About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

 

నాన్నమ్మ చెప్పిన తాబేలు కథ

      నాన్నమ్మా! ఇవా బడిలో ఏం జరిగిందో తెలుసా? అంటూ వచ్చాడు నందు. వాడి ముద్దు మాటలకి మురిసిపోతూ “ఏం జరిగిందిరా?” అంది నాన్నమ్మ.

   మరేం పిల్లల్ని కథ చెప్పమన్నారు మా టీచరు. నేను రాత్రి నువ్వు చెప్పిన కథ చెప్పాను. అందరూ చప్పట్లు కొట్టారు” అన్నాడు ఉత్సాహంగా.

  “వీడు! మాట్లాడుతుంటేనే ఒక్క ముక్క అర్ధమవదు... చప్పట్లు కొట్టారట...చప్పట్లు!” అసూయతో అన్నాడు శేఖర్.

   ఏరా! నువ్వు వాడికంటే పెద్దవాడివి. ఇన్ని కథలు విన్నావు. ఒక్కటీ చెప్పలేకపోయావు. కుర్రవెధవ వాణ్నెందుకురా అంటావు? ఆ వయస్సుకి వాడు కథ గుర్తుపెట్టుకుని అంతమందిలో భయపడకుండా చెప్పాడు. పెద్దవాడయ్యాక వాడే బోలెడన్ని కథలు రాసేస్తాడు.

   విన్నవి గుర్తు పెట్టుకుని చెప్పగలిగినవాడేరా భవిష్యత్తులో గొప్ప రచయిత అవుతాడు. శభాష్ నందూ! అలాగే చెప్పాలి. నువ్వు నిజంగానే చప్పట్లు కొట్టించుకునేంత గొప్ప పని చేశావు. ఇలాగే అందరితో ప్రశంసలందుకుంటూ గొప్పగా పెరగాలిరా!” అంది నాన్నమ్మ.

   నందూ మొహం దీపావళి మతాబులా వెలిగిపోయింది.

   సరే! ఇప్పుడు తాబేలు కథ చెప్తున్నాను వినండి! అంటూ కథ చెప్పడం మొదలుపెట్టింది నాన్నమ్మ. మనం చెప్పుకుంటున్న తాబేలు సముద్రంలో పెరుగుతోంది. అది కూడా మీలాగే చిన్నపిల్లన్నమాట!

   దానికి ఈదడమంటే చాలా ఇష్టం. చేపపిల్లలతో పోటీ పెట్టుకునేది. సముద్రంలో ఉన్న రకరకాల చేపపిల్లలతో పోటీ పెట్టుకునేది. కాని, ఓడిపోయేది.

   చేపలు స్వభావసిద్ధంగా ఈదుతూనే ఉంటాయి. వాటి శరీరం అందుకు తగినట్టుగా తేలిగ్గా ఉంటుంది. తాబేలు శరీరం బరువుగా ఉంటుంది.

   దానికి తోడు దాని వీపు మీద ఒక పెంకు దాని శరీరాన్ని కప్పి ఉంచుతుంది. ఆ పెంకుని తల్చుకుంటేనే ఆ తాబేలు పిల్లకి కోపం.

   ఎప్పుడూ ఓడిపోతున్నందుకు దానికి ఏడుపొచ్చేది. ఆ రోజు కూడా అది ఓడిపోయింది. ఏడుస్తూ వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లింది

   నాన్నా! ఈ వీపుమీదున్న పెంకు నా కొద్దు. నా చేప స్నేహితులు నన్ను చూసి నవ్వుతున్నారు. దీని బరువుకి నేను వాళ్లు ఈదుతున్నంత వేగంగా ఈదలేక ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నాను” అంది ఏడుస్తూ.

   చిన్న తాబేలు చెప్పింది విని “బుజ్జి తల్లీ! ఆ పెంకు నీకు రక్షణ ఇస్తుంది. చేపలు ఈదినట్టు నువ్వు వేగంగా ఈదలేక పోవచ్చు. కాని, చేపలకంటే ఎక్కువకాలం బతుకుతావు. ముందు ముందు దాని విలువ నీకే తెలుస్తుంది. ఏడవకు వెళ్లి ఆడుకో” అన్నాడు వాళ్ల నాన్న.

   ఒకరోజు తాబేలు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. పిల్ల చేపలు చకచకా ఎగురుతూ సంతోషంగా కేరింతలు కొడుతున్నాయి. తాబేలు పిల్ల కూడా వాటి సంతోషంలో పాలు పంచుకుంటోంది.

   అదే సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పెద్ద చేపవచ్చి చిన్న చిన్న చేపల్ని తినేస్తోంది.  తాబేలు పిల్ల గబగబా తన వీపు మీద ఉన్న పెంకులోకి దూరిపోయి కదలకుండా ఉండిపోయింది.

   కొంచెంసేపయ్యాక చేపపిల్లల్ని తినేసిన పెద్ద చేప వెళ్లిపోయింది. పెంకులోకి దూరి కదలకుండా ఉండిపోయిన తాబేలు పిల్లని రాయనుకుని వదిలేసింది పెద్ద చేప.

   తనకి రక్షణగా వీపు మీద పెంకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది తాబెలు పిల్ల. అప్పుడు ఆ పెంకు విలువ దానికి తెలిసింది. అప్పటి నుంచి ఆ బుజ్జితాబేలుకి తన వీపు మీద ఉన్న బుజ్జి పెంకంటే బోల్డంత ఇష్టం” అంతే!  కథ ముగించి పిల్లల వైపు చూసింది నాన్నమ్మ.

   ఓరేయ్! కునికిపాట్లు పడుతున్నారేమిట్రా... కథ విన్నారా? లేదా? భగవంతుడు మనకేమిచ్చినా దాన్ని మన మంచి కోసమే ఇస్తాడు. ఉన్నదాన్ని తగ్గువగా చూసి.. లేనిదానికోసం ఆరాటపడకూడదు.

   సరే! ఇప్పటికే సగం నిద్రలో ఉన్నట్టున్నారు. కథ రేపటికి... మనం నిద్రలోకి! అంటూ తను కూడా నిద్రపోడానికి సిద్ధమయింది నాన్నమ్మ.

   అప్పటికే సగం నిద్రలో ఉన్న పిల్లలు తాబేలు వీపు మీద ఉన్న పెంకు రాయిలా పైకి కనిపిస్తూ తాబేల్ని రక్షిస్తూ ఉంటుందన్నమాట! ఈ విషయం ఇంతవరకు మనకి తెలియదే! అనుకుంటూ నిద్రపోయారు.

 

 

 

No comments:

Post a Comment