నాన్నమ్మ చెప్పిన కాకి కథ
పిల్లలందరూ
గుంపుగా వచ్చేశారు. ఆ పిల్లల్ని చూస్తే చుట్టుపక్కలవాళ్లకి కూడా ఆనందమే! రాత్రయితే
చాలు ఇది బావుండలేదు, అది బావుండలేదు అని గొడవ చేసే పిల్లలు కూడా
ఏది పెడితే అది తినేసి నాన్నమ్మ దగ్గరికి చేరిపోతున్నారు.
వాళ్ల
సంగతేమో గాని, వాళ్లని చూడగానే నాన్నమ్మ హుషారు చూడాలి ఎంత వెలిగిపోతుందో ఆవిడ
మొహం. పిల్లల్ని చూడగానే తన చిన్ననాటి సంగతులన్నీ గుర్తొస్తున్నాయేమో..!
నాన్నమ్మ కథలంటే పిల్లలకి మంచి నిషా! కథ వింటేగాని నిద్రపోరు. ఆలోచిస్తూ
కూర్చున్న నాన్నమ్మని కుదిపేసి అడిగారు పిల్లలు “నాన్నమ్మా! ఈ రోజు మంచి కథ చెప్పాలి” అని అడిగారు అందరూ కలిసి ఒకే గొంతుతో.
వాళ్లు అడిగింది
విని నాన్నమ్మ “ఏరోజుకారోజు మంచి
కథంటారేమిట్రా? కథలంటేనే మంచికోసం చెప్పేవి. కాబట్టి, అన్నీ మంచి కథలే! కాకిగోల
ఆపి కథ వినండి మరి!” అంటూ నాన్నమ్మ కథ చెప్పడం మొదలుపెట్టింది.
పిల్లలంతా నిశ్శబ్దంగా
వింటున్నారు. గొడవచేస్తే కథ చెప్పదేమో.. అని వాళ్ల భయం మరి!
“ఈ రోజు మీకు కాకి కథ చెప్తున్నాను!” అంటూ కథ మొదలుపెట్టింది నాన్నమ్మ. ఆ కాకి చాలా చాలా అందంగా
ఉండేది. అంతేకాదు, తన అందాన్ని నది నీళ్లల్లోనో, బావిలోనో, టాంకులోనో
చూసుకుని మురిసిపోతూ ఉండేది.
మహా గర్వంగా కూడా
ఉండేది. ’బ్యూటీ’ అని పేరు కూడా పెట్టేసుకుంది. మిగిలిన కాకుల్ని హేళన చేస్తూ వాటితో కలవకుండా విడిగా
ఉండేది.
ఒకసారి దానికి
నెమలి ఈకలు దొరికాయి. నెమలి ఈకలు చాలా అందంగా ఉంటాయి కదా...! వాటిని ఏరుకుని
తెచ్చుకుని ఒళ్లంతా అతికించుకుంది. బ్యూటీకి ఆనందమే ఆనందం.
నేను కూడా నెమలంత
అందంగా ఉన్నాను అనుకుంది. నెమళ్లతో స్నేహం చెయ్యడం మొదలెట్టింది. కాకుల్ని
పూర్తిగా వదిలేసింది.
ఒకరోజు బాగా
వర్షం పడుతోంది. నెమళ్లకి వర్షమంటే చాలా ఇష్టం కదా..! అవి వర్షంలో సంతోషంగా నాట్యం చేస్తున్నాయి. బ్యూటీ కూడా
వాటితో కలిసి నాట్యం చెయ్యడం మొదలెట్టింది.
కొంచెం సేపటికి
వర్షంలో తడవడం వల్ల బ్యూటీ అతికించుకున్న నెమలి ఈకలన్నీ ఊడిపోయాయి. దాని కాకి రూపం
బయటపడిపోయింది.
నెమళ్లు దాన్ని
చూసి అసహ్యించుకున్నాయి. “నువ్వు కాకివా? మా నెమలివనుకున్నాం. ఫో! ఫో! దూరంగా ఫో!” అని తరిమి కొట్టాయి.
బ్యూటీకి
బాధేసింది. “నా గర్వానికి తగినట్టే అయింది. నేను కాకిని! కాకులన్నీ కలిసి ఉండాలి.
ఉన్నదాంతో ఆనందంగా ఉండాలి. లేనిదాన్ని అరువు తెచ్చుకుంటే ఇలాగే అవుతుంది” అని
పశ్చాత్తాప పడింది.
అది వెళ్లి
దిగులుతో ఒక చెట్టు మీద కూర్చుంది. ఎప్పుడూ ఉత్సాహంగా కావ్! కావ్! అని అరుస్తూ
అడవంతా తిరిగేది బ్యూటీ. అది అలా నిరుత్సాహంగా ఉండడాన్ని మిగిలిన కాకులు చూడలేక
పోయాయి.
దాన్లో
వచ్చిన మార్పుని చూసాయి. దగ్గరకెళ్లి ఓదార్చి తమలో
కలుపుకున్నాయి.
మనం కూడా నా కులం
గొప్పది.. నా మతం గొప్పది.. అని
కొట్టుకుని చావకుండా మనమంతా మనుషులమే! అని తెల్సుకుని జీవిస్తే మనల్ని ఎవరూ ఏమీ
చెయ్యలేరు.
దేశ ప్రగతి
ఉన్నది మీ చేతుల్లోనే కదర్రా! విన్నారా... అన్నట్లు పిల్లలవైపు చూసింది నాన్నమ్మ.
కథ శ్రద్ధగా
వింటున్న పిల్లలు “మేము ఎవరితోనూ గొడవపడకుండా కలిసి
మెలిసి ఉంటాం నాన్నమ్మా! మేము దేశాన్ని రక్షిస్తాం!” అన్నారు ఉత్సాహంగా.
అయితే ఇంకేం! ఈ
రోజు కథ పూర్తయింది. కథ రేపటికి.. మనం నిద్రలోకి! అంటూ నాన్నమ్మ నిద్రపోయింది.
పిల్లలు కూడా “రేపటి దేశ నేతలం మనమే కదురా..!” అని చెప్పుకుంటూ దేశాన్ని
రక్షిస్తున్నట్టు కలలుకంటూ తృప్తిగా నిద్రపోయారు.
నాన్నమ్మ కథలో పిల్లలకి నీతి “మతాలు, కులాలు కాదు జాతి గొప్పది” అని
తెలుసుకోవాలి!
No comments:
Post a Comment