About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నాన్నమ్మ చెప్పిన కథలు

 

నాన్నమ్మ చెప్పిన అమ్మప్రేమ కథ

   నందూకి వాళ్లమ్మంటే చాలా ఇష్టం. కాని, వాళ్లమ్మ మాత్రం ఎక్కువగా అక్కతోనే మాట్లాడుతుంది. నన్నూ, అక్కని చక్కగా తయారు చేస్తుంది.

   నోట్లో పెట్టి ఇద్దరికీ అన్నం తినిపిస్తుంది. పుస్తకాల సంచి, టిఫిన్ బాక్సు ఇద్దరికీ ఇస్తుంది. నన్ను బస్సులో బడికి పంపిస్తుంది. అక్కని మాత్రం తనే బడికి తీసుకుని వెళ్లి దింపివస్తుంది.

   బడి అయిపోయాక తను చేస్తున్న పనులన్నీ వదిలేసి బడికి వెళ్లి దగ్గరుండి అక్కని తనే స్వయంగా తీసుకుని వస్తుంది. నేనేమో బస్సులోనే వస్తాను.

  ఇంటికి వచ్చాక ఇద్దరికీ స్నానం చేయించి, తినిపించి హోం వర్కు దగ్గర కూర్చోబెడుతుంది. అక్కకి మాత్రం చదువుకునేప్పుడు తనే దగ్గర కూర్చుని అన్నీ నేర్పిస్తుంది.

   నందూకి అమ్మ ఎప్పుడూ తనతోనే మాట్లాడాలని, తను అమ్మ కలిసి ఆడుకోవాలనీ ఉండేది. అమ్మకి ఎప్పుడూ పనితోనే సరిపోయేది.

  అక్కని బడికి పంపించి, ఇంట్లో అందరికీ కావలసిన అవసరాలు చూడడం అమ్మపనే. నాన్నగార్ని ఆఫీసుకి పంపించేవరకు అన్నీ అందించేది.

  తర్వాత మిగిలిన పనులు, మేము పడేసినవన్నీ సర్దుకోడం. మళ్లీ వండుకోడం. ఇంట్లో ఉండే నాన్నమ్మకి కావలసినవి అందించేది.

   మళ్లీ సాయంత్రం అమ్మ పనులు మామూలే. అమ్మ పనులన్నీ పూర్తయ్యి వంటగది సర్దుకుని వచ్చేటప్పటికి బాగా రాత్రయిపోయేది. అప్పటికి నందూకి నిద్ర వచ్చేసేది.

   అందుకే నందూటూ ఎప్పుడూ అమ్మకి తనంటే ఇష్టం లేదనే ఆలోచనలతో సతమతమయ్యేవాడు. అసలు నేనంటే అమ్మకి ఇష్టం లేదు. అక్కంటేనే అమ్మకి చాలా ఇష్టం అనుకునేవాడు.

   నందూ ఆలోచనలు నందూ అమ్మకి తెలియదు. కాని, నందూ భావాలు వాళ్ల  నాన్నమ్మకి బాగా అర్థమయ్యేవి. అమ్మకి నందూ మీద కూడా చాలా ప్రేమ ఉందని వాడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంది.

   ఒకరోజు నందూని పిలిచి నందూ! అమ్మకి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని ఉందా?” అని అడిగింది.

   నందూ నాన్నమ్మ మాటలకి మూతి ముడుచుకుని “నాకు తెలుసులే! అమ్మకి నా మీద అసలు ప్రేమ లేనేలేదు” అన్నాడు బాధగా.

   నాన్నమ్మ వాడిని దగ్గర కూర్చోబెట్టుకుంది. వాడితో నెమ్మదిగా చెప్పింది. నేనొక ఉపాయం చెప్తాను. నువ్వు అలా చెయ్యి. నువ్వంటే అమ్మకి ప్రేమ ఉందో లేదో.. నీకే తెలుస్తుంది అని చెప్పింది.

   వెంటనే నందూ నాన్నమ్మ చెప్పినట్టే చేస్తానని చెప్పాడు. నాన్నమ్మ నందూతో నువ్వు అమ్మ ఒళ్లో కూర్చుని అమ్మ కళ్లల్లోకి చూడు. ఎవరు కనిపిస్తారో వాళ్ల మీద అమ్మకి ప్రేమ ఉన్నట్లు!

   నీకు అమ్మ కళ్లల్లో అక్క కనిపిస్తోందా.. నేను కనిపిస్తున్ననా.. నాన్న కనిపిస్తున్నారా.. నువ్వు కనిపిస్తున్నావా.. బాగా చూడు అని చెప్పింది.

   వెంటనె నందూ పరుగెత్తుకుంటూ వెళ్లి అమ్మ ఒళ్లో కూర్చున్నాడు. అమ్మ మొహం తనవైపు తిప్పుకున్నాడు.

   అమ్మ కళ్లల్లోకి చూశాడు. అమ్మ కళ్లల్లో తనే కనిపించాడు. ఒక కన్ను తరువాత ఒక కన్నులోకి చూసాడు. రెండు కళ్లల్లోనూ తనొక్కడే ఉన్నాడు.

   ఒక్క కంట్లో కూడా అక్క కనిపించలేదు. నాన్న, నాన్నమ్మ, తాత ఎవరూ కనిపించలేదు. ఒక్కసారి కూడా అమ్మ కళ్లల్లో అక్క కనిపించలేదు.

   అంటే, అమ్మకి తనంటేనే చాలా ఇష్టం. పరుగెత్తుకుంటూ వెళ్లి నాన్నమ్మకి చెప్పేశాడు. తనంటేనే అమ్మకి ఇష్టమని తెలుసుకుని సంతోషంగా ఇల్లంతా తిరిగేస్తున్న నందూని  చూసి నాన్నమ్మ సంతోషపడింది.

   నందూకి ఇంకెప్పుడూ అమ్మకి తనంటే ఇష్టం లేదన్న సంగతి గుర్తు రాలేదు. ఆ రోజు రాత్రి నాన్నమ్మని కథ చెప్పమని అడగడం కూడా మర్చిపోయి ఆనందంగా నిద్రపోయాడు.

   నాన్నమ్మ అనుకుంది పని హడావిడిలో పిల్లల్ని కొంత నిర్లక్ష్యం చేస్తుందేమోగాని, తల్లి తన పిల్లలు ఒకళ్లైనా, పదిమందైనా సరే అందర్నీ ఒకే ప్రేమతో చూస్తుంది. ఆడపిల్లల్ని ఒక్క ప్రేమతోనే కాదు జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. అది నందులాంటి పిల్లలు తెలుసుకోలేరు అనుకుని నాన్నమ్మ తను కూడా సుఖంగా నిద్రపోయింది.

     

No comments:

Post a Comment