About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

 

నాన్నమ్మ చెప్పిన పావురాల కథ

   నాన్నమ్మా! నాన్నమ్మా! అంటూ పరుగెత్తుకొచ్చాడు నందు.

   “ఏమిట్రా! చెప్పు.. అంది నాన్నమ్మ.

   మరేమో నాన్నమ్మా! ఇవాళ పార్కులో బుజ్జి పావురాలు చూశాను. గుంపులు గుంపులుగా ఎంచక్క ఎగురుతున్నాయో..! ఇవాళ మాకు పావురాల కథ చెప్తావా నాన్నమ్మ?” అని అడిగాడు.

   “అలాగేలేరా! అందర్నీ రమ్మను. మళ్లీ రాత్రి ఆలస్యంగా పడుక్కుంటారు” అంది నాన్నమ్మ వాడి సంతోషానికి మురిసిపోతూ.

   నందు ఆనందంగా పరుగెత్తాడు. ఈ రోజు పావురాల కథోచ్! నేనే అడిగాను నాన్నమ్మని!  గొప్పగా చెప్పాడు.

   అంతే! పిల్లలందరూ బిలబిల్లాడుతూ వచ్చేశారు.

   నాన్నమ్మ కథ చెప్పడం ప్రారంభించింది. ఒకసారి పావురాలన్నీ కలిసి అహారం వెతుక్కుంటూ బయలుదేరాయి. ఆ పావురాల గుంపుకి ఒక నాయకుడున్నాడు. నాయకుడు ఎటువైపుకి వెళ్లమంటే అటువైపుకి ఎగురుతున్నాయి.

   ఎంత దూరం వెళ్లినా వాటికి ఆహారం దొరకలేదు.అందులో ఒక చిన్న పావురం “నేనింక ఎగరలేకపోతున్నాను. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరుదామా?” అని అడిగింది.

   దాని మాటలు విని నాయకుడు ఇంకొంచెం దూరం వెళ్లాక ఆగుదాం! ఇక్కడొద్దు!” అన్నాడు.

   పావురాలన్నీ అలా ఎగురుతూనే ఉన్నాయి. “కింద ఆహారం కనిపిస్తోంది. అక్కడ కిందకి దిగిదామా? అనడిగింది మరో పావురం.

   దాని మాటలు విని “అయ్యయ్యో! అది ఆహారం కాదు. అక్కడ వేటగాడు వలపన్నాడు. ఇక్కడ దిగితే వలలో చిక్కుకుని పోతారు. అప్పుడు వేటగాడు మిమ్మల్ని చంపి తినేస్తాడు” అన్నాడు కంగారుగా.

   ఆకలితో ఉన్న పావురాలు నాయకుడి మాటలు వినలేదు. అన్నీ ఒకేసారి కిందకి దిగేసాయి. నాయకుడు చెప్పినట్టే వలలో చిక్కుకున్నాయి.

   భయంతో నాయకుడి వైపు చూశాయి. “తప్పయిపోయింది. మీరు చెప్పినట్టు వినక కోరి కష్టాలు తెచ్చుకున్నాం. వేటగాడు వచ్చేలోగా మమ్మల్ని ఈ వలలోంచి తప్పించండి! అని వేడుకున్నాయి అసలే ఆకలి బాధతో ఉన్న పావురాలు.

   వాటిని చూసి నాయకుడికి బాధేసింది. “పాపం! బాగా అకలేసి ఉంటుంది” అనుకున్నాడు.

   పావురాలతో “భయపడకండి! నేను మిమ్మల్ని రక్షిస్తాను! మీరందరూ కలిసి వలతో సహా పైకి ఎగరండి. నా వెనకలే రండి. నాకొక స్నేహితుడున్నాడు. వాడు మిమ్మల్ని రక్షిస్తాడు” అన్నాడు.

   పావురాలన్నీ వలతో సహా ఒకేసారి పైకి ఎగిరి నాయకుడి వెనకాలే వెళ్లాయి.

   నాయకుడు వాళ్లని తిసుకుని తన స్నేహితుడు ఎలుక దగ్గరికి తీసుకుని వెళ్లాడు. స్నేహితుడు రావడం చూసి ఎలుక అతడికి ఎదురు వెళ్లింది. పావురాలన్నీ నాయకుడి వెనకలే వలతో సహా కిందకి దిగాయి.

   ఎలుక తన పదునైన పళ్లతో వలతాళ్లు కొరికేసింది. పావురాలన్నీ వలలోంచి బయటికి వచ్చేశాయి.

   తన స్నేహితుడితో వచ్చిన పావురాలన్నింటికీ ఆహారం పెట్టింది ఎలుక. అందర్నీ రక్షించి ఆహారాన్ని పెట్టినందుకు ఎలుకకి, తమ నాయకుడికి మప్పితాలు తెలియచేసుకున్నాయి.

   తమ క్షేమాన్ని కోరేవాడు నాయకుడు కాబట్టి, ఇంకెప్పుడూ నాయకుడు చెప్పినట్టు నడుచుకోవాలని పావురాలన్నీ నిర్ణయించుకున్నాయి అంటూ నాన్నమ్మ కథ ముగించింది.

    అదర్రా పావురాల కథ! సమర్థుడైన నాయకుణ్ని ఎంచుకోవాలి. అలా ఎంచుకోబడిన నాయకుడు తనను నమ్ముకున్న ప్రజాక్షేమాన్ని కోరాలి. నాయకుడు సమర్థుడై ప్రజల మంచిని కోరుకోవాలి

   నాయకుడు సమర్థుడైతే ఆ నాయకుడి అండలో ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చు.

   సరే మరి! అందరూ ఆవులిస్తున్నారు. “ఇంక కథ రేపటికి... మనం నిద్రలోకి!” అంటూ గట్టిగా ఆవులిస్తూ నిద్రలోకి జారిపోయింది నాన్నమ్మ.

   నందుకి కథ నచ్చింది. నాన్నమ్మతో మంచికథ చెప్పినందుకు హీరోలా ఫీలవుతూ... అందరూ పడుక్కోండి! అని చెప్పి తనుమాత్రం నాన్నమ్మ పక్కన పడుక్కున్నాడు. 

   

 

  

 

No comments:

Post a Comment