About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

 

నాన్నమ్మ చెప్పిన పులికథ

  “ఒరేయ్! నందూ శేఖరొచ్చాడా? అని అడిగాడు సతీష్.

  “నాకు తెలియదు నువ్వే చూసుకో” అంటూ తుర్రుమన్నాడు నందు.

   వీడొకడు! అడిగిందానికి ఎప్పుడూ సమాధానం చెప్పడు” అనుకుంటూ శేఖర్ని వెతుక్కుంటూ వెళ్లాడు సతీష్. పిల్లలందరు కథ వినడానికి వచ్చేశారు. నాన్నమ్మ కూడా వచ్చేసింది. శేఖర్ మాత్రం రాలేదు.

  ఏమయిందర్రా!” అడిగింది నాన్నమ్మ.

  “శేఖర్ కనిపించట్లేదు” అన్నారు పిల్లలు.

   “ఏమవుతాడు.. ఇక్కడే ఎక్కడో ఉంటాడు చూడండి!” అంది నాన్నమ్మ.

   “అదికాదు నాన్నమ్మా! వాడు పొట్టిగా ఉంటాడు కదా.. వాడి తరగతిలో పిల్లలు వాడ్ని వెక్కిరిస్తున్నారు. అందుకే బాధపడుతున్నాడు” అన్నారు పిల్లలు.

   శేఖర్ని వెతికి పట్టుకొచ్చాడు సతీష్.. నాన్నమ్మ శేఖర్ని దగ్గర కూర్చోబెట్టుకుని “ఒరేయ్! పిచ్చివాడా! జీవితంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు.

   మనం ఏదో ఒక దాన్లో మన గొప్పతనాన్ని నిరూపించుకోవాలి గాని, ఏడుస్తూ కూర్చోకూడదు. ఏడ్చేవాళ్లని ఇంకా ఏడిపిస్తారు.

   ఈ రోజు నీ కోసం ఒక మంచి కథ చెప్తాను విను!  పిల్లలూ!  ఇంక అల్లరి ఆపి కథ వినండి!” కథ చెప్పడం మొదలెట్టింది నాన్నమ్మ.

   అడవిలో చాలా జంతువులుంటాయని చెప్పుకున్నాం కదా... ఈ రోజు పులి గురించి చెప్పుకుందాం!

   ఆ పులికి తాను బాగా అందంగా ఉంటానని.. బలంగా ఉంటానని.. తనని చూస్తే అందరూ పారిపోతారని చాలా గర్వంగా ఉండేది. ఒక రోజు అది దాని ఆహారాన్ని వెతుక్కుంటూ తిరుగుతుంటే ఒక ఎలుక దొరికింది.

   పులి పట్టుకోగానే “నా పని అయిపోయింది” అనుకుంది ఎలుక. ఏం చెయ్యాలా.. అని అలోచిస్తూ.. పులిమావా! ప్లీజ్ నన్ను వదిలెయ్యవా? ఎప్పుడేనా నేను నీకు మంచి సాయం చేస్తాగా?” అంది బతిమాలుకుంటూ.

   పులి పకపకా నవ్వింది. “నువ్వు నాకు సాయం చేస్తావా? నువ్వెంతున్నావు.. నేనెంతున్నాను!” అంటూ మళ్లీ మళ్లీ నవ్వింది గర్వంగా.

   ఎలుక మాత్రం అదేం పట్టించుకోకుండా అమాయికంగా “నిజంగా.. ఎప్పుడో ఒకప్పుడు నీకు గొప్ప ఉపకారం చేస్తాను” అంది మళ్లీ.

   పులి నవ్వుతూనే “నిన్నొదిలేస్తాలే.. అది కూడా నువ్వేదో సాయం చేస్తావని కాదు. నిన్ను తిన్నా కూడా నా ఆకలి తీరదు. నా పొట్టలో ఒక పక్కకి కూడా రావు నువ్వు. ఫో! అంటూ దాన్ని వదిలేసింది. మళ్లీ ఆహారం కోసం తిరగడం మొదలెట్టింది.

   “హమ్మయ్య! బతికిపోయాను! అనుకుంటూ తుర్రుమని పారిపోయింది ఎలుక.

   కొన్ని రోజుల తరువాత ఎలుక అడవిలో తిరుగుతూ ఒక చోట పులి కదలకుండా పడుకుని ఉండడం కనపడింది. దగ్గరగా వెళ్లి చూసింది. తనని తినకుండ వదిలేసిన పులిని గుర్తు పట్టింది.

   అది వేటగాడు విసిరిన వలలో చిక్కుకుని కదల్లేకపోతోంది. ఎలుకకి బాధేసింది. ఎలాగైనా పులిని రక్షించాలనుకుంది. గబగబా తన పళ్లతో వల తాళ్లు కొరికేసింది.

   పులి వలనుంచి బయటపడింది. ఎలుక తుర్రుమని పారిపోయింది. దాని భయం దానిదికదా..!

   వలలోంచి బయట పడిన పులికి ఇంత చిన్న ఎలుక తనని రక్షించినందుకు ఆశ్చర్యము.. సంతోషము కూడ కలిగింది. సిగ్గుపడింది కూడా. పెద్ద పెద్ద జంతువులే కాదు, చిన్న చిన్న జంతువులు కూడా పెద్దపెద్ద పనులు చెయ్యగలవు.

   శరీరం  పెద్దగా ఎత్తుగా లావుగా ఉండడం కాదు.. ఇతరులకి సాయపడడం ముఖ్యం!” అనుకుంది. అప్పటినుంచి పులి ఎప్పుడూ గర్వపడలేదు. ఇతర జంతువులకి సాయపడుతూనే జీవించింది.

   కథ చెప్పిన తాతయ్య ఒరేయ్! శేఖర్! నీ కోసమేరా ఈ కథ! పొడుగ్గా ఉన్నామా.. పొట్టిగా ఉన్నామా.. అన్నది కాదు ముఖ్యం. ఇంక పిచ్చి ఆలోచనలు వదిలేసి బాగా చదువుకో. పెద్దవాడివై సమాజానికి సేవ చేద్దువుగాని”. మనిషి ఆకారంలో ఎలా ఉన్నాడు అని కాదు సమాజానికి ఎంత ఉపయోగ పడుతున్నాడు అన్నది ముఖ్యం!

   ఒరేయ్! నందూ ఎక్కడున్నావురా.. కథ రేపటికి.. మనం నిద్రలోకి.. పడుక్కోండి! పడుక్కోండి! అంటూ నాన్నమ్మ నిద్రలోకి వెళ్లిపోయింది.

   ఇంకెప్పుడూ ఎవరేమన్నా పట్టించుకోకూడదు అనుకున్నాడు శేఖర్. పిల్లలందరు శేఖర్ కి గుడ్ నైట్’ చెప్పి నిద్రకుపక్రమించారు.   

 

No comments:

Post a Comment