About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

శ్రీరామ నామ ప్రాశస్త్యం

12-5-2017 శ్రీ కాలనాథభట్ట వీరభద్ర శాస్త్రిగారు నిర్వహించిన శ్రీరామదర్బారు కవిసమ్మేళనంలో చదివిన కవిత.
శ్రీ  శాస్త్రిగారు ప్రతి సంవత్సరం ఉగాది తరువాత వసంతోత్సవాలు,  శ్రీరామదర్బారు కవిసమ్మేళనాలు తప్పనిసరిగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఆయన వయసు రమారమి 90 సంవత్సరాలు. అయినా నవయువకుడిలా ఉత్సాహంగా ఉంటారు. ఈ కవిత ఆ దంపతులకి అంకితం.    
          శ్రీరామ నామ ప్రాశస్త్యం                               
పాపాలన్నీ నశించేలా చేస్తుంది శ్రీరామ నామ జపం!
’శ్రీరామ రామ రామ’ అంటూ రామ నామాన్ని జపిస్తే
సమసి పోతాయి శరీరాన్ని ఆవహించిన రోగాలు, ముసలితనం!
జీవుడికి రక్షా కవచంలా ఉండి, భగవంతుడికి దగ్గరగా చేరుస్తుంది
సులభంగా మోక్షాన్నిఅందించగల సాధనం...ఇదే ’తారక మంత్రం’!
కపి కులంలో జన్మించినా భక్తితో రామ నామం జపించాడు
ముల్లోకాలకి పూజ్యుడయ్యాడు ఆంజనేయుడు
జీవాత్మను పరమాత్మతో ఏకం చెయ్యడమే మోక్షం...
అందుకు కావలసిన సాధనమే ధ్యానం!
ధ్యానం చెయ్యడానికి అనుసరించే పద్ధతి ’యోగం’...!
ప్రతి జీవుడిలో ఉంటుంది ఆత్మ, దానిలో లీనమై ఉంటాడు పరమాత్మ
ఆత్మలో లీనమై ఉన్న పరమాత్మని గుర్తించడమే యోగమంటే!
సాధన చెయ్యగా చెయ్యగా పొందేది జ్ఞానం! అదే ’జ్ఞానయోగం’!
పరమ పవిత్రుడైన పరమాత్మని చూడడానికి సాధనం అవసరం
పాటించాలి ఆహార నియమాలు, ఎంచుకోవాలి అనువైన ప్రదేశం
నియమ నిష్ఠలతో.. శ్రద్ధా భక్తులతో జరగాలి యోగ సాధన!
కిరాతకుడు ఉచ్చులతో పక్షుల్ని.. మావటీడు అంకుశంతో మదపుటేనుగుల్ని
వేటగాడు బాణాలతో క్రూరమృగాల్ని.. సాధిస్తున్నారు సాధనంతో!
ధర్మంతో పూజింప తగిన.. ధర్మానికి అధిపతి... ధర్మం కలిగిన... ధర్మం తెలిసిన...  
ధర్మానికి ఆధారమైన, ధర్మాధర్మ భావాలు లేని ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు!
మనస్సులో ఉంచాలి బ్రహ్మజ్ఞానం కంటే మించిన విలువైన ఈ విషయాన్ని  
శ్రీసీతారాములే గురువులుగా... తారకయోగము, సాంఖ్యయోగము,
అమనస్కయోగాల్ని శ్రద్ధాభక్తులు వినయవిధేయతలతో సాధన చేసాడు
శ్రీ సీతారాముల్ని హృదయంలో ప్రతిష్ఠించుకున్నాడు హనుమ

తమోగుణమనే తాబేళ్ళు.. రజోగుణమనే చేపలు.. కోపమనే మొసళ్ళు..
కోరికలనే నాచు..  అలలనే జనన మరణాలు.. నీటి బుడగలనే వ్యాధులు..
నురుగనే లోభము.. చెలియలికట్టనే భ్రమ.. దు:ఖాలనే లోతైన నీటి వెల్లువలతో
నిండుగా గంభీరంగా ప్రవహిస్తుంది సంసార సాగరం..
ఈ సాగరాన్ని దాటి ఆవలి గట్టుకి చేరగలిగితే పొందగలిగేది ముక్తి!
మంత్రాల్లో కెల్ల గొప్పది ఈ శ్రీరామ మంత్రం... ఉచ్ఛరిస్తే కలుగుతుంది
బ్రహ్మవిద్యా స్వరూపిణి సీతాదేవి.. పరబ్రహ్మ స్వరూపుడు శ్రీరామచంద్రుల దర్శనం!
పవిత్రమైన చరిత్ర కలిగిన నిత్య భక్తుడు, మానవసేవే మాధవసేవని
క్రమశిక్షణతో.. నిండు మనస్సుతో.. భాష సంస్కృతీ సంప్రదాయాల్ని పరిరక్షిస్తున్న
అందరి శ్రేయోభిలాషి.. జ్ఞాన పిపాసి.. నిష్కపటి... బాహ్య ప్రపంచంలోనే కాక
అంతర్జాలంలో కూడా తాతగా అభిమానాన్ని చూరగొంటూ.. శ్రీ సీతారాముల పాదాల్ని
ఆశ్రయించిన పుణ్యాత్ముడు.. శ్రీ కాలనాథభట్ట వీరభద్రశాస్త్రిగారు!
ఆదిదంపతుల దయకు పాత్రులైన ఈ పుణ్య దంపతులు నిజంగా జీవన్ముక్తులే!

వారి పాదాలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను!

No comments:

Post a Comment