About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

వేసవి శలవులకి తాతగారి ఊరు వచ్చిన పిల్లలకి నాన్నమ్మ చెప్పిన కథలు
నాన్నమ్మ చెప్పిన గుంటనక్క కథ
    ఉమ్మడి కుటుంబాల్లో నాన్నమ్మలు, తాతయ్యలు ఇంట్లోనే ఉంటారు కనుక అక్కడే ఉన్న పిల్లలు, ఊరినుంచి వేసవి సెలవులకి వచ్చిన పిల్లలతో  కలిసి చాలామందే చేరిపోయారు కథకోసం. రాబోయే తరగతుల పాఠాలు ముందే మొదలవడం వల్ల పిల్లలు కూడా చదువుకోవలసినవన్నీ చదివేసుకున్నారు.
   పిల్లలందరూ పెందరాడే అన్నాలు తినేసి నాన్నమ్మ కోసం వచ్చేశారు. కాని, నాన్నమ్మ మాత్రం ఇంకా రాలేదు. వాళ్ల స్నేహితుల కబుర్లు, వాళ్ల బడిలో జరిగిన సంఘటనలు, వాళ్ల ఊరి విశేషాలు అన్నీ మాట్లాడేసుకుంటున్నారు.
   పక్క గదిలో ఉన్న నాన్నమ్మ వీళ్ల గొడవకి “ “భడవలు! కథంటే చాలు సరిగ్గా సమయానికి వచ్చేస్తారు. ఈ సమయ పాలన బడికి వెళ్లేటప్పుడు ఉండదు!”  అనుకుంటూ కళ్లజోడు పెట్టుకుంటూ ““ ఏమర్రా! ఈ రోజు నాకంటే ముందే వచ్చేశారా? చదవాల్సినవన్నీ చదివేరా? లేదా? అని అడిగింది.
   ఓ! అన్నీ చదివేశాం!..అన్నీ రాసేశాం! ఇవాళ ఏం కథ చెప్తున్నావు నాన్నమ్మా!” అనడిగారు పిల్లలు ఏకకంఠంతో.
   “ఈ రోజు కథ పేరు ’గుంటనక్క!’ అనగానే పిల్లలందరూ సర్దుకుని సిద్ధంగా కూర్చున్నారు.
   నాన్నమ్మ కథ మొదలుపెట్టింది. అవధానపురం అనే ఊళ్లో ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. అతడి దగ్గర బోల్డన్ని కోళ్లు ఉండేవి. పెద్దవి, చిన్నవి, ఆడవి, మగవి అన్నిరకాల కోళ్లూ ఉండేవి.
    వాటన్నింటికీ కలిసి ఒక చోట గుట్టగా ఆహారం వేసేవాడు. అన్నీ గుంపులు గుంపులుగా అక్కడికే వచ్చి ఆహారం తినేవి.
   రైతు ఆహారం వేసి వెళ్లగానే రోజూలాగే కోళ్లన్నీ దాన్ని తినడం కోసం వచ్చాయి. అవధానపురం అడవికి దగ్గరగా ఉండడం వల్ల అప్పుడప్పుడు నక్కలు తిరుగుతూ ఉండేవి. అలా తిరుగూ వచ్చిన గుంటనక్క ఒకటి దూరం నుంచి కోళ్లని చూసింది. “
   ఆహా! నాకీరోజు మంచి ఆహారం దొరికింది. కోళ్లు ఎంత బాగున్నాయో... చాలా ఉన్నాయి... ఒక్కరోజేం కర్మ... రోజూ వచ్చి తిని వెడుతూ ఉండవచ్చు. అదృష్టమంటే నాదే  అనుకుంది.
   వెంటనే ఆలస్యం చెయ్యకుండా చకచక నడుచుకుంటూ కోళ్ల దగ్గరికి వచ్చింది. దాన్ని చూడగానే కోడిపిల్లలు భయంతో అరవడం మొదలెట్టాయి.
   వీటి అరుపులు విని రైతు ఇంట్లోంచి బయటికి వచ్చాడు. కోళ్లని తిందామని వచ్చిన నక్క రైతుని చూడగానే పారిపోయింది. పరిగెడుతూ పరిగెడుతూ ఒక బురద గుంటలో పడింది. దాని ఒళ్లంతా బురద అతుక్కుపోయింది.
   కడుక్కుందామని దగ్గర్లో ఉన్న నదిలో దిగింది. చుట్టుపక్కల జంతువులు దాన్ని తినడం కోసం అక్కడికి వచ్చేశాయి. గుంటనక్కకి భయమేసింది. పూర్తిగా కడుక్కోకుండానే హడవిడిగా బయటకొచ్చేసి తపస్సు చేస్తున్నదాన్లా ఒక చెట్టు కింద కూర్చుంది.
   వచ్చిన జంతువులన్నీ దాన్ని చూసి ఎవరో యోగి తపస్సు చేసుకుంటున్నాడని అనుకుని దానికి సేవచెయ్యడం మొదలెట్టాయి. ప్రతిరోజూ ఆహారం తీసుకొచ్చి దానికి వెడుతున్నాయి. ఇదేదో చాలా బాగుందే! అనుకుంది గుంటనక్క.
   ఒకరోజు ఉన్నట్టుండి బాగా వర్షం పడింది. చెట్టుకింద కూర్చున్న గుంటనక్క పూర్తిగా తడిసిపోయింది. దాని శరీరం మీదున్న బురదంతా శుభ్రంగా కడుక్కుపోయింది.
   అసలునక్క స్వరూపం బయటపడింది. మిగిలిని జంతువులు దాన్ని గుర్తుపట్టి ఆశ్చర్యపోయాయి. “ఓసి గుంటనక్కా! నీ అసలు రూపం ఇదా...ఇన్నాళ్లూ యోగి రూపంలో మమ్మల్ని మోసం చేశావా... ఉండు నీ పని పడతాం! అంటూ దుడ్డుకర్రలు పట్టుకుని దాని వెంట పడి తరిమి తరిమి కొట్టాయి.
   వాటిని చూసి భయపడిన నక్క “నేను చేసిన మోసం వీటికి తెలిసిపోయింది. ఇంక ఇవి నన్ను వదిలిపెట్టవు” అనుకుంటూ ఆ దెబ్బలు భరించలేక అడవిలోకి పారిపోయింది.
   అర్థమయిందా...ఎవర్నేనా మోసం చెయ్యాలనుకుంటే కొన్ని రోజులు బాగానే గడిచినా తప్పకుండా బయటపడుతుంది. తర్వాత గుంటనక్క తిన్నట్టే తన్నులు తినాల్సివస్తుంది. అలా గుంటనక్క మొహాలేసుకుని చూడక .. ఇంక పడుక్కోండి!” అంది ఆవులిస్తూ నాన్నమ్మ.
  ఏమిటో నాన్నమ్మకి కథ చెప్తేగానీ నిద్ర రాదు... మనకి కథ వింటేగాని నిద్రరాదు.
   కథ పూర్తయ్యాక కథ రేపటికి..మనం నిద్రలోకి! అని చెప్పేది. నాన్నమ్మ ఈసారి అది చెప్పడం కూడా మర్చిపోయింది” అన్నాడు నాలుగేళ్ల నందు.
   “నేను చెప్పకపోయినా నువ్వు చెప్తావుగా! మాట్లాడకుండా పడుక్కోండి. గుసగుసలాడితే ఉతికి ఆరేస్తాను భడవల్లారా!” అంటూ నిద్రపోయిందనుకున్న నాన్నమ్మ మాట్లాడగానే పిల్లలందరు గప్ చిప్ అయిపోయారు.
పిల్లలకి నాన్నమ్మ చెప్పిన నీతి-  ఎవర్నేనా మోసం చెయ్యాలని అనుకున్నావో.. నువ్వే తన్నులు తింటావ్!

No comments:

Post a Comment