ఓం
ఆనందమే
బ్రహ్మం
అది ప్రాత:కాల సమయం. గలగలా ప్రవహిస్తున్న గంగానది అలలు చేస్తున్న ధ్వని వినడానికి ఇంపుగా ఉంది. నది మీదనుంచి వచ్చే చల్లటి గాలులు శరీరాన్ని తాకి మనస్సుని చల్లబరిచి వెడుతున్నాయి.
తూర్పు దిక్కున ఉదయిస్తున్న
సూర్యుడి అరుణ కిరణాలు సూర్యుడి కంటే ముందే
ప్రవేశించి ఆకాశాన్ని ఎర్రటి
కాంతితో నింపేశాయి. కొంచెంసేపటికే అన్ని వైపులా వ్యాపించిన కిరణాలతో అందాలు
సంతరించుకున్న ఆకాశాన్ని చూస్తూ చల్లటి వాతావరణంలో కూర్చున్న భృగువు మనస్సు ఉల్లాసంగా ఉంది.
ప్రకృతిలో ఉన్న అందాన్ని
అనుభవిస్తున్నభృగువుకి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం తీర్చుకోవాలన్న కోరిక కూడా
క్షణక్షణానికి పెరిగి పెద్దదవుతోంది. తన కోరికని తండ్రికి చెప్పి అదేమిటో తెలుసుకోవాలని
అనుకున్నాడు.
వరుణ మహర్షి కుమారుడు భృగువు. అతడు
తండ్రి వరుణ మహర్షిని సమీపించి “భగవన్! బ్రహ్మం
అని దేన్ని అంటారు? దాని స్వరూపం ఎలా ఉంటుందో దయచేసి నాకు వివరించి నాకు కలిగిన
సందేహాన్ని తీర్చు!” అని అడిగాడు.
తన కుమారుడు తన
దగ్గరికి వచ్చి వినయంగా అడిగిన ప్రశ్నవిని చాలా సంతోష పడ్డాడు వరుణ మహర్షి.
కుమారుడు అడిగిన ప్రశ్నకి సరయిన సమాధానం తను చెప్పగలడు.
అయినా
చెప్పదలచుకోలేదు. ఆ విధంగా వివరించడం ఆయనకి ఇష్టం లేదు. అడిగిన దానికి వెంటనే
సమాధానం చెప్పేస్తే విద్యార్ధి బుద్ధి వికసించదని ఆయన అభిప్రాయం.
అంతేకాకుండా అలా
వివరించి చెప్పేస్తే విద్యార్ధి సోమరిగాను, ఇతరుల మీద ఆధారపడే విధంగానూ
మారిపోతాడు.
కాబట్టి
విద్యార్ధి బుద్ధికి పని చెప్పి అతడి ప్రశ్నకి అతడితోనే జవాబు చెప్పించాలన్నది ఆయన
సిద్ధాంతం. దానికి అవసరమయిన సహాయాన్ని మాత్రం గురువుగారు అందించాలి. విద్యార్థి
స్వయంగా ఆలోచించి తెలుసుకోడం వల్ల అన్ని విధాలుగా అతడి బుద్ధి వికసిస్తుందని అనుకున్నారు.
వరుణ మహర్షి
కుమారుడి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు. బ్రహ్మాన్ని అతడికి అర్ధమయ్యేలా
వర్ణించి చెప్పకుండా దానికి ఉన్న లక్షణాన్ని ఈ విధంగా చెప్పాడు.
“ఆహారం, ప్రాణం, కన్ను, చెవి, మనస్సు, వాక్కు- ఇవే భగవంతుడు" అన్నాడు.
కాని, అది విన్న
భృగువుకి ఏమీ అర్ధం కాలేదు. ఆహారం ప్రాణం భగవంతుడే అవడం ఏమిటి? తనకు కలిగిన సందేహం
మరికొంచెం పెరిగింది అనుకున్నాడు. అదంతా గందరగోళంగా అనిపించింది.
అతడి పరిస్థితిని
చూసి వరుణ మహర్షి మళ్లీ చెప్పాడు. “ఈ సమస్త సృష్టి దేని
నుంచి పుడుతోందో...దేని ఆధారం మీద నిలబడి ఉంటోందో, దేనివల్ల జీవిస్తోందో...చివరికి
అది దేనిలో లీనమవుతోందో దానికి సంబంధించిన తత్త్వమే బ్రహ్మం. దాని గురించి నువ్వు
ఆలోచించి తెలుసుకో!” అన్నాడు.
తండ్రి ఉపదేశం
చేసిన దాన్ని ఆధారంగా తీసుకుని ఆయన ఆజ్ఞని శిరసా వహిస్తూ భృగువు తపస్సు చేశాడు.
ఏకాంతంలో కూర్చుని ఇతర విషయాల మీదకి తన ఆలోచనల్ని పోనీయకుండా తండ్రి చెప్పిన
విషయాన్ని మాత్రమే ఆలోచించాడు.
మళ్లీ మళ్లీ
గుర్తుకు తెచ్చుకున్నాడు. చివరికి ఆహారమే భగవంతుడు, అదే మూలతత్త్వమని అర్థం
చేసుకున్నాడు.
ఎందుకంటే, ప్రాణికోటి
అన్నం నుంచే పుడుతోంది, అన్నం తినే జీవిస్తోంది, అన్నంలోనే లీనమవుతోంది. నడుస్తున్న
కర్మలన్నీ కూడా అన్నం మీదే ఆధారపడి ఉన్నాయి.
కాబట్టి తండ్రి
చెప్పిన మూలతత్త్వం లేదా బ్రహ్మం అన్నమే అయి ఉంటుంది అనే నిర్ధారణకి వచ్చాడు.
భృగువు ఒక
నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ విషయాన్ని తండ్రికి చెప్పాలని వరుణ మహర్షి దగ్గరికి
వెళ్లాడు. “తండ్రీ! మీరు చెప్పినట్టే తపస్సు చేసి, విచారణ చేసి నేను అన్నమే
పరబ్రహ్మం అనే నిర్ణయానికి వచ్చాను. నేను అనుకుంటున్నది నిజమేనా?“ అని అడిగాడు.
భృగువు మాటలు
విని వరుణ మహర్షి “ నాయనా! తపస్సే భగవంతుడు. తపస్సు చేసి ఆ భగవంతుణ్ని
తెలుసుకో” అన్నాడు.
భృగువు మళ్లీ
తపస్సు ప్రారంభించాడు. తండ్రి చెప్పినదాన్ని గురించి ఆలోచిస్తున్నాడు.
అన్నమే భగవంతుడు
(అన్నమంటే ఇక్కడ పంచభూతాలతో ఏర్పడిన పదార్ధం అని అర్ధం). అన్నం వల్లే ప్రాణికోటి
పుడుతోంది. అది లేకపోతే లోకంలో నడుస్తున్న పనులన్నీ ఆగిపోతాయి.
కాని, అసలు
ప్రాణమే లేకపోతే అన్నంతో ఉపయోగం ఏముంటుంది? పుడుతున్న జీవులన్నీ ప్రాణం వల్లే
జీవిస్తున్నాయి. ప్రాణం లేకపోతే జీవులు అన్నం కూడా తినలేవు కదా. అప్పుడు ఆ అన్నం
శవాన్ని బ్రతికించలేదు.
ఎలాగైనా
తినిపిద్దామని అన్నాన్ని బలవంతంగా ప్రాణం లేని జీవి నోటిలోకి పెట్టినా ఉపయోగం ఉండదు.
అది లోపలికి వెళ్లదు. వెళ్లినా ఆ శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రాణం
శరీరంలో ఉన్నంతవరకే ఆ శరీరానికి అన్నం వల్ల ఉపయోగం ఉంటుంది.
ప్రపంచాన్ని
చూడాలన్నా, ప్రపంచంలో జీవించాలన్నా, అన్నాన్ని లోపలికి గ్రహించాలన్నా ప్రాణమే
ముఖ్యం అనే నిర్ణయానికి వచ్చి ‘ప్రాణమే బ్రహ్మం’ అనుకున్నాడు. ఆ విషయాన్నే తండ్రికి చెప్పాడు.
వరుణ మహర్షి “ కుమారా! తపస్సు చేసి బ్రహ్మం గురించి తెలుసుకో. తపస్సే
బ్రహ్మం. తపస్సు వల్లే బ్రహ్మాన్ని తెలుసుకోగలవు” అని చెప్పాడు.
ఆయన చెప్పింది
విన్న భృగువు ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది పూర్తిగా సరయింది కాదు. అందుకే నేను
చెప్పిన దాన్ని విని కూడా మళ్లీ తపస్సు
చెయ్యమని చెప్పారు.
ఆయన చెప్పినట్టు
మళ్లీ చేస్తాను అనుకుని ఏకాంత ప్రదేశంలో కూర్చుని తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
తపస్సు
పూర్తయ్యాక జీవులన్నీ ప్రాణాల మీద ఆధరపడి జీవిస్తున్నా వాళ్లు చేస్తున్న పనులు
మాత్రం వాళ్ల మనస్సుల మీద ఆధారపడి ఉన్నాయి. మనిషిలో లేదా ప్రాణిలో మనస్సే గనుక
లేకపోతే మట్టిబొమ్మతో సమానుడవుతాడు.
మనస్సే భగవంతుడు.
మనస్సు నుంచే
జీవులు ఉద్భవించి, జీవిస్తున్నాయి. మరణించిన తరువాత మనస్సులోనే లీనమవుతున్నాయి.
మనస్సు ఒక గొప్ప సూక్ష్మంగా కనిపిస్తున్న ఒక శక్తి. పరమేశ్వరుడికి కలిగిన సంకల్పమే
ఈ సృష్టికి కారణమైంది.
సూక్ష్మమైన
మనస్సు అంతటా నిండి ఉంది. సృష్టి సంకల్పం లేకపోతే ఉనికి, లయం అనే ప్రశ్నే ఉండదు.
కనుక, ప్రాణం కంటే మనస్సే గొప్పది. మనస్సు వల్లే ఈ జగత్తు మొత్తం పుడుతోంది. దాని
వల్లే వృద్ధి చెందుతోంది, దానిలోనే లయమవుతోంది.
ఈ విధంగా
ఆలోచించి మనస్సే మూలతత్త్వమైన బ్రహ్మం అనే నిర్ణయానికి వచ్చాడు భృగువు. తండ్రి
దగ్గరికి వెళ్ళి “ తండ్రీ! మనస్సే బ్రహ్మం” అని చెప్పాడు.
కొడుకు చెప్పింది
విని వరుణ మహర్షి “నాయనా! తపస్సే బ్రహ్మం. తపస్సు చేసి బ్రహ్మాన్ని తెలుసుకో!” అని మళ్లీ పంపించాడు.
భృగువు మళ్లీ
తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఏకాంతంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. మనస్సు యొక్క
చలనం వాయువు యొక్క చలనంలా ఉంది. వాయువు ఎవరి అధీనంలోనూ ఉండదు. కాని, ప్రాణిలోను,
మానవుడిలోను మనస్సుని అధీనంలో ఉంచుకోగలిగే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తే బుద్ధి.
ఇది మనస్సుకంటే
సూక్ష్మమైంది. సందేహం లేకుండా ‘బుద్ధే బ్రహ్మ’ అని నిర్ణయించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి “తండ్రీ! విజ్ఞానమే బ్రహ్మం అన్నది నా ఉద్దేశ్యం బ్రహ్మం అంటే
ఎవరో మీరే నాకు ఉపదేశించండి!” అని అడిగాడు.
అంతా విని వరుణ
మహర్షి “ తపస్సు వల్లనే బ్రహ్మాన్ని తెలుసుకో. తపస్సే బ్రహ్మం!” అన్నాడు.
వరుణ మహర్షి
ఉద్దేశ్యం ఏమిటి? భృగువు ఎన్ని సార్లు వచ్చి చెప్పినా మళ్లీ మళ్లీ అదే
చెప్తున్నాడు. తపస్సే బ్రహ్మం. తపస్సుతో బ్రహ్మాన్ని తెలుసుకో అంటున్నాడు.
ఆయన అన్నిసార్లు భృగువుని తిప్పేకంటే తనే ఆ బ్రహ్మం గురించి చెప్పెయ్యచ్చు కదా? ఇలా ఆలోచించడం మన పొరపాటు అవుతుంది.
పూర్వీకుల నుంచి మనం నేర్చుకోవలసింది ఇక్కడే ఉంది. పూర్వం గురువులు శిష్యులకి విద్య బోధించిన విధానం, గురుశిష్య సంబంధం గురించి ఒకసారి ఆలోచించండి.
ఈ ప్రశ్న మనని
మనం వేసుకుంటే ఇప్పటి విద్యార్ధుల విషయంలో ఇది తప్పకుండా మనం వేసుకోవలసిన ప్రశ్నే.
ఇప్పటి విద్యార్ధుల పరిస్థితి చూస్తే స్వయంగా ఆలోచించి తెలుసుకునే స్థితి
లేనేలేదు.
నోట్సులు, గైడులు
చదివించి బట్టీ పట్టించి విద్యార్ధులకు ఉన్న బుద్ధిని వికసించనీయకుండా అణిచి
వేస్తున్నారు. అందువల్లే విద్యార్ధులు మంచి చెడులు తెలుసుకో లేక పైకి కనిపించే
మెరుగులు చూసి మురిసిపోతూ వాటిని గుడ్డిగా అనుకరిస్తూ వాటికి దాసోహం అంటున్నారు.
సంస్కృతీ సంప్రదాయాల్ని మర్చిపోతున్నారు.
కాని, మన
పూర్వీకులు అలా కాదు. గురువు ఎప్పుడూ శిష్యుడు అభివృద్ధిలోకి రావాలని కోరేవాడు. ఆ
ఉన్నతికి తగిన పరిశ్రమ స్వయంగా విద్యార్ధితోనే చేయించేవాడు. అతడి బుద్ధి
వికసించడానికి, సామర్ధ్యం కలిగి ఉండడానికి తగినట్టుగా చేయూతనిచ్చేవాడు.
కేవలం పుస్తకంలో
ఉన్నవి మాత్రమే నేర్పించి వదిలెయ్యకుండా, చదువు పూర్తయ్యాక సమాజంలో జీవించడానికి
అవసరమయిన విషయాలు కూడా తెలియపరిచేవాళ్లు. శిష్యుణ్ని సుగుణవంతుడు, సంస్కారవంతుడుగా
తీర్చిదిద్దేవాళ్లు. విద్యార్ధి సంస్కారవంతుడుగా ఎదగడానికి తగిన పునాది వెయ్యడం
కూడా బాధ్యతగా స్వీకరించేవాళ్లు.
శిష్యులు గురువు
చెప్పిన విధంగా ఎదిగి దానికి అనుగుణంగా నడుచుకునేవాళ్లు. జీవితాన్ని అతి
పవిత్రంగాను, నడవడికని ఆదర్శవంతంగాను ఉంచుకున్న గురువుకి ఎదురు చెప్పగల శిష్యుడు
ఉండనే ఉండడు.
అంటే, అప్పటి
గురువులు మొదట తాము ఆచరించి శిష్యులకి చెప్పేవాళ్లు. కనుకనే శిష్యులు కూడా భక్తి
శ్రద్ధలతో గురువు మాట జవదాటక అదే మార్గంలో నడుచుకునేవాళ్లు.
గురువు స్థానంలో
ఉన్న వరుణ మహర్షి తన కుమారుడికి సాధనలో వదలని దీక్ష, శ్రద్ధ, ఆసక్తి కలిగేటట్టు
చేసి, సాధనతో బుద్ధిని వికసింపచేసి తనకు తానుగా శ్రమించి దానిద్వారా ఫలితాన్ని
పొందేలా చెయ్యాలన్న సంకల్పంతో మళ్లీ మళ్లీ తపస్సుకు పంపిస్తున్నాడు.
తండ్రి తపస్సు
చెయ్యమని పంపించినప్పుడల్లా ఆలోచనాశక్తి, పట్టుదల, దీక్ష పెరిగాయే కాని భృగువు
మనస్సులో కూడా ఎటువంటి విసుగు కలగలేదు.
భృగువు మళ్లీ
తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఏకాంతంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అన్నం, ప్రాణం,
మనస్సు, బుద్ధి యొక్క తత్త్వాలు ఒకదానికంటే ఒకటి ఉన్నతమైన తత్త్వాలు. జీవులకి
ఇవన్నీ అవసరమే.
అసలు వీటి అవసరం
ఎందుకు? అన్నం వలన ఉపయోగం ఏమిటి? ప్రాణం ఉండడం ఎందుకు? మనస్సుద్వారా చేసే పనులు,
బుద్ధికి కలిగే జ్ఞానం దేనికోసం? అని ఇంతకు ముందు దేన్ని బ్రహ్మం అనుకున్నాడో
అన్నీంటి గురించి మళ్లీ ఆలోచించాడు.
ఏకాంతంగా
కూర్చుని ఇదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉండగా భృగువు మనస్సులో ‘ఆనందంకోసం’ అని తెలిసింది.
ప్రాణియొక్క అసలైన స్వరూపం ఆనందం. భృగువు మనస్సులో ఆలోచించి
చివరకి ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఆనందమే బ్రహ్మం. ఎందుకంటే ఆనందం నుంచే
జీవులు ఉద్భవిస్తున్నాయి. ఉద్భవించిన జీవులు ఆనందం వల్లే జీవిస్తున్నాయి. మరణించిన
తరువాత అనందంలోనే లీనం అవుతున్నాయి.
ఆనందం గురించి
ఆలోచించిన కొద్దీ అతడి బుద్ధి, తపస్సు అనబడే అగ్నిచేత సంస్కరించబడి పరిశుద్ధుడై
ఆత్మ నిష్ఠలో లీనమయ్యాడు.
తరువాత ఆనందమే బ్రహ్మమనీ అదే తన ఆత్మ
స్వరూపమని ఆత్మానుభవం వల్ల తెలుసుకున్నాడు. ఇంక తండ్రిని ప్రశ్నించే అవసరం అతడికి
లేదు.
తపస్సు చేత కలిగిన ఆ అనుభూతినే ‘ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందా ద్ధ్యేవ ఖల్వి మాని భూతాని
జాయన్తే! ఆనందేన జాతని జీవన్తి ఆనందం ప్రయన్త్యభి సంవిశన్తీతి!’ ఆనందం వల్లే
ప్రాణులు పుడుతున్నాయి జీవిస్తున్నాయి.
దానిలోనే లీనమవుతున్నాయి.
ఆనందమే బ్రహ్మం
అని ఈ ఉపనిషత్మంత్రం చెప్తోంది కనుక మనం అందరంకూడా భృగువు చేసినట్టే పట్టుదలతో
సాధన చేసి తపస్సు అనబడే అగ్నితో పవిత్రతని పొంది, జ్ఞానం కలిగి ఆనందరూపమైన
బ్రహ్మాన్నిగురించి తెలుసుకుందాం.
(తైత్తరీయోపనిషత్తు
అధారంగా)
No comments:
Post a Comment