About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

2017 మే నెల బుద్ధపూర్ణిమ సందర్భంగా మన ఆరోగ్యం మాసపత్రికకి పంపించిన వ్యాసం


బుద్ధపూర్ణిమ
   మనం వైశాఖ శుద్ధ పూర్ణిమని బుద్ధ పూర్ణిమగా జరుపుకుంటున్నాం. గౌతమ బుద్ధుడు గురించి పూర్తిగా తెలుసుకోలేక పోయినా కొంతైనా తెలుసుకోవడం, శ్రీమహావిష్ణువు దశవతారాల్లో ఒక అవతారంగా చెప్పుకుంటున్న ఆయన్ని ఒకసారి భక్తితో స్మరించుకోవడం మన ధర్మం. కనుక బుద్ధుడి గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం..
బుద్ధుడి జననము
   సిద్ధార్ధుడు కపిలవస్తు దేశానికీ చెందిన లుంబిని పట్టణంలో జన్మించాడు. భౌగొళికంగా ప్రస్తుతం నేపాల్ దేశంలో ఈ ప్రాంతం చారిత్రకంగా ప్రాచీన భారతదేశంలోకి వస్తుంది. తండ్రి శుద్ధోధనుడు, తల్లిమహామాయ (మాయాదేవి, కోళియన్ దేశపు రాకుమారి). శాక్యవంశాచారం ప్రకారం, గర్భావతిగా ఉన్న మాయాదేవి,  ప్రసవానికి తన తండ్రిగారింటికి బయలుదేరింది. కానీ మార్గమధ్యంలో, లుంబిని అనే ప్రాంతంలో ఒక సాలవృక్షం క్రింద  మగ బిడ్డను ప్రసవించింది.
   బిడ్డ జన్మించిన కొద్ది రోజుల తర్వాత మాయాదేవి మరణించింది. అలా పుట్టిన బిడ్డకి సిద్ధార్థుడు అని నామకరణం చేశారు. సిద్ధార్థుడు అంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించేవాడని అర్ధం. సిద్ధార్ధుణ్ణి పెంచిన తల్లి పేరు గౌతమి. సిద్దార్దుడు జన్మించిన ఐదవ రోజు నామకరణం చేసారు.  అతడి భవిష్యత్తు గురించి చెప్పమని, శుద్ధోధనుడు ఎనిమిది మంది జ్యోతిష్కుల్ని ఆహ్వానించాడు. కౌండిన్యుడనే పండితుడు, సిద్ధార్థుడు భవిష్యత్తులో బుద్ధుడవుతాడని జ్యోస్యం చెప్పాడు. అప్పటి చరిత్ర, ఆచారాలను బట్టి చూస్తే, శుద్ధోధనుడు, సూర్య వంశపు రాజైన ఇక్ష్వాకుడి వారసుడని తెలుస్తోంది.
బాల్య జీవితము - వివాహము
   సిద్ధార్దుడు బాల్యం నుంచి రాకుమరుడిగా విలాసవంతమైన జీవితం గడిపాడు. శుద్ధోధనుడు, సిద్ధార్దుణ్ణి  గొప్ప చక్రవర్తిని చెయ్యాలని అనుకున్నాడు. అందువల్ల అతడికి తాత్విక విషయాలు, సామాన్య ప్రజల కష్టసుఖాలు తెలియకుండా పెంచాడు.
   సిద్ధార్థుడికి 16 ఏళ్ళ వయస్సులో యశోధరతో వివాహమయింది. ఆ దంపతులకి రాహులుడనే కుమారుడు పుట్టాడు. సిద్ధార్థుడు 29 ఏళ్ల వరకు రాజభోగాల్ని అనుభవించాడు. మహారాజు శుద్ధోధనుడు, తన కుమారుడికి కావలసిన రాజభోగాలన్నీ సమకూర్చాడు. సిద్ధార్దుడు ప్రాపంచిక సుఖాలను అనుభవించడం జీవిత పరమ లక్ష్యం కాదని అనుకుంటూ ఉండేవాడు
  ఇతడికి అర్కబంధువు, గౌతముడు, మాయాదేవీసుతుడు, మునీంద్రుడు, శాక్యముని, శాక్యసింహుడుశౌద్ధోధని, సిద్ధార్థుడు, సర్వార్థసిద్ధుడు అని ఇంకా పేర్లు ఉన్నాయి.
రాజ భోగాలనుంచి నిష్క్రమణ -సన్యాసి జీవితము
   సిద్ధార్థుడికి ఐహిక ప్రపంచపు కష్టసుఖాలు తెలియకూడదని శుద్ధోధనుడు ఎంతో  ప్రయత్నించాడు. కాని, తన 29వ ఏట, ఒక రోజు సిద్ధార్థుడు, ఒక ముసలి వ్యక్తిని, ఒక రోగ పీడితుణ్ణి, ఒక కుళ్ళిపోతున్న శవాన్ని, ఒక సన్యాసిని చూశాడు. తన రథసారథి ఛన్న (చెన్నుడు) ద్వారా, ప్రతి మానవుడూ ముసలితనం నుంచి తప్పించుకోలేడని తెలుసుకుని తీవ్రంగా బాధ పడ్డాడు. రోగాన్నీ, ముసలితనాన్నీ, మరణాన్ని జయించాలనే సంకల్పంతో సన్యాస జీవితం గడపడానికి  నిశ్చయించుకున్నాడు.
  అప్పుడు సిద్ధార్దుడు పరివ్రాజక జీవితం గడపడానికి నిశ్చయించుకుని తన రథసారథి ఛన్న సహాయంతో ఒకనాడు కంతక అనే గుర్రం మీద రాజభవనం నుంచి  తప్పించుకున్నాడు. ఈ విధంగా ఒక బోధిసత్వుని నిష్క్రమణ అతడి భటులకు తెలియకుండా ఉండడానికి, అతని గుర్రపు డెక్కల చప్పుడు దేవతలే వినబడకుండా చేశారని చెప్తారు. దీనినే ఒక గొప్ప నిష్క్రమణ (మహాభినిష్క్రమణ) అంటారు.
   సిద్ధార్దుడు తన సన్యాసి జీవితాన్ని రాజగృహ (మగధ సామ్రాజ్యంలో ఒక పట్టణం) లో భిక్షాటన ద్వారా ప్రారంభించాడు. కానీ బింబిసార మహారాజ సేవకులు, సిద్ధార్థుణ్ణి గుర్తించారు. బింబిసారుడు, సిద్ధార్థుడి అన్వేషణకు కారణం తెలుసుకున్నాడు. అతడికి తన సింహాసనాన్ని  బహూకరించాడు. కాని సిద్ధార్థుడు ఆ బహుమానాన్ని తిరస్కరిస్తూ, తన జ్ఞాన సముపార్జన పూర్తయ్యాక మొదటగా మగధ సామ్రాజ్యానికే వస్తానని మాటిచ్చాడు.
   తర్వాత సిద్ధార్థుడు ఇద్దరు సన్యాసుల దగ్గర శిష్యరికం చేశాడు. అలరకలమ అనే సన్యాసి తన బోధనలతో సిద్ధార్థుణ్ణి ప్రావీణ్యుణ్ణి చేసి, తన వారసుడిగా ఉండమన్నాడు. సిద్ధార్థుడికి జ్ఞానతృష్ణ తీరక నిరాకరించాడు.
  తర్వాత సిద్ధార్థుడు ఉదకరామపుత్’  అనే యోగి శిష్యరికంలో యోగశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించాడు. కాని ఇది కూడా సిద్ధార్దుని జ్ఞానతృష్ణని తీర్చలేదు. అందువల్ల వారసత్వం పుచ్చుకోమన్న ఆ యోగి కోరికని కూడా నిరాకరించాడు.
   తర్వాత సిద్ధార్దుడు కౌండిన్యుడనే యోగి దగ్గర మరో ఐదుగురు వ్యక్తులతో కలిసి శిష్యరికం చేశాడు. ఆ శిష్యబృందమంతా జ్ఞాన సముపార్జన కోసం, బాహ్య శరీర అవసరాల్ని ఆహారంతో సహా పూర్తిగా త్యజించి సాధన చేశేవాళ్ళు. సిద్ధార్థుడు రోజుకు ఒక పత్రాన్ని గాని, ఒక గింజను గాని ఆహారంగా తీసుకుంటూ తన శరీరాన్ని పూర్తిగా క్షీణింప చేసుకున్నాడు. ఒక రోజు సిద్ధార్థుడు, నదిలో స్నానం చేస్తూ నీరసంతో పడిపోయాడు. అప్పుడు సిద్ధార్దుడు తను ఎంచుకున్న మార్గం సరియైనది కాదని తెలుసుకున్నాడు.

జ్ఞానోదయము

  తర్వాత సిద్ధార్దుడు ధ్యానం, అనాపనసతి (ఉశ్చ్వాస, నిశ్వాసలు) ద్వారా మధ్యయ మార్గాన్ని కనిపెట్టాడు (ఐహిక సుఖాలను, కోరికలను త్యజించడం). ఈ సమయంలో సుజాత అనే పల్లె పడుచు తెచ్చే కొద్ది అన్నాన్ని, పాలను ఆహారంగా తీసుకునేవాడు. బుద్ధ గయలో ఒక బోధి వృక్షం నీడలో పరమ సత్యం తెలుసుకోడం కోసం భగవత్ ధ్యానం చేశాడు.  చివరకి తన 35వ ఏట, 49 రోజుల ధ్యానం తర్వాత, సిద్ధార్దునకు జ్ఞానోదయమైంది. అప్పటి నుంచి గౌతమ సిద్ధార్దుడు, గౌతమ బుద్ధుడిగా మారాడు. బౌద్ధ మతంలో ఇతనిని శాక్యముని బుద్ధుడని భావిస్తారు.
   జ్ఞానోదయమయ్యాక గౌతమ బుద్ధుడు, మానవుడి అజ్ఞానానికి, కష్టాలకి కారణాల్ని, వాటి నుంచి విముక్తి  పొందడానికి మార్గాల్ని తెలుసుకోగలిగాడు. వీటిని 4 పరమ సత్యాలుగా విభజించాడు. దీనినే బౌద్ధ మతంలో నిర్వాణమంటారు. గౌతమ బుద్ధుడు, ప్రతి బుద్ధుడికి ఉండవలసిన 9 లక్షణాల్ని ప్రతిపాదించాడు.
    గౌతమ బుద్ధుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని సామాన్య ప్రజలకు బోధించాలని అనుకుని దురాశ, అసూయ, ద్వేషాలతో నిండిన మానవుడు, తను తెలుసుకున్న ధర్మాన్ని అర్ధం చేసుకోలేడని సందేహపడ్డాడు. కానీ బ్రహ్మ సహంపతి విన్నపంతో, గౌతమ బుద్ధుడు, బోధకునిగా మారడానికి నిర్ణయించుకున్నాడు.
బుద్ధుడి నిర్యాణము
   మహా పరనిభాన సూక్తం ప్రకారం, గౌతమ బుద్ధుడు, తన 80వ ఏట తాను కొద్ది రోజుల్లో మహా నిర్యాణం పొందుతానని ప్రకటించాడు. బుద్ధుడు కుంద అనే కుమ్మరి సమర్పించిన ఆహారాన్ని భుజించాడు. అదితిన్న తర్వాత బుద్ధుడు చాలా అస్వస్థతకు గురయ్యాడు. బుద్ధుడు తన ముఖ్య అనుచరుడయిన ఆనందుని పిలిచి, తన అస్వస్థతకు కారణం, కుంద ఇచ్చిన ఆహారం కాదని, తనకు ఆఖరి భోజనాన్ని సమర్పించిన కుంద చాలా గొప్పవాడని చెప్పి, కుందని బాధపడద్దని చెప్పమని పంపించాడు.
    బుద్ధుడు తన శిష్యులైన బౌద్ధ భిక్షువులనందర్నీ పిలిచి వాళ్ళకి సందేహాలుంటే నివృత్తి చేసుకోమని అడిగాడు. కానీ ఎవ్వరు, ఏ సందేహాల్ని వెలిబుచ్చలేదు. తరువాత బుద్ధుడు మహా నిర్యాణం పొందాడు.
   బుద్ధుడి ఆఖరి మాటలు, “All composite things Pass away. Strive for your own liberation with diligence ”. బుద్ధుని శరీరానికి అంత్యక్రియలు జరిపిన తర్వాత, అతని అస్థికలు వివిధ బౌద్ధ స్థూపాలలో భద్రపరిచారు.
   వీటిలో కొన్ని ఇప్పటికీ భద్రంగా ఉన్నాయంటారు. శ్రీలంకలో ఉన్న దలద మారిగావలో బుద్ధుని కుడివైపున ఉండే పన్ను ఇప్పటికి భద్రపరచబడి ఉంది. దీనినే  టెంపుల్ ఆఫ్ టూత్ అంటారు.  బుద్ధుడు నిర్యాణ సమయంలో ఏ నాయకుణ్ణీ అనుసరించవద్దని, తన సిద్ధాంతాలను, ధర్మాన్ని మాత్రమే అనుసరించమని తన శిష్యులకి చెప్పాడు. ఆయన యధాతథంగా బోధించినవి దొరుకడం కొంత కష్టమే అయినా, వాటి మూలాల్ని తెలుసుకోవడం అసంభవమైన పని కాదు.
బుద్ధ జయంతి సందర్భంగా కొన్ని బోధనలు:
1. ధనం లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎల్లప్పుడు ధనికుడే.
2. నీళ్ళ తాకిడికి శిలకూడా అరిగి చిన్నదవుతుంది. అలాగే ప్రయత్నం వలన కష్టం చిన్నదవుతుంది.
3. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు.
4. వాదవివాదాలు కొనసాగించినంత కాలం ఈ ప్రపంచంలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది.
5. ఇతరులను జయించడం కంటే తనను తాను జయించడం చాలా కష్టం.
6. మనకు బాధ కలిగిందని ఇతరులను బాధ పెట్టడం మూర్ఖత్వం.
7. సంతృప్తి లేకపోవడమే అన్ని దుఃఖాలకు కారణం.
8. ప్రశాంతమైన మనస్సే స్వర్గం.. చెడు ఆలోచనలతో కలుషితమైన మనస్సే నరకం.
9. ఇంకొకరితో పోరాడి జయించిన విజయంకంటే, ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం.
10. మాతృభాషలో వింటే, చదివితే కలిగే తృప్తి పరభాషలో వినడం, చదవడం ద్వారా రాదు.
11. మనిషి చేసిన పాపాల తాలుకు పరిణామమే వేదన.
12. భగవంతుణ్ణి సేవించాలనుకునేవారు ముందుగా దిక్కులేని వారిని సేవించుకోవాలి.
13. చదువు కంటే మంచి నడవడిక ముఖ్యం.
14. మనం పవిత్రంగా జీవించినంత కాలం అపనిందలకు భయపడాల్సిన అవసరంలేదు.
నాలుగు ఆర్య సూత్రాలు.
అష్టాంగమార్గము; అనిచ్చ: అన్ని వస్తువులు అనిత్యం;  అనత్త: నేను అని నిరంతరం కలిగే భావన ఒక "భ్రమ";  దుక్క: అజ్ఞానం కారణంగా అన్ని జీవులు దు:ఖానికి గురి అవుతున్నాయి.
   ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడి వెళ్ళవలసినదే కాబట్టి కొన్ని నిష్ఫలమైన మరియు మహత్తరమైన కార్యాల గురించి వాటితో కలిగే మోహామోహాల్ని కూడా వివరించాడు.
సత్యాన్వేషకులకి, నిజమైన బౌద్ధులకి, హిందువులకి బుద్ధ పూర్ణిమ శుభకాంక్షలు!!


No comments:

Post a Comment