ధారావాహికం
మనవడి
ధర్మసందేహాలు – తాత సమాధానాలు
(స్టేట్ లీడర్ జాతీయ తెలుగు పక్షపత్రిక, నెల్లూరు)
ఇక్కడ మనవడు పాండురాజు
కొడుకుల్లో మొదటివాడు, కురువంశంలో గొప్పవాడు, ధర్మమే తానుగా నడుచుకున్నవాడూ అయిన ‘ధర్మరాజు’. తాత అపరిమిత
పరాక్రమవంతుడు, తను కావాలనుకున్నప్పుడే మరణించేలా వరం పొందినవాడు, కౌరవులకి, పాండవులకి
తాత అయిన భీష్మాచార్యులవారు.
మాహాభారత యుద్ధంలో విజయం సాధించిన ధర్మరాజుకి ధర్మపరంగా రాజ్యం పాలించాలంటే
అనేక ధర్మసందేహాలు కలిగాయి. మనవడి ధర్మసందేహాలు నివృత్తి చెయ్యాలంటే గొప్ప
ధర్మాత్ముడైన అతడి తాతే తగినవాడు అనుకున్నాడు శ్రీకృష్ణపరమాత్మ. కౌరవవంశ చక్రవర్తి
ధృతరాష్ట్రుణ్ని, ధర్మరాజుని, అతడి తమ్ముళ్లని, యుద్ధంలో చనిపోగా మిగిలిన రాజుల్ని
తీసుకుని శ్రీకృష్ణుడు అంపశయ్యమీద ఉన్నభీష్మాచార్యులవారి దగ్గరికి వచ్చాడు.
తనకి
భక్తితో నమస్కరించిన భీష్ముడికి శారీరికబాధలు, మానసిక బాధలు లేకుండా చేశాడు. ప్రశాంతంగా ఉన్న భీష్ముడితో “భీష్మా! నీ ధర్మసంభంధమైన విజ్ఞాన విశేషాన్ని నీ మనుమలైన
ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులకి శుభం కలిగేలా; ఇక్కడ ఉన్న రాజుల
పుట్టుక సఫలమయ్యేలా; సమస్త ధర్మ విశేషాల్నీ చెప్పు. భూమి ఉన్నంతకాలం అపారమైన
కీర్తి నీకే రావాలని కోరుకుంటున్నాను”” అన్నాడు.
భీష్ముడు అలాగే చెప్తానని సంతోషంతో అంగీకరించి ““ఎవరి జన్మ కారణంగా సమస్త ఋషిపుంగవులు సంతోషించారో; పరమ ధార్ముకులని పేరు పొందిన భరత వంశీయులు కూడా ఎవరితో
సాటిరారో; సత్యం, శౌచం, శాంతి, దాంతులు ఎవరియందు ప్రకాశిస్తూ ఉంటాయో;
పాత్రులైనవాళ్లకే దానం చెయ్యడం; యజ్ఞాల్నీ, బంధువుల్నీ రక్షించడం మొదలైన ఉత్తమ ధర్మాలన్నీ
ఎవరికి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయో; కామం వల్లగాని, అర్థంవల్ల కాని, భయంవల్ల
కాని, అవినీతి మార్గంలో ఎవడయితే ప్రవేశించడో; అటువంటి ఉత్తమ గుణగణాలు కలిగిన నా
మనుమడు ధర్మరాజు అడగాలని అనుకుంటున్న అన్ని విధాలైన సందేహాల్ని మొహమాట పడకుండా
అడిగి సందేహ నివృత్తి చేసుకుని తెలుసుకొనుగాక!”” అన్నాడు.
శ్రీకృష్ణుడు“ “నీ మనుమడు ధర్మరాజు యుద్ధంలో గురువులూ, బంధువులూ, మిత్రులు అని
అనుకోకుండా భయంకరమైన బాణాలతో అందరినీ సంహరించాడు. కనుక, ఇతడు దయకలవాడు కాదంటావేమోనని
నీ ఎదుటికి రావడానికి సంకోచిస్తున్నాడు”” అన్నాడు.
భీష్ముడు ““కృష్ణా! బ్రాహ్మణులకి వేదాధ్యయనం;
దానాలతో ఉండే యాగాలు చెయ్యడం ఎలాగో... రాజులకి యుద్ధం చెయ్యడం కూడా అలాగే సహజం. తండ్రులు,
పుత్రులు, మనుమలు, గురువులైనా సరే పాపపు పనులు చేస్తే యుద్ధంలో చంపడం రాజధర్మం.
విద్యుక్త ధర్మాన్ని వదిలిపెట్టి లోభగుణంతో అన్యాయ మార్గంలో నడుచుకునేవాళ్లని
ఎవరినైనా యుద్ధంలో చంపడం పుణ్యకార్యమే. యుద్ధభూమిలో దుర్మార్గుల్ని వధించి రక్తపు నదులు పారేలా చెయ్యడం ధర్మవిదుడైన రాజు తప్పకుండా చెయ్యవలసిన
ధర్మం”” అన్నాడు
ధర్మరాజు చేతులు జోడించి, భీష్ముడి దగ్గరికి వచ్చి, ఆయన పాదపద్మాల్ని తన
చేతులతో పట్టుకుని తన తలని తాకించి వినయంతోనూ, భక్తితోనూ, ఆర్తితోనూ నమస్కరించాడు.
భీష్ముడు ధర్మరాజుని అభినందించి అతడి తలకి తన ముఖాన్ని ఆనించి ప్రేమతో ఆఘ్రాణించి
ఆదరించాడు. భీష్ముడు ధర్మరాజుని కూర్చోమని చెప్పి “” నాయనా! సంకోచించకుండా అడగాలనుకున్న వాటిని అన్నింటినీ అడుగు” అన్నాడు.
ధర్మరాజు శ్రీకృష్ణుడికి నమస్కరించి, వ్యాసుడికి మిగిలిన
మహామునిశ్రేష్ఠులకి అభివాదం చేసాడు. ధృతరాష్ట్రుడు మొదలైన కౌరవులందరి ఆజ్ఞ
తీసుకున్నాడు. భీష్ముడికి నమస్కరించి తన సందేహాలు ఒక్కొక్కటిగా ఆయన ముందుంచి సందేహ
నివృత్తి చేసుకుంటున్నాడు..
ధర్మరాజు అడిగిన ధర్మసందేహాలు, బీష్ముడు చెప్పిన సమాధానాలూ అన్నీ మన నిత్య
జీవితంలో ఉపయోగ పడేవే. మన సందేహాలు కూడా తీరడం కోసమే శ్రీకృష్ణ పరమాత్మ
భీష్మాచార్యులవారితో చెప్పించాడు.
ధర్మరాజు ఎన్ని విధాలైన ధర్మ సందేహాలు అడిగాడో భీష్ముడు ఎటువంటి సమాధానాలు
ఇచ్చాడో అన్నింటినీ మనం కూడా గౌరవంతో అర్థం చేసుకుని ఆచరణలో పెడదాం. (15-2-2021)
ధర్మరాజు ““పరిశుద్ధమైన చరిత్ర కలిగిన
తాతా! ప్రజాపరిపాలనా రూపమైన రాజధర్మమే గొప్పది.
ఈ జీవలోకానికి అంతటికీ రాజధర్మమే ఆధారం. దర్మార్థకామాలు మూడూ రాజధర్మం మీదే
ఆధారపడి ఉన్నాయి. గుర్రానికి పగ్గమూ, ఏనుగుకు అంకుశంలా లోకాన్ని శాసించేది
రాజధర్మమే. ఇందులో సందేహం లేదు.
పూర్వ రాజులు అంగీకరించి పాటించిన రాజధర్మం ఈనాటి రాజులుకాని, పాలకులుకాని పాటించకపోతే
లోకపు పరిస్థితి మొత్తం నాశనమై పోతుంది. సూర్యోదయంతో చీకటి తొలగిపోయేలా లోకంలో ఉండే
పాపాలన్నీ రాజధర్మంతోనే నాశనమవుతాయి.
నువ్వు లోకాతీతమైన బుద్ధిసంపన్నుడవని, నేను తెలుసుకోదగిన రాజధర్మాలు నువ్వు
చెప్పగా నేను గ్రహించాలనీ శ్రీకృష్ణుడి నిర్ణయం. కాబట్టి సమస్త రాజధర్మాల్ని
వివరించమని ప్రార్థిస్తున్నాను.
నిర్మలమైన మనస్సు కలిగిన తాతా! రాజు ధర్మస్వరూపుడని ధర్మవేత్తలు చెప్పగా
విన్నాను. కానీ, ఆ రాజధర్మం నిర్వహించడం కష్టమని అనుకుంటున్నాను. కనుక, అటువంటి
రాజధర్మ నీతుల్ని ముందుగా వివరించమని అడుగుతున్నాను”” అని వినయంగా ప్రార్థించాడు.
భీష్ముడు బ్రహ్మకల్ప స్వరూపుడైన శ్రీకృష్ణుణ్నీ, వేదాలే రూపంగా కలిగిన బ్రాహ్మణ సమూహాన్నీ స్మరించి నమస్కరించి, ఆదరంగా
తన మనుమడు ధర్మరాజు ముఖాన్ని చూస్తూ అతడి సందేహాలకి సమాధానం చెప్పడం
ప్రారంభించాడు.
““ధర్మరాజా! రాజధర్మాలన్నింటినీ ఎటువంటి సందేహమూ కలగకుండా స్పష్ఠంగా తెలియచేస్తాను. వాటితోపాటు అటువంటి సందర్భాల్లో నువ్వు అడిగిన ఎంతో ప్రయోజనం కలిగించే ఆపద్ధర్మ, మోక్షధర్మాల్ని కూడా అత్యంత విపులంగా తెలియచేస్తాను, ఏకాగ్ర చిత్తంతో విను!
తనకి శుభం కలగాలని కోరుకునే రాజు, మొదట దేవతల్ని, భూదేవతల్ని పూజించడం
మర్చిపోకూడదు. దేవతల అనుగ్రహం, పురుష ప్రయత్నం రెండూ రాజు తలుచుకున్న పనులు
నెరవేరడానికి ఉపయోగ పడతాయని తెలుసుకోవాలి. మానవ ప్రయత్నం అన్నింటికంటే
శ్రేష్ఠమైంది.
మానవ ప్రయత్నం చేసే రాజుకి భగవంతుడు సహాయపడతాడు. భగవంతుడి సహాయం ఉంటేనే తగిన
ఫలితము కలుగతుంది. కొన్ని సందర్భాల్లో మానవ ప్రయత్నం ఫలించకపోవచ్చు. అందుకు
దుఃఖించక, దైవం అనుకూలించలేదని అనుకోవడం ఉచితమైన రాజధర్మం!
ధర్మరాజా! ఇంద్రియ నిగ్రహమైన దాంతీ, ఆత్మజయమూ; మనోనిగ్రహమైన శాంతీ, మంచి నడతా
కలిగిన రాజు మాత్రమే శ్రీమంతుడూ, కీర్తిమంతుడుగా సమస్త సౌఖ్యాల్ని పొందగలుగుతాడు.
స్వామి, అమాత్యుడు, శృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం అనే ఏడు ప్రకృతుల్ని రాజు
గుర్తించి, సక్రమంగా నిర్వహించాలి.
అందుకు రాజులో ఋజుభావం, సత్యం, ముఖ్యంగా ఉండాలి. దీనికంతటికీ ‘కామందకుడు’ అనే ముని, ‘అంగరిష్ఠుడు’ అనే రాజుకి అర్థశాస్త్ర ప్రకారం దండనీతిని గురించి
చెప్పాడు. దాన్ని రాజు తప్పకుండా తెలుసుకుని ఉండాలి. జాగ్రత్తతో రాజు చేసే
నిర్వహణలోనే రాజనీతి ప్రస్ఫుటంగా కనబడుతుంది.
నాయనా మనవడా! ఈ అర్థాన్ని వివరించే మనువు చెప్పిన విషయాలు చెప్తాను, వాటిని
కూద తెలుసుకో. ‘రాతివల్ల ఇనుము, నీటి వల్ల అగ్ని,
బ్రాహ్మణుల వల్ల రాజులు జన్మించడం నిజమే. వాటి పరిశుద్ధ కాంతులు అన్నిచోట్ల
ప్రకాశిస్తాయి. కాని, అవి పుట్టిన స్థానాల్లో మాత్రం వర్తించవు. రాతిలోనుండి
పుట్టిన ఇనుము రాతిని ఖండించబోయి తానే పాడవుతుంది. నీట పుట్టిన నిప్పు ఆ నీటిని
గ్రహించి కాల్చబోయి తానే నశిస్తుంది.
అదే విధంగా బ్రాహ్మణుల్ని నాశనం చెయ్యాలనుకున్న రాజు తానే నశిస్తాడు’. ఇప్పుడు చెప్పిన రెండు ధర్మాల్నీ మనస్సులో ఉంచుకొని
బ్రాహ్మణులపట్ల దయతో ఉండు. శాంతస్వరూపులైన బ్రాహ్మణుల నాల్కలమీద వేదాలు ఉంటాయి. కనుకనే విద్వాంసులు
బ్రాహ్మణుల్ని దేవతలుగా పేర్కొన్నారు.
బ్రాహ్మణుల్ని శిక్షించవలసిన ధర్మాలూ ఉన్నాయి. శుక్రాచార్యుడు వివరించిన సందర్భాల్ని
చెప్తాను ’‘యుద్ధంలో శస్త్రాస్త్రాలు ధరించి
కోపోద్రిక్తుడై ఎదుర్కొనే బ్రాహ్మణుడు వేదాంతి అయినా కూడా అతణ్ని సంహరించడం రాజుకి
పరమ ధర్మమని వేదాలు చెప్తున్నాయి.
గురువు భార్యతో గడిపేవాడిని, శిశువుల్ని చంపేవాడిని, రాజుని ద్వేషించేవాడిని,
బ్రాహ్మణుల్ని సంహరించేవాడిని కఠినంగా తన రాజ్యం నుంచి బహిష్కరించాలి గాని,
వాళ్లని చంపకూడదు. తరువాత తాత మనవడికి చెప్పిన ధర్మసందేహాలేమిటో ముందు ముందు
తెలుసుకుందాం! (15-3-2021)
No comments:
Post a Comment