దైవదూషణ
శిశుపాలుడుకథ
జరాసంధుణ్ణి చంపిన భీమసేనుడు అతడి కళేబరాన్ని అక్కడే
ఉన్న కోట గుమ్మానికి వ్రేలాడదీశాడు. మగథరాజ్య ప్రజలు దాన్ని చూసి భయంతో తమ నగరంలో
ఏదో కీడు జరగబోతోందని భయపడి ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు.
శ్రీకృష్ణుడు
వాళ్ళ భయాన్ని గమనించాడు. అందరికీ ధైర్యం చెప్పి జరాసంధుడు బంధించి తెచ్చి చెరలో
పెట్టిన రాజుల్ని విడిపించాడు. విడుదలైన
రాజులు సంతోషంతో రత్నరాశులు కానుకగా ఇచ్చి అతడికి తమ కృతజ్ఞతని చాటుకున్నారు.
తండ్రి
మరణించినందుకు బాధపడుతున్న జరాసంధుడి కొడుకు సహదేవుణ్ణి ఓదార్చి ఆ రాజ్యానికి
అతణ్ణి రాజుగా ప్రకటించాడు.
లోకైక వీరుడు పరమ
దుర్మార్గుడు అయిన మగథరాజు జరాసంధుణ్ణి వృకోదరుడు (భీమసేనుడు) సంహరించాడని తెలిసి
యుధిష్ఠిరుడు (ధర్మరాజు) చాలా సంతోషించాడు. ఇంక తను చేస్తున్న రాజసూయ యాగానికి
ఎటువంటి ఆటంకం కలగదని నిశ్చింతగా ఉన్నాడు.
దిగ్విజయం పొందడం
కోసం భీమసేనుణ్ణి తూర్పు వైపుకి, అర్జునుణ్ణి ఉత్తరం వైపుకి, నకులుణ్ణి పశ్చిమం
వైపుకి, సహదేవుణ్ణి దక్షిణం వైపుకి పంపించాడు. అన్న చెప్పినట్టు నలుగురు తమ్ముళ్ళు
దిగ్విజయ యాత్రకి బయలుదేరారు.
భీమార్జున నకుల
సహదేవులు తాము వెళ్ళిన ప్రదేశాల్లో ఉన్న రాజులకి “ “పాండురాజు కొడుకు ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. కనుక,
మీరు ఆ సార్వభౌముడికి కప్పం కట్టాలి”” అని చెప్పారు.
పాండవుల
మీద ఉన్న అభిమానంతో కొంతమంది, భయంతో కొంత మంది, యుద్ధం చేసి ఓడిపోయి కొంతమంది ధనం,
బంగారం, వస్తువులు, వాహనాలూ అనేక రకాలైన కానుకలు వాళ్ళకి సమర్పించారు.
ధర్మరాజు రాజసూయ యాగం
ప్రారంభించాడు. పురోహితుడు ధౌమ్యుడు యాగానికి అవసరమైన వస్తువులన్నీ సమకూర్చాడు.
దిగ్విజయ యాత్రలో ధర్మరాజుకి కప్పం కట్టిన సామంతరాజుల్ని రాజసూయ యాగానికి
ఆహ్వానించారు.
వచ్చిన
రాజులందరికి తగిన వసతులు ఏర్పాటు చేశారు. దుర్యోధనుడు కర్ణుడితోను, తన వందమంది
తమ్ముళ్ళతోను కలిసి వచ్చాడు. విరాట, ద్రుపద, శిశుపాల, వృష్టి, భోజాంధ రాజులు, ఇంకా
అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ రాజులందరు తరలి వచ్చారు.
ఇప్పుడు మన కథకి ముఖ్యుడైన శిశుపాలుణ్ణి పరిచయం చేసుకుందాం.
చేది రాజ్యానికి
రాజు శిశుపాలుడు. అతడి తండ్రి దమఘోషుడు, తల్లి సాత్వతి. శిశుపాలుడు నాలుగు
చేతులతోను, నుదిటి మీద కన్నుతోను పుట్టాడు. పుట్టగానే గాడిద గొంతుతో పెద్దగా
ఏడ్చాడు.
ఆ
ఏడుపు విని తల్లితండ్రులు భయపడ్డారు. అప్పుడు వాళ్ళకి ఒక అశరీరవాణి “వినిపించింది.
“ఈ బాలుణ్ణి ఎవరు ఎత్తుకున్నప్పుడు
అతడి రెండు చేతులు, నుదుటి మీద ఉన్న కన్ను మాయమవుతాయో అతడి చేతిలోనే ఈ బాలుడు చంప బడతాడు.
ఇంకెవ్వరు ఇతణ్ణి చంపలేరు”” అని చెప్పింది.
ఆ మాటలు విని
వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. పసివాణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరికీ అతణ్ణి
ఎత్తుకోడానికి చేతికిచ్చారు. శిశుపాలుడి తల్లి సాత్వతి శ్రీకృష్ణుడికి మేనత్త.
వికృత రూపంతో పుట్టిన మేనళ్ళుణ్ణి, మేనత్త సాత్వతిని చూడాలని ఒకరోజు శ్రీకృష్ణుడు
వెళ్ళాడు.
వాసుదేవుణ్ణి
ప్రేమతో ఆదరించింది సాత్వతి. అతిథి
మర్యాదలు పూర్తయ్యాక తన కొడుకు శిశుపాలుణ్ణి అతడి చేతికి అందించింది. శ్రీకృష్ణుడు
అతణ్ణి అందుకోగానే శిశుపాలుడికి ఉన్న నాలుగు చేతుల్లో రెండు చేతులు, నుదిటి మీద
ఉన్న కన్ను మాయమయ్యాయి.
అది
చూసి సాత్వతి ఆశ్చర్యంగా తన కొడుకు మరణం నారాయణుడి చేతిలో ఉందని తెలుసుకుంది.
వెంటనే ““ముకుందా! వీడు పరమ దుష్టుడైనా,
నీకు ఇష్టుడు కాకపోయినా, నీతో వినయంగా ప్రవర్తించక పోయినా కరుణించి వంద తప్పుల
వరకు ఇతణ్ణి క్షమించు!”” అని వేడుకుంది. భగవంతుడైన జనార్దనుడు ఆమెకు ఆ వరాన్ని
ప్రసాదించాడు.
శ్రీకృష్ణుడికి
మేనల్లుడే అయినా కూడా శిశుపాలుడు పెరిగి పెద్దవాడయ్యాక జరాసంధుడు మొదలైన వాళ్ళతో
జత కలిపి అతడి శత్రువుల్లో ఒకడుగా మారాడు.
అన్ని దేశాల నుంచి వచ్చిన రాజులు ఎంతో వైభవంగా ధర్మరాజు
చేస్తున్న రాజసూయ యాగాన్ని సంతోషంగా చూస్తున్నారు. అనేకమంది క్షత్రియ వీరులతో నిండిపోయింది
సభ.
సభలో
ఉన్న భీష్ముడు ధర్మరాజుతో “ధర్మరాజా! అందరికి ఇష్టమైనవాడు, లోకంలో అందరితోను గౌరవింపబడేవాడు అయిన
గొప్పవాణ్ణి ఒకణ్ణి ఎంచుకుని అతడికి అర్ఘ్యపాద్యాలతో పూజచేసి ఈ సభలో సత్కరించు!” అన్నాడు.
భీష్ముడు ఇచ్చిన
సలహాకి ధర్మరాజు చాలా సంతోషించాడు. కాని, ఎవర్ని సత్కరించాలో తేల్చుకోలేకపోయాడు.
“మహాత్మా! ఈ రాజ లోకంలో అటువంటి
గొప్పవాడు, సత్కారానికి అర్హుడయినవాడు ఎవరో నాకు తెలియడం లేదు. పెద్దలు మీరే
నిర్ణయించి చెప్తే, మీరు చెప్పినట్టే అతణ్ణి సత్కరిస్తాను” అన్నాడు వినయంగా.
“పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుడు తప్ప
నువ్విచ్చే అర్ఘ్యాన్ని అందుకోడానికి అర్హత కలిగిన గొప్పవాడు ఇంకెవరున్నారు?
అతడికే ఆ సత్కారాన్ని అందించు!” అన్నాడు భీష్ముడు.
పెద్దవాడైన
భీష్ముడి మాటల్ని గౌరవించి ధర్మరాజు సహదేవుడు తెచ్చిన అర్ఘ్యాన్ని తీసుకుని
శ్రీకృష్ణుణ్ణి శాస్త్రోక్తంగా పూజచేసి సత్కరించాడు.
అది చూసి
ఓర్చుకోలేక శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి చూసి ఆక్షేపణ చేస్తూ “ధర్మరాజా! దేశదేశాల నుండి వచ్చిన రాజులు అనేక మంది ఉండగా,
నియమనిష్ఠులు, శిష్టాచారులు అయిన బ్రాహ్మణులు ఎంతో మంది ఉండగా గాంగేయుడి మాట విని శ్రీకృష్ణుణ్ణి సత్కరించి
నీ అవివేకాన్ని తెలియ పరుచుకున్నావు.
ధర్మపరుడివని,
పూజ్యుడివని నీ సుగుణాలు విని రాజలోకమంతా కదిలి వచ్చింది. వాళ్ళందరినీ నువ్వు
అవమానించావు. ఈ శ్రీకృష్ణుడు నీ సత్కారనికి అర్హుడని అనుకున్నావా? ఇతడు నీకు
ఇష్టమైన వాడయితే కావలసినంత ధనమిచ్చి పంపించు.
ఈ
సభలో మావంటి గొప్ప గొప్ప మహారాజులున్నారు, కృపాచార్యులు, ద్రోణాచార్యుల వంటి
ఆచార్యులు ఉన్నారు. అటువంటివాళ్ళని పూజించవచ్చు కదా?“ అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ సభలోంచి లేచి
వెళ్ళిపోయాడు. అతడితో పాటు అతడి స్నేహితులు కూడా వెళ్ళిపోయారు.
శిశుపాలుడు, అతడి
స్నేహితులు కలిసి వెళ్ళిపోవడం చూసిన ధర్మరాజు వీళ్ళందరూ కలిసి యుద్ధం మొదలుపెడితే తను
చేస్తున్న యాగం మధ్యలో ఆగిపోతుందని అనుకున్నాడు. శిశుపాలుడి దగ్గరికి వెళ్ళి అతడితో
శాంతంగా మాట్లాడి లోపలికి రమ్మని ప్రాధేయపడ్డాడు.
ఎంతమంది
ఎన్ని విధాలుగా చెప్పినా అతడు తన మూర్ఖత్వాన్ని మాత్రం వదల్లేదు. కృష్ణుడికి
ఎదురుగా నిలబడి అతణ్ణి తిట్టడం మొదలుపెట్టాడు.
రాజలోకమంతా
చూస్తుండగా చక్రధారుడు “ప్రాగ్జ్యోతిషంలో ఉండే భగదత్తుడి మీదకి
నేను దండెత్తి వెళ్ళినప్పుడు ఈ శిశుపాలుడు అన్యాయంగా ద్వారకానగరంలో ప్రవేశించి నగర
ప్రజల్ని బాధపెట్టి ఆ నగరాన్ని కాల్చేశాడు.
మా భోజవంశపు
రాజులు వాళ్ళ కుటుంబాలతో కలిసి రైవత పర్వత ప్రాంతంలో ఆనందంగా గడుపుతున్న సమయంలో
వాళ్ళని చంపేశాడు.
వసుదేవుడు యజ్ఞం
చేద్దామనుకున్న సమయంలో అతడి గుర్రాన్ని దొంగిలించుకుని వెళ్ళి దాచిపెట్టాడు.
నన్ను అనేకసార్లు
మాటలతో నిందించాడు. ఇతడు పుట్టినప్పుడు చూడడానికి వెళ్ళినప్పుడు మా అత్త సాత్వతి
ఇతణ్ణి నూరు తప్పుల వరకు క్షమించి వదిలెయ్యమని చెప్పింది. అమె చెప్పినట్టే
చేస్తానని ఆమెకి మాట ఇచ్చాను.
ఇప్పుడు మీ అందరి
ఎదురుగా ఏ కారణం లేకుండా నన్ను తిట్టడం మీరందరూ చూశారు. ఇతడు చేసిన తప్పులు ఇప్పటికే
నూరు దాటాయి కనుక, ఇతణ్ణి ఇప్పుడే ఇక్కడే సంహరిస్తున్నాను” అని చెప్పి తన చక్రాన్ని వదిలి పెట్టాడు.
అది వెళ్ళి రాజలోకమంతా
భయంతో చూస్తుండగా శిశుపాలుడి తల నరికి తిరిగి శ్రీకృష్ణుణ్ణి చేరింది.
అవసరానికి ఆదుకునే దైవాన్నే దూషిస్తే
ఇంక ఆదుకునేది ఎవరు?
No comments:
Post a Comment