సజ్జనసాంగత్యం
సంవరణుడు కథ
చిత్రరథుడు పాండవులు మంచి స్నేహితులు. ఒకళ్ళ మంచిని మరొకళ్ళు కోరుకోవడమే
స్నేహ బంధం. అందుకే
చిత్రరథుడు పాండవుల మంచిని కోరుతూ ధర్మరాజుకి ఒక మంచి సలహా ఇచ్చాడు. “
“పాండవ కుమారులారా! మీరు ధర్మ
ప్రవర్తన, క్రమశిక్షణ, బలపరాక్రమాలు కలిగినవాళ్ళు. మీరు దారి తప్పకుండా ఎప్పుడూ ఇలాగే
ఉండడానికి, అవసర సయయంలో తగిన సలహాలు ఇవ్వడానికి మంచివాడు విద్యాసంపన్నుడు అయిన ఒక గురువు మీకు కావాలి.ఎప్పుడూ విజయమే కలిగేట్టు, ధర్మమార్గంలోనే
నడుచుకునేట్టు మీతోనే ఉండి తగిన సలహాలు ఇస్తుంటాడు.
దీన్ని గురించి మీకు ఒక కథ చెప్తాను వినండి”!” అన్నాడు.
“”పూర్వం ’సంవరణుడు’ అనే రాజు గురువు సహాయం వల్ల
సూర్యుడి కుమార్తె తపతిని పెళ్ళి చేసుకున్న కథ. సూర్యుడికి చక్కటి లక్షణాలతో
అందాలరాశి అయిన కుమార్తె ఉండేది. ఆమె రూపంలోను, గుణంలోను, విద్యల్లోను రాణిస్తూ యుక్త
వయస్సుకొచ్చింది. ఆదిత్యుడు అన్ని విధాలుగా తగిన వరుణ్ణి చూసి ఆమెకి పెళ్ళి
చెయ్యాలని అనుకున్నాడు.
సంవరణుడు
భరతవంశంలో పుట్టిన అజామిళుడి కొడుకు. గుణవంతురాలు, విద్యావంతురాలు, రూపవంతురాలు అయిన తపతి గురించి విని ఆమెనే
పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడు.
ఎంత గొప్ప రాజయినా కూడా రాజ కుమార్తెనయితే ఏదో విధంగా పెళ్ళి చేసుకోగలడు. లోకాలన్నింటినీ
తన ప్రకాశంతో రక్షించే సూర్యభగవానుడి కుమార్తెని పెళ్ళి చేసుకోవాలనుకుంటే అంత సులభమయిన విషయం కాదు కదా!
సూర్యుడు
తనను అనుగ్రహించాలని తపతిని తనకిచ్చి పెళ్ళి చెయ్యాలని కోరుకుంటూ ప్రతిరోజు
నిష్ఠతో సూర్యుణ్ణి ఆరాధిస్తున్నాడు సంవరణుడు. భగవంతుడైన భాస్వంతుడు(సూర్యుడు) భక్తితో తనని సేవిస్తున్నసంవరణుడి
కోరికని తెలుసుకున్నాడు.
గగన మండలంలో గొప్ప ప్రకాశంతో తను
వెలుగుతున్నట్టే, భూమండలంలో గొప్ప ధర్మ ప్రవర్తనతోను, బలపరాక్రమాలతోను, కీర్తితోను
సంవరణుడు ప్రకాశిస్తున్నాడు. కనుక అతడే తన కుమార్తెకి తగిన వరుడు అని
నిశ్చయించుకున్నాడు.
ఒకరోజు
సంవరుణుడు వేటకోసం అడవికి వెళ్ళాడు. అడవిలో తిరిగి తిరిగి అతడి గుర్రం అలిసిపోయి
ఒక చోట చతికిలపడింది. ఇంక అది లేవదని అర్ధం చేసుకుని రాజు కాలి నడకన బయలుదేరాడు. నడుస్తూ
నడుస్తూ ఒక కొండ ప్రాంతాన్ని చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఎప్పుడూ చూడని రూపలావణ్యాలతో ఉన్న మెరుపు
తీగలాంటి ఒక యువతి అతడికి కనిపించింది.
ఆమెను
చూసి సంవరుణుడు“ ఇంత సౌంద్యంతో మెరిసి పోతున్న ఈమె ఎవరోగాని, ఈమె శరీరం నుంచి
వచ్చే కాంతితో ఇక్కడ ఉన్న చెట్లు తీగలు కూడా బంగారు రంగుతో మెరిసి పోతున్నాయి.
మూడులోకాల్ని పరిపాలించే మహారాణిలా ఉంది.
యక్షకాంతో,
సిద్ధకన్యో, దేవతా స్త్రీయో అయి ఉంటుంది. ఇంత అందం భూలోకంలో ఎవరికి ఉంటుంది? దేవతా
స్త్రీలకి కూడా ఇంత అందమైన రూపం, వయ్యారం, సంపద ఉండదు. ఆమె ఎవరో ఎక్కడనుంచి వచ్చిందో
తెలుసుకోవాలని అనుకున్నాడు.”
నెమ్మదిగా
అమె దగ్గరికి వెళ్ళి “నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇంత దట్టంగా ఉన్న అడవిలో
ఒంటరిగా తిరుగుతున్నావు దారి తప్పి వచ్చావా? నీకు ఏదైనా సహాయం కావాలా?” ” అని అడిగాడు.
సంవరణుడు
అలా అడగ్గానే ఆమె మాయమై పోయింది.ఎటు వెళ్ళిందో, ఎలా మాయమైందో తెలియక అయోమయంగా
చూస్తూ నిలబడ్డాడు. ఆమెతో మాట్లాడాలన్న కోరిక ఒక వైపు, కనిపించకుండా ఎటు వెళ్ళిపోయిందో
మళ్ళీ కనిపిస్తుందో లేదో అనే బాధ ఇంకో వైపు అతణ్ణి కుదిపేస్తుంటే అయోమయంగా చూస్తూ
నిలబడిపోయాడు.
అంతలోనే
మళ్ళీ కనిపించింది. “నువ్వెవరు?” అని రాజుని అడిగింది.“
“అధికారంలోను, ప్రతాపంలోను,
బలంలోను, దర్పంలోను, సంపదల్లోను రాజులందరిలోకి గొప్పవాణ్ణి” అని గొప్పగా
చెప్పుకున్నాడు. “ఇంతకు ముందు నేను
ఎవరికీ భయపడలేదు. ఇప్పుడు నువ్వు నన్ను వదిలి వెళిపోతావేమో అని భయపడుతున్నాను.
గాంధర్వ పద్ధతిలో నన్ను వివాహం చేసుకో”” అన్నాడు.
ఆమె
సిగ్గుతో తలవంచుకుని“ “మహారాజా! నేను అన్ని భువనాలకి వెలుగునిచ్చే సూర్యభగవానుడికి
కూతుర్ని. నా పేరు తపతి. ఇటువంటి విషయాల్లో స్త్రీలకి స్వాతంత్ర్యం ఉండదు. నన్ను పెళ్ళి
చేసుకోవాలని అనుకుంటే నా తండ్రిని అడుగు. అతడే నన్ను నీకిచ్చి చేస్తాడు. కనుక, నా
తండ్రి సూర్యుణ్ణి ఆరాధించు”” అని చెప్పి వెళ్ళిపోయింది.
తపతి
వెళ్ళి పోయాక సంవరణుడు బాధతో మూర్ఛపోయాడు. పరిచారకులు వచ్చి రాజుకి ఉపచారాలు
చేసారు. రాజు అక్కడ పర్వత ప్రాంతంలోనే భక్తితో సూర్యుణ్ణి ఆరాధిస్తూ ఉండి పోయాడు.
ఒకరోజు
సంవరణుడు తన గురువు వసిష్ఠుణ్ణి తలుచుకున్నాడు. మహాతపశ్శాలి, బ్రహ్మతో సమానమైనవాడు
అయిన వసిష్ఠమహర్షి ప్రత్యక్షమయ్యాడు.
సూర్యుణ్ణి
ఆరాధిస్తూ ఉపవాసంతో చిక్కి శల్యమై ఉన్న రాజుని చూశాడు. అతడు తన దివ్యదృష్టితో తపనుడి
కూతురు తపతి మీద ప్రేమని పెంచుకున్నాడని తెలుసుకున్నాడు. రాజుకి సహాయం చెయ్యాలని
నిశ్చయించుకుని వెంటనే సూర్యమండలానికి చేరుకున్నాడు.
వేదమంత్రాలతో
సూర్యుడికి స్తోత్రం చేశాడు. మహర్షుల్లో గొప్పవాడైన వసిష్ఠుణ్ణి లోకాలన్నింటికీ ఇష్టుడైన
సూర్యుడు “మహాత్మా! మీరు
ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని అడిగాడు.
వసిష్ఠుడు ”ప్రభాకరా! మా రాజు సంవరణుడు
విద్యల్లోను, సుగుణాల్లోను, సౌందర్యంలోను నీ కూతురికి తగిన వరుడు. నీ కూతుర్ని
అతడికి ఇచ్చి వివాహంచేస్తే ఇద్దరూ సుఖంగా ఉంటారు!” అన్నాడు.
“మహాత్మా! మీరు చెప్పినట్టు నా
కూతురికి తగిన వరుడు సంవరణుడే! ఆమెని మీతో పంపిస్తున్నాను. ఆమెని సంవరణుడికి ఇచ్చి
వివాహం జరిపించండి” అని చెప్పి తపతిని
వసిష్ఠమహర్షితో పంపించాడు.
నిముషానికి రెండు వేల యోజనాల వేగంతో నడిచే సూర్యుడి రథాన్ని ఎక్కి శ్రమ
అనేది తెలియకుండా తపతిని తీసుకుని భూలోకానికి వచ్చాడు వసిష్ఠ మహర్షి.
శాస్త్రోక్తంగా
తపతిని సంవరణుడికి ఇచ్చి వెళ్ళి జరిపించాడు. గొప్పవాడైన వసిష్ఠుడు పురోహితుడుగా
ఉండడం వల్ల రాజు సంవరణుడు ఎన్నో గొప్ప ఫలితాల్ని పొందాడు.
గుణవంతుడైన స్నేహితుడు వెంట ఉంటే మనం
కూడా మంచి ఫలితాల్ని పొందవచ్చు!!
No comments:
Post a Comment