   నిత్యకళ్యాణం పచ్చతోరణంగా తొమ్మిది రోజులూ పూజలతో, సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపద్ధతులు పాటిస్తూ  జరుపుకునే శ్రీరామనవమి అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుని  ప్రతి ఒక్కరూ సీతారాముల దయకు పాత్రులవాలని కోరుకుంటూ...

భమిడిపాటి బాలాత్రిపురసుందరి

                                                                                                                                                9440174797   

No comments:

Post a Comment