About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

 


1.గోమాలక్ష్మికి కోటిదండాలు (సంచిక అంతర్జాతీయ పత్రికలో వ్రచురింపబడింది) 

   గోవు గొప్పతనం మనకి తెలియదు. తెలుసుకోవాలని కూడా అనుకోట్లేదు. బిచ్చమెత్తుకుందుకు గోవుని ఉపయోగించుకుని  ఇంటింటికీ దాన్ని నడిపించి జీవించాలనుకోవడం; చంపి మాంసాన్ని అమ్ముకోడం, తినడం నిజంగా అమానుషం.

   మనిషి సోమరిపోతుగా మారి, తినడానికి ఏ జంతువైనా ఫరవాలేదని, మానవత్వం మర్చిపోయి జంతుస్వభావంలోకి దిగజారి పోతున్నాడు. ఎన్నో జన్మల పుణ్యంతో మనిషిగా జన్మించాననే జ్ఞానం పోగొట్టుకుంటున్నాడు.

   ఈనాటి సమాజంలో కబేళాలకి తరలించబడుతున్న గోవుల పరిస్థితి చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. కళ్ళకి ఎదురుగా కనిపిస్తున్న దేవత గోమాత. దాని పవిత్రత, గొప్పతనం  మనం తెలుసుకునే తీరాలి. ఎంత పుణ్యం, ఎంత ఆరోగ్యం దాని వల్ల మనం పొందవచ్చో... కొంచెమైనా తెలియచేద్దామని నా ప్రయత్నం.

    కనిపించని దేవుళ్లని ఎలాగూ ప్రత్యక్షం చేసుకోలేం. కనిపిస్తున్న దేవత గోమాత గురించి కొంచమైనా తెలుసుకుందాం!   

మనకి మనం చెప్పుకుంటే.. ఉపదేశాలు చేసినట్టో, ప్రవచనాలు చెప్పినట్టో, ఈనాటి పరిభాషలో సుత్తి చెప్పినట్టో ఉండచ్చు. అందుకే ప్రామాణికంగా ఇతిహాసంలో చెప్పబడినదాన్నే మీముందుంచుతున్నాను. అంపశయ్య మీద ఉన్న తాత భీష్ముడు, మనవడు ధర్మరాజుకి ఎన్నో ధర్మసందేహాలు తీరుస్తున్నాడు.

   ఇద్దరూ మహాత్ములే! మనవడి సందేహాలు ఎంత గొప్పవో... తీర్చే తాత చెప్పే విషయాలు అంతకంటే గొప్పవి. అడిగే సందేహమూ అందరికీ తెలియవలసిందే. తీర్చే విధానమూ మహామహులు చెప్పిన విషయాలు కనుక అందరం తెలుసుకోవలసినవే.

  ధర్మరాజు తాత భీష్ముణ్ని తాతా! నేనడిగిన ధర్మాలన్నీ దయతో స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తూ సందేహాలన్నీ తీరుస్తున్నావు. గోవులకి సంబంధించి వ్రతాల్ని సమృద్ధిగా చెయ్యాలని కూడా చెప్పావు. గొప్ప జ్ఞానవంతుడివి, నాకిప్పుడు గోవుల్ని దానమిచ్చే పద్దతిని గురించి తెలుసుకోవాలని ఉంది వివరిస్తావా? అని అడిగాడు.

   గోదానమిచ్చే పద్ధతిని గురించి మనవడు ధర్మరాజుతో చెప్తున్నాడు తాత భీష్ముడు: దేవతల గురువైన బృహస్పతి మాంధాతకి చెప్పిన గోదాన విధానాన్ని వివరిస్తున్నాడు. మాంధాత దగ్గర ఉన్న ఆవులు కడుపార మేత మేశాయి. నీళ్లు తాగాయి. గోశాలకి వచ్చి సుఖంగా పడుక్కున్నాయి. మాంధాత నిష్ఠతో అక్కడే ఉండి గొప్ప భక్తితో బృహస్పతిని తలుచుకున్నాడు. చేతులు జోడించి ఎన్నో విధాలుగా స్తోత్రాలు చేశాడు.

   మాంధాతకి  దేవతల గురువు బృహస్పతి ప్రత్యక్షమయ్యాడు. ఆయన కాళ్లమీద సాష్టాంగపడి నమస్కరించి మహాత్మా! గోదాన విధానం గురించి చెప్పుఅని అడిగాడు.

  బృహస్పతి మాంధాతతో  చెప్తున్నాడు గోదానం చెయ్యాలనుకున్నవాడు మంచి రోజు చూసుకుని పురోహితుడి అనుమతితో ఉపవాసం చెయ్యాలి. గోశాలకి వెళ్లి నియమంగా ఒకరోజంతా అక్కడే గడపాలి. సంగమం అనే పేరుగల మంచి సమయంలో తాను ఇవ్వదలచిన ఆవుని ప్రీతితో పేరుపెట్టి పిలవాలి.

   బ్రహ్మ దేవుడు చెప్పినట్లు ఆవు నా తల్లి, ఎద్దు నా తండ్రి. స్వర్గం వీరి గర్భప్రదేశం, ఇది నిలిచి ఉన్న చోటే నాకు నిలకడ ఇచ్చే చోటుఅని చెప్పాలి.

   దానం తీసుకోడానికి విద్య కలవాడిని (పండితుడిని)  ఎంచుకుని, ఆయన్ని పూజించి దానమిచ్చే సంకల్పం ఇలా చెప్పాలి. మంచి సత్తువ గల ఆవులు నా భయంకరమైన పాపాలన్నింటినీ రూపుమాపుతాయి. మంచి సాధుశీలం గల ఆవులు శాశ్వతమూ, సారమూ, మహిమగల స్థానాన్ని ఇచ్చి సుఖాన్ని చేకూరుస్తాయి, గోవునిచ్చాను! అని చెప్తూ ఆ విద్యావంతుడి చేతిలో ప్రేమతో నీటిధార వదలాలి.

   అలా వదిలిన నీరు అర్ఘ్యం అని ప్రాచీన ఋషులు చెప్తారు.

    గోవుల్ని దానం పుచ్చుకోడానికి విద్యావంతుడూ, పుణ్యకార్యాలు చేసేవాడూ, పాపాలు లేనివాడూ, శాంతమైన మనస్సు కలవాడూ, ఇంద్రియనిగ్రహం కలవాడూ, కోపం లేనివాడూ, యోగ్యుడు. అలా గోవుని దానమిచ్చిన వ్యక్తి చంద్రలోకాన్ని పొందుతాడు.

   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షం అష్టమి మొదలుకుని మూడు రోజులు గొడ్లసావిడిలో వ్రతనిష్ఠతో ఉన్నవాడు కోరిన కోర్కెలు ఎన్నింటినో పొందుతాడుఅని చెప్పాడు.

   మాంధాత బృహస్పతి చెప్పినట్లు ఉత్తమ బ్రాహ్మణులకి ఆవుల్ని దానంచేసి ఇహపరలోకాల్లో ప్రసిద్ది పొందాడు. ఆ విధానం తెలుసుకుని భరతుడు, దిలీపుడు, భగీరథుడు, రాముడు మొదలైన రాజులు కూడా శ్రద్ధతో గోదానాలు చేసి పుణ్యలోకాలు చేరుకున్నారు.

   ధర్మరాజా! నువ్వు కూడా బృహస్పతి చెప్పిన మాటల్ని మనస్సులో ఉంచుకుని ఆవులకి సంబంధించిన శాస్త్ర విషయాల్ని చక్కగా తెలుసుకుని  బ్రహ్మవిద్యలో ఆరితేరిన బ్రాహ్మణులకి మంచి ఆవుల్ని వందలకొద్దీ దానమియ్యి.   

   స్వర్గ సుఖాలు అపారంగా పొందాలంటే ఉదయాన్నే గోవు నీరు తాగకముందే, మేత మేయకముందే గొప్ప భక్తితో దానం చెయ్యాలి.

   అవుల్లో కపిలగోవు చాలా మేలైంది. దాన్ని నిష్ఠతో బ్రాహ్మణుడికి దానం చెయ్యడం చివరిమెట్టు. అది పాపాన్ని నరికేస్తుందిఅని చెప్పాడు. భీష్ముడు చెప్పిన గోదాన విధానాన్ని ధర్మరాజు శ్రద్ధగా విని మనస్సులో నిలుపుకున్నాడు.

 

No comments:

Post a Comment