నాన్నమ్మ చెప్పిన ఏనుగుపిల్ల కథ
“నాన్నమ్మా! నాన్నమ్మా!”
అరుస్తున్నాడు నందు. నాన్నమ్మా! చూడు ఈ సోముగాడు.. నన్నేడిపిస్తున్నాడు.
నన్ను వాళ్లతో ఆడడానికి రావద్దని తోసేస్తున్నాడు. కిందపడ్డాను. ఎంత దెబ్బ తగిలిందో
చూడు. వాణ్ని ఎప్పుడోప్పుడు చంపేస్తాను” ఏడుస్తూ వచ్చాడు నందు.
నాన్నమ్మ వేగంగా
వచ్చింది. నందుకి తగిలిన దెబ్బ చూసి “అయ్యో! బాగా తగిలిందిరా! ఏడవకు.. ఆ సోముగాడి
సంగతి నేను చూస్తానులే. మందు రాస్తాను తగ్గిపోతుందిలే నాన్నా!” ఓదారుస్తూ దగ్గర
కూర్చోబెట్టుకుంది నాన్నమ్మ.
“ఒరేయ్! నందూ!
ఒకమాట చెప్తాను వినరా! నువ్వు చిన్న పిల్లాడివి. వాళ్లు నీ కంటే పెద్దవాళ్లు. వాళ్ల
ఆటలు నువ్వు ఆడలేవు. వాళ్ల దూకుళ్లకి అదుపూ విడుపూ ఉండదు. మధ్యలో వెడితే ఇలా దెబ్బలే తగుల్తాయి. ఎందుకంటే నువ్వు చాలా
చిన్నవాడివి కదా! సరేలే! అందర్నీ రమ్మను. నేను ఇవాళ నువ్వడిగిన కథే చెప్తాను” అంది
నాన్నమ్మ.
నందూ తుర్రుమని
పరుగెత్తుకుని వెళ్లి “నాన్నమ్మ కథ చెప్తోంది. నా ఒక్కడికే చెప్తోంది. మీరు నన్ను
పడేశారుగా” అంటూ వచ్చినంత వేగంగా వెనక్కి వెళ్లిపోయాడు.
నందూ చెప్పింది
విని “ఒరేయ్! నాన్నమ్మ కథ మొదలుపెట్టేసింది. అందరూ వచ్చెయ్యండి” అని చెప్పుకుంటూ
పిల్లలందరూ వచ్చేశారు. నాన్నమ్మ ముందే వచ్చేసింది.
పిల్లలూ! ఇవాళ
నందూ అడిగిన ఏనుగుపిల్ల కథ చెప్తున్నాను. ఏరా నందూ! చెప్పనా? అని అడిగి చెప్పడం
మొదలుపెట్టింది.
ఒక ఊరికి
దగ్గరగా ఉన్న అడవిలో చక్కటి అందమైన పులిపిల్ల ఉండేది. అది ఆడుతూ పాడుతూ తిరుగుతూ
ఉండేది. దానికి తను చాలా అందంగా ఉంటానని చాలా గర్వపడుతూ ఉండేది. ‘రోజా’ అని ఒక మంచి పేరు పెట్టకుని అన్ని జంతువుల దగ్గరికి
వెళ్లి వెక్కిరించేది.
ఆ అడవిలో ఒక
ఏనుగు పిల్ల కూడ ఉండేది. అది ‘రోజా’ అని పులిపిల్ల పెట్టుకున్న
పేరు చూసి తను కూడా ‘జంబు’ అని పేరుపెట్టుకుంది. దాన్ని
పట్టుకుని పులిపిల్ల “నీ చెవులు చేటల్లా, కాళ్లు స్తంభాల్లా, శరీరం కొండలా
ఉంటుంది. నీ రంగు నల్లగా అసలే బాగుండదు” అంటూ ఏడిపించేది.
పాపం జంబూ ఏమీ
అనేది కాదు. ఒకరోజు జంబూని ఏడిపిస్తూ పరుగులు పెడుతున్న రోజా ఒక బావిలో పడింది.
అందులోంచి బయటికి రాలేక ఏడుస్తూ రక్షించమని అరుస్తోంది.
జంబూ దాన్ని చూసి
“రోజా! అందర్నీ ఏడిపిస్తోంది.. బాగా అయ్యింది.. ఆ బావిలోనే ఉండనియ్యి” అనుకుంది.
కాని, అంతలోనే రోజా
ఏడుస్తుంటే జంబూకి జాలేసింది. హాయిగా అడవంతా తిరుగుతూ ఆడుకునేది. ఏడిపిస్తే ఏడిపించిందిలే!
దాన్ని మాత్రం ఎలాగయినా పైకి లాగాలి అనుకుని అక్కడే పాకుతున్న నాగరాజుని
పిలిచింది.
“నాగరాజూ! పాపం
రోజా బావిలో పడిపోయింది తీద్దామా?” అంది.
నాగరాజు కూడా రోజాని
చూసి బాధపడ్డాడు. వెంటనే ఇద్దరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు. నాగరాజు తనలో కొంత
భాగం జంబు నడుముకి చుట్టలుగా చుట్టుకున్నాడు. జంబు బావిలోకి బాగా వంగింది. నాగరాజు
తోకభాగం జంబు నడుమునుంచి తాడులా వ్రేలాడేలా బావిలోకి వంగాడు.
నాగరాజుని
పట్టుకుని రోజా నెమ్మదిగా పైకి వచ్చింది. జంబూని, నాగరాజుని చూసి ఏడుస్తూ
దండంపెట్టి “మీరిద్దరూ నన్ను రక్షించకపోతే ఈ
పాటికి అక్కడే చచ్చిపోయి ఉండేదాన్ని. మీరిద్దరూ మంచివాళ్లు కనుక నేనెంత
ఏడిపిస్తున్నా మనసులో ఉంచుకోక నన్ను రక్షించారు. అందం కంటే మంచి మనస్సే గొప్పదని
అర్థం చేసుకున్నాను. ఇంకెప్పుడూ ఎవర్నీ ఏడిపించను” అంది.
రోజాలో వచ్చిన
మార్పుకి నాగరాజు, జంబులు సంతోషించారు. “రోజా! నువ్వు చెప్పినట్టు మంచి మనస్సుతో అందరికీ సహాయపడుతూ అనందంగా జీవించాలి కాని,
ఎదుటివాళ్ల రూపాన్ని చూసి వెక్కిరించకూడదు. ఇప్పుడు మనమందరం స్నేహితులం కదూ..!” అంటూ ముగ్గురూ కలిసి సంతోషంగా
అక్కడి నుంచి వెళ్లిపోయారు అని చెప్పి కథ ముగించింది నాన్నమ్మ.
తమ కంటే
చిన్నవాడైన నందూని ఏడిపించినందుకు సోము బాధపడ్డాడు. “నందూ! రేపటి నుంచి నువ్వు కూడా మాతో కలిసి ఆడుదువుగాని.
నీకొచ్చిన ఆటలే ఆడుకుందాం!” అన్నాడు.
నందూ కూడా
సంతోషంగా “అలాగే సోమూ! ఒకవేళ మీరు ఆడే ఆట నాకు
రాకపోతే నేను ఊరికే చూస్తూ కూర్చుంటాను. మీ మధ్యకి వచ్చి అల్లరి చేసి మిమ్మల్ని
విసిగించను. రేపటి నుంచి నాన్నమ్మ చెప్పిన
కథలోలాగా మనందరం కలిసే ఆడుకుందాం.
అమ్దరికీ
నాన్నమ్మ చెప్పిన కథలో నీతి తెలిసిందిగా.. ‘రూపం కంటే మమ్చి మనస్సే గొప్పది!’, ఈ రోజుకి కథ కంచికి... మనం నిద్రలోకి” అంటూ పడుక్కున్నాడు బుజ్జి నందు.
వాళ్ల మాటలు విని
నందు ఏడుపు మానేసి అందరితో కలిసిపోయినందుకు అనందిస్తూ తను కూడా నిద్రపోడానికి
సిద్ధమయింది నాన్నమ్మ!
No comments:
Post a Comment