About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

భక్తకవులు
జ్యోతి రామలింగస్వామి
    రామలింగస్వామి గొప్ప శివభక్తుడు. 1823-1874 సంవత్సరాల మధ్యవాడు. 1823వ సంవత్సరం అక్టోబరు 5వ తేదీన చిదంబరానికి దగ్గరలో  ఉన్న నురదూరు అనే గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి రామయ్య పిళ్లే ఒక ఉపాధ్యయుడు, తల్లి చిన్నమ్మ శివభక్తురాలు
   చిన్నమ్మ గర్భవతిగ ఉన్నప్పుడు ఒక శివయోగి వచ్చి “అమ్మా! నీకు శివభక్తుడైన కొడుకు పుడతాడు. నువ్వు ధన్యురాలివి!” అన్నాడట. రామస్వామికి అయిదు నెలల వయసులో తల్లితండ్రులు అతణ్ని నటరజస్వామి ఆలయానికి తీసుకుని వెళ్లారు. ఆ పసివాడు స్వామిని తన్మయత్వంతో చూసి పకపక నవ్వాడు. అక్కడున్న పూజారికి ఆ బాలుడిలో ఒక దేవతామూర్తి కనిపించి అప్రయత్నంగా ఈ పిల్లవాడు కారణజన్ముడు’ అన్నాడట. అదే సమయంలో దేవాలయంలో ఉన్న గంటలన్నీ ఒక్కసారిగా మోగాయి అంటారు.
   రామలింగస్వామికి ఆరునెలల వయసులో తల్లి మరణించింది. పెద్దన్నయ సభాపతి తమ్ముణ్ని పెంచాడు. సభాపతి జీవనోపాధికోసం మద్రాసు వెళ్లి అక్కడ ఉపాధ్యయుడుగా స్థిరపడ్డాడు. తమ్ముడు రామలింగమంటే సభాపతికి చాలా ప్రేమ. అతణ్ని గొప్ప పండితుణ్ని చెయ్యాలని అనుకునేవాడు. అందుకనే అతణ్ని కాంచీపురంలో ఉన్న మొదలియార్ అనే పండితుడి దగ్గర శిష్యుడిగా చేర్చాడు.
   రామలింగానికి ఈ  చదువుల మీద ఇష్టముండేది కాదు. ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ పరధ్యానంగా చూస్తూ దేనికోసమో వెతుకుతున్నవాడిలా కనిపించేవాడు. సభాపతికి తమ్ముడి ధోరణి అర్థమయ్యేది కాదు. చదువుకోమని చాలాసార్లు నయానా భయానా చెప్పి చూశాడు. చివరికి జీవితం పాడుచేసుకుంటాడేమో అని బాధపడేవాడు.
   ఎక్కడెక్కడో తిరిగి అలిసిపోయి రాత్రికి ఇంటికి వచ్చిన రామలింగానికి అతడి వదిన భోజనం పెట్టేది. అంతవరకు అమె కూడ తినేది కాదు. ఒకరోజు తండ్రి ఆబ్దీకం జరుగుతోంది. బంధువులందరు భోజనాలు చేస్తున్నారు కాని, రామలింగం రాలేదు. అందరూ భోజనం చేస్తుంటే చిన్నవాడు తమ్ముడు లేడని సభాపతి బాధపడ్డాడు. వదిన సరేసరి దుఃఖాన్ని ఆపుకుంటూ ఎవరికీ కనిపించకుండా కళ్లు తుడుచుకుంటోంది.
   అంతా సద్దుమణిగే సమయానికి పెరటి దారి నుంచి రామలింగం నెమ్మదిగా లోపలికి వచ్చాడు. వదిన పరుగెత్తుకుని వెళ్లి పిల్లవాణ్ని దగ్గరికి తీసుకుని “నాయనా! ఇది నీ ఇల్లు. నువ్వెందుకు దొంగచాటుగా రావడం? ఈ కర్మెందుకు నీకు? నిన్ను చదువ్కోమన్నారుకాని, తినద్దన్నామా? అన్నయ్య కూదా నీ కోసం బాధపడుతున్నారు” అంది. రామలింగం “వదినా! నేను. మేడ మీద ఉన్న గది నాకిచ్చెయ్యి. అక్కడే  బుద్ధిగా చదువుకుంటాను!” అన్నాడు. వదిన సంతోషంతో అన్నం కలిపి తీసుకుని వచ్చి ఒళ్లో కూర్చోబెట్టుకుని తినిపిస్తోంది. అమ్మ నాన్న లేని లోటు అన్న వదినలు తీర్చారు రామలింగానికి.
    మేడ మీద గదిలో ఎదురుగా ఒక అద్దం పెట్టుకుని, దానికి ఎదురుగా ఒక జ్యోతి పెట్టుకుని ఎక్కువ కాలం ధ్యానంలో గడిపేవాడు. అద్దం స్వచ్ఛమైన మనస్సుకి, జ్యోతి పరమాత్మకి నిదర్శనం అనే భావంతో ఉండేవాడు.కొంతకాలం గడిచాక అతడిలో జ్ఞానం గంగాప్రవహంలా అతడి మెదడులోకి జ్ఞానం ప్రవేశించి అమితమైన తేజస్సుతో వెలిగిపోతున్నాడు రామలింగం. అప్పటికి రామలింగం వయస్సు తొమ్మిది సంవత్సరాలు. తనలో ప్రవేశించిన జ్ఞానంతోను, స్వతహాగ ఉన్న భక్తితోను కలిసి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని “స్వామీ! నీ దర్శన భాగ్యం కలిగించావు. మళ్లీ మాయలోకి పడిపోకుండా కాపాడు” అని అనందపారవశ్యంలో అనేక కీర్తనలు పాడుతూ ఉండే తమ్ముణ్ని చూసి అనందంతో మురిసిపోయాడు అన్న సభాపతి.
   ఒకరోజు అన్నగార్ని పిలిచి తనకి గురువుగా ఉపదేశించమని అడిగాడు. నయనార్లలో ముఖ్యుడైన జ్ఞానసంబంధర్ రాసిన పెరియపురాణం చదివాడు. శైవగితాలు, శివపురాణాలు ఒక్కసారి చదివితే చాలు గుర్తుండి పోయేవి. శ్రీమాణిక్యవాచకర్ రాసిన తిరువాచకం చదివించాడు సభాపతి. దానితోపాటే గణేశసంబంధర్ అనే శివభక్తుడి చరిత్ర చదివించాడు. చదివీ చదవగానే అర్థం చేసుకున్న రామలింగాన్ని చూసి ఇతడు తన తమ్ముడేనా? అనుకున్నాడు సభాపతి.
   ఆ ఊళ్లో సోమశెట్టి అనే పేరుగల ధనవంతుడుండేవాడు. ఆయన తన ఇంట్లో పురాణకాలక్షేపం చేయించేవాడు. సభాపతి పురాణం చచవడనికి అక్కడికి వెళ్లేవాడు. ఒకరోజు జ్వరం వచ్చి వెళ్లలేకపోయాడు. రామలింగం అన్నగారి దగ్గరికి వచ్చి “పురాణం చెప్పడానికి నేను వెడతాను. నీకు మాట రానివ్వను” అని అన్నగారి అనుమతి తీసుకుని పురాణం చెప్పడానికి వెళ్లాడు.
   అక్కడికి వచ్చేవాళ్లందరు పెద్ద పండితులే! తమ్ముణ్ని పంపించాడు కాని సభాపతికి తమ్ముడు పన్నెండు సంవత్సరాలు కూడా నిండని పసివాడు. సరిగ్గా చెప్పకపొతే పరువు పోతుందేమో అని భయపడ్డాడు. మర్నాడు ఉదయాన్నే ఇంటికి వచ్చిన సోమిశెట్టిని చూసి సభాపతి భయపడ్డాడు. సోమిశెట్టి వస్తూనే “సభాపతీ! నీ తమ్ముడు సామాన్యుడు కాడు, వరప్రసాదుడు. రామలింగం వాక్పటిమ, చెప్పే శాస్త్ర పరిచయాన్ని చూసి పెద్ద పెద్ద పండితులు ఆశ్చర్యపోయారు. ఎన్నో ప్రశ్నలు వేసి అతణ్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. రామలింగం దేనికీ తడుముకోకుండా ఎంత బాగా చెప్పాడో తెలుసా? మనస్సు ఆగక నీకు ఈ విషయం చెప్దామని వచ్చాను. దయచేసి ఇకమీదట ఆ అబ్బాయినే పంపించమని చెప్పారు. ఏమీ అనుకోక పురాణం చెప్పడానికి రామలింగాన్ని పంపించు” అని చెప్పి వెళ్లిపోయాడు.
   సభాపతికి చిన్నప్పుదు శివయోగి చెప్పిన మాటలు, చిదంబరంలో పూజారి చెప్పిన మాటలు గుర్తొచ్చి ఎదిగిపోతున్న తమ్ముణ్ని చూసి అనందపడ్డాడు. వదినగారి సంతోషానికి అవధుల్లేవు.  రామలింగం పదహారు సంవత్సరాల వయసులోకి అడుగుపెట్టాడు. యౌవనంలోకి అడుగుపెట్టినా అతడి ధ్యాస భగవంతుడి మీదే ఉండేది. ఎక్కువ సమయం మద్రాసు తిరువత్తూరులో ఉన్న శివాలయంలోనే గడిపేవాడు. అక్కడ ఎన్నో భక్తి గీతాలు రచించాడు. ఎన్ని రాసినా ఎన్ని పాడినా అతడి మనసు శాంతించలేదు. తల్లికోసం బాధపడే లేగదూడలా భగవంతుడి సాక్షాత్కారం కోసం బాధపడేవాడు.
   “తండ్రీ! నా బాధ నీకి అర్థం కాలేదా? నన్ను నీలో చేర్చుకో...నేనింక ఎక్కడికి పోగలను? తేనెటీగలు పువ్వుల మీద వాలినట్లు నీ పాదాల్ని ఆశ్రయించాను.అనుగ్రహించు తండ్రీ!” అని ప్రార్థించేవాడు. రోజు రోజుకీ పెరిగిపోతున్న అతడి భక్తి భగవంతుణ్ని చేరాలన్న కోరికతో అతడి బాధ భక్తి గీతాలుగా వెలువడి అనేక బక్తి గీతాలు అలపించాడు.
   భగవంతుడి దర్శనం కో పరితపిస్తున్న రామలింగానికి ఒకరోజు తల్లి గర్భంలో ఉన్నప్పుడు కనిపించిన శివయోగి దర్శనం కలిగింది. రామలింగం శివయోగి కాళ్లమీద పడి ఆనందబాష్పాలతో అభిషేకించాడు. “స్వామీ గురువుకోసం పరితపిస్తున్న నాకు భగవంతుడిలా కనిపించావు. భగవద్దర్శనం కలిగించు!”  అని ప్రార్థించాడు. తల్లి నుంచి వీడిపోయిన పిల్లాడిలా వెక్కివెక్కి ఏదుస్తున్నఅతడి బాధ చూసి శివయోగి “నాయనా! బాధపడకు. నీకు మంచి జరగాలనే నేను వచ్చాను. నువ్వు భక్తితో భగవంతుణ్ని గానం చెయ్యి. నీ ద్వారా లోకానికి మంచి జరిగేలా చూస్తాను. అందరిలో భగవంతుడున్నాదు. అందర్నీ ప్రేమగా చూడు. ప్రేమే త్యాగం. నా కటాక్షం నీ మీద ఎప్పుడూ ఉంటుంది.” అని అనునయించి అదృశ్యమయ్యాడు. అప్పుడుగాని అర్థమవలేదు రామలింగానికి పరమేశ్వరుడే తనకోసం గురువు రూపంలో వచ్చాడని!
   తనకు ఇష్టం లేదని ఎంత చెప్పిన విఅనకుండా అక్క కూతురు ధనమ్మతో వివాహం జరిపించారు. కాని,రామలింగం సంసార జివితం గడపకుండానే అమె మరణించింది. ఈ రకంగా భగవంతుడు సంసారబంధాన్ని తప్పించాడు.తిరువత్తూర్లో అతడి ఉపదేశాలు వినేవాళ్ల సంఖ్య అధికమయింది.
   కొంతకాలానికి తల్లి, అన్నగారు మరణించారు. తల్లికి అంత్యక్రియలు చేసి ప్రాపంచిక బంధాలు తెంచుకుని కొంతమంది భక్తులతో కలిసి చిదంబరం చేరుకున్నాడు. అక్కడనుంచి కురుకుడై చేరాడు. భక్తుల సంఖ్య పెరిగిపోయింది. అక్కడికి వచ్చినవాళ్లు ఏ వ్యాధితో వచ్చినా భగవంతుణ్ని కీర్తించి వాళ్ల వ్యాధి పోగొట్టేవాడు రామలింగం. అలాగే కుంటి, గుడ్డి, చెముడు, మూగ వంటివాటి నుంచి కూడా రక్షించాడు. అతడు ఎవరి గురించి ప్రార్థించినా వాళ్లని భగవంతుడు రక్షించేవాడు. తనకు సిద్ధించిన అవకాశాన్ని ప్రజలకోసం వినియోగించాడు రామలింగం.  
   దగ్గర్లో ఉన్న వడలూరు గ్రామం చేరుకుని అక్కడే తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ’సమరస శుద్ధ సన్మార్గ సత్సంగం’ అనే ఒక సంస్థని 1856లో స్థాపించాడు. “అందరినీ భక్తులుగా మార్చడమే నా లక్ష్యం. ఎవరినీ ప్రలోభ పెట్టను. ఇష్టమున్నవాళ్లు నా ఉపదేశాన్ని ఆచరించండి. లేనివాళ్లు బాధపడకండి. ప్రతి వ్యక్తిలోను, ప్రతి జీవిలోను భగవంతుణ్ని చూడగలగడం గొప్పదైన విషయం. అన్ని రూపాల్లోను లేదా అన్ని జీవరాసుల్లోను ఉన్న భగవంతుణ్ని గుర్తించి జీవించడమే భగవంతుణ్ని సేవించడం. ధనం మీద ఆశ, కీర్తిమీద కాంక్ష, అహంకారం, ఈర్ష్య ప్రతి మనిషి విడిచిపెట్టాలి” అని రామలింగం ధర్మబోధ చేసేవాడు.
   1867లో నిత్యాన్నదానానికి నడుంకట్టి అన్నశాలని స్థాపించాడు. 1871లో వడలూరులో సత్యగాన సభని స్థాపించి అఖండజ్యోతిని వెలిగించాడు. ఒకరోజు ఆశ్రమంలో నూనె లేకపోతే నీళ్లు పోసి వెలిగించమన్నాడు. ఆశ్చర్యపోయిన భక్తులతో “ఇంతమంది భక్తులున్నచోట భగవంతుడు సహకరిస్తాడని చెప్పి వెలిగిన జ్యోతిని చూపించాడు.
   మనసా వాచా కర్మణా భగవంతుణ్ని నమ్మి కీర్తిస్తే భగవంతుడే భక్తుడికి వశమవుతాడు. ప్రతి మనిషిలోను ఏడు తెరలుంటాయని.. ఆ తెరలు తీసినప్పుడే తనలో ఉండే జ్యోతిని చూడగలడని చెప్పాడు. శరీరం దీపమని, రక్తం తైలమని, వీర్యం వత్తి అనీ అత్మే జ్యోతి అనీ దీపాన్ని ఎలాగయితే జాగ్రత్తగా చూసుకుంటున్నమో అలాగే శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. ఎందుకంటే శరీరం లేకపోతే ఆత్మదర్శనం జరుగదు కనుక!
   దివ్యకాంతుల వెలుగులో పరమాత్మ తేజోమయమైన స్వరూపాన్ని వివరిస్తూ 1500 గీతాలు రచించాడు. ఆయన ఇచ్చిన ఉపదేశాలతో వడలూరు ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. 1874 వ సంవత్సరం జనవరి 30వ తేదీ వడలూరు ఆశ్రమం, గది తలుపులు , కిటికీలు మూసి గదిలోకి వెళ్లిన రామలింగస్వామి బయటికి రాలేదు. తను జ్యోతి రూపంలో ప్రపంచమంతా తిరుగుతానని గది తలుపులు తీసినా అక్కడ చూడగలిగేది శూన్యం తప్ప ఇంకేమీ ఉండదని చెప్పారని శిష్యులు చెప్పినట్టుగా చెప్తారు.
   భగవంతుడి రూపాన్ని వర్ణిస్తూ 1500కి పైగా గీతాల్ని మనకందించి శరీరంతోనే భగవంతుణ్ని చేరవచ్చని చెప్పిన శ్రీ జ్యోతి రామలింగస్వామికి నమస్సులు! 

No comments:

Post a Comment