ధారావాహికం(స్టేట్ లీడర్ పక్షపత్రికలో ప్రచురింపబడినది)
మనవడి
ధర్మసందేహాలు – తాత సమాధానాలు
తాత భీష్ముడు మనవడి ధర్మసందేహాలకి సమాధానమిస్తూ.. “పరమ ధార్మికుడా! ఇంకా చెప్తాను విను. ఏడు రాజ్యాంగాల్లో ‘నరదుర్గం’ చాలా శ్రేష్ఠమైంది కనుక, రాజు
నాలుగు వర్ణాల ప్రజల మీద దయకలిగి ఉండాలి. రాజ్యాన్ని రక్షించే
దుర్గాల్లో ప్రజలు కూడా రాజుకి రక్షణ ఇచ్చే దుర్గం వంటివాళ్లు. రాజు కేవలం దయావంతుడు మాత్రమే అయితే
ఏనుగు సాధువై ఉన్నట్లే.
ఈ
విషయం బృహస్పతి మాటల్లో విను. “శాంతపరుడైన రాజు కోపంలేని ఏనుగులా నీచులకి వశమవుతాడు. అటువంటి ఏనుగుని మావటీడు
తన ఇష్టానుసారం ఆడిస్తాడు. అలాగే శాంతపరుడైన
రాజుని నీచ ప్రజలు ఆడిస్తారు. రాజు కోపస్వభావుడైతే ప్రజలు భయపడి పారిపోతారు.
కాబట్టి, రాజు వసంత ఋతువులో సూర్యుడిలా సమభావంతో ప్రజల్ని పాలించాలి. ఇది రాజుకి
ఉండవలసిన రాజధర్మాల్లో అతి ముఖ్యమైన ధర్మం.
ప్రజలకి
చేసే ఉపకారాలు బహుజాగ్రత్తతో పరిశీలించి చెయ్యాలి. తన కోపాన్ని ప్రజల మీద
రుద్దకుండా, తొందరపాటు లేకుండా ప్రజలకి బాధ కలిగించకుండా రాజు నడుచుకోవాలి. గర్భం
ధరించిన స్త్రీ తన సంతానం పెరగడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే రాజు కూడా తొందరపడకుండా తన
ప్రజలకి క్షేమం కలిగేలా నడుచుకోవాలి.
ప్రజలతో కలిసి మెలిసి పరాచకాలాడుతూ గడిపే రాజుని ప్రజలు లెక్కచెయ్యరు. ఎంత
త్యాగశీలుడైనా మెచ్చుకోరు. తమ పనులు చెయ్యడం మానేసి మోసగిస్తారు. కీడు చెయ్యాలనుకుంటారు.
వేషభాషల్లో రాజుతో సమానంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అన్ని పదవుల్ని ఆశిస్తూ స్వయంగా
వ్యూహాలు పన్నుతూ భూమిని పీడిస్తారు. కాబట్టి సేవకులతో కలిసి మెలిసి గడుపుతూ రాచరికాన్ని
మర్చిపోయి నడచుకోకూడదు. సప్తరాజ్యాంగాలైన స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశం,
రాష్ట్రం, దుర్గం, బలం – అనే వాటికి వినాశం కలిగిస్తున్న వాడు ఎవడైనా సరే తప్పకుండా శిక్షించాలి” అని చెప్పాడు.
భీష్ముడు ధర్మరాజుతో మళ్లీ చెప్తూ “గర్వంతో కర్తవ్యం వదిలి విచక్షణ
లేకుండా ప్రవర్తించే వ్యక్తి ఎవడైనా సరే, చివరికి
గురువైనా సరే, అతణ్ని వదిలిపెట్టడమే రాజుకి ధర్మం. ఇదంతా బృహస్పతి మరుత్తుడనే
మహారాజుకి తెలిసేలా వివరించాడు. అందువల్ల గురువు, స్నేహితుడు, పుత్రుడు తప్పు
చేస్తే ఎవర్నైనా సరే క్షమించకుండా శిక్షించవలసిందే.
తన కుమారుడు పౌరుల్ని, పసిపిల్లల్ని పీడిస్తున్నాడని తెలుసుకున్న సగరుడు;
శ్వేతకేతుడనే తన కుమారుడు బ్రాహ్మణులకి అసత్యోపచారం చేస్తున్నాడని తెలుసుకున్న
ఉద్దాలక మహర్షి తమ కొడుకులని కూడా ఆలోచించకుండా వాళ్లని వదిలిపెట్టేశారు. ఇటువంటి
చరిత్రల్ని తెలుసుకుని రాజు ప్రజారంజకంగా వర్థిల్లాలి. నిజాయతీ, న్యాయం కలిగి
ప్రజల మనస్సుల్ని బాధించక అవసరాన్ని బట్టే బాధిస్తూ క్షమాగుణంతో ఉండే రాజు మాత్రమే
అభ్యున్నతిని పొందుతాడు.
నాయనా! రాజుకి కీడు కలిగినప్పుడు వేదాల్లో చెప్పబడిన విధంగా
నివారించుకోవాలి. అంతకంటే వేరే ఉత్తమ మార్గం లేదు. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్వర్గం
మీద దృష్టి ఉంచి ధర్మాచరణ చేసినప్పుడే రాజు తన ధర్మాన్ని నిర్వర్తించిన వాడవుతాడు.
సమస్త వర్ణాలకి సంబంధించిన ధర్మాల్ని రక్షిస్తూ, సంధి, విగ్రహము మొదలైన ఆరు
గుణాల్ని పాటిస్తూ, ధనార్జన తగిన మార్గంలోనే చేస్తూ రాజు తన ధర్మాన్ని
నిర్వర్తించాలి. తన ఇచ్చకాల కోసం మట్లాడే మాటల్ని పట్టించుకోకుండా, తన దృష్టికి
వచ్చిన దోషాల్ని మాత్రమే పట్టించుకుని, దుష్టులు తీసుకున్న ధనాన్ని ఉత్తములకిచ్చి
సంతృప్తి పరచడమే రాజధర్మమని బుధులు అంటారు” అని భీష్ముడు బృహస్పతి మాటల ద్వారా ధర్మరాజుకి వివరించాడు.
మళ్లీ చెప్తూ “ధర్మరాజా జాగ్రత్తగా విను. పూర్తిగా నమ్మడం లేదా అసలే నమ్మకపోవడం రాజుకి
మంచిదికాదు. ఏ విషయంలోనైనా సరే ఉచితమా కాదా అనేది బహుజాగ్రత్తగా మనసుపెట్టి
పరిశీలించి తెలుసుకోవాలి. ఇతరుల ధనాన్ని అపహరించడమే తన పని అన్నట్లు భావించే
పిసినారి రాజుకి శత్రువుల వల్ల కంటే ముందు తన ప్రజల వల్లనే వినాశం కలుగుతుంది.
ధర్మం మీద ఆసక్తి కలవాళ్లు, ధనాన్ని అభివృద్ధి చేసే నేర్పరులు,
స్థిరచిత్తులు, రాజాజ్ఞని అతిక్రమించని ఉత్తమ నీతి కోవిదులూ, ఉత్తమ కులంలో పుట్టిన
పరివారాన్ని పెంచుకోడం రాజుకి చాలా ముఖ్యమైన ధర్మం. ప్రజలు ఉత్తమ ప్రవర్తనతో, మోసం
లేకుండా, సంపదని దాచుకోకుండా, రాజు మీద ప్రేమతో మసలుకున్నప్పుడే రాజు నిజమైన రాజుగా
చెప్పబడతాడు..
ప్రజల్ని రక్షించే పరాక్రమ సంపన్నుడైన రాజు ఉంటే తప్ప సంపదల్ని, భార్యని,
బిడ్డల్ని, బంధవుల్ని రక్షించుకోడం సాధ్యం కాదని శుక్రాచార్యుడు చెప్పలేదా?
ప్రజాసంరక్షణం చెయ్యడానికి తగిన ప్రయత్నం చెయ్యని రాజు, అధ్యయనరహితుడైన
ఋత్వుజుడివంటి వాడని, మనువు వివరించాడు కదా! కాబట్టి బృహస్పతి, భరద్వాజుడు,
ఇంద్రుడు అనే ప్రముఖులైనవాళ్లు, రాజధర్మాల్ని శాసించినవాళ్లు కూడా, రాజుకి
ప్రథమకర్తవ్యం ప్రజాసంరక్షణమే అని చెప్పారు.
కాబట్టి, రాజుకి లోకసంరక్షణే తప్పనిసరైన ధర్మం. మంచి ప్రవర్తనతోగాని, అందుకు
వ్యతిరేకంగా గాని శత్రుసమూహాన్ని నాశనం చెయ్యడమే రాజ్యపాలనలో రాజధర్మం. మిక్కిలి
అల్పుడైన శత్రువైనా నిప్పులా విషంలా నొప్పిస్తాడు. శత్రువుల్ని సంహరించడం రాజుకి
తప్పనిసరి. ధర్మరాజా! ధీరుడైన రాజు అనేకమంది అడ్డగించి ప్రాణంతకం చేసినా
లెక్కచెయ్యక రాజ్యలాభాన్ని మర్చిపోకుండా పండితుల ప్రశంసలు పొందేలా తనకి
చేజిక్కించుకుంటాడు” అని రాజధర్మాల్ని వివరించి చెప్పి ఇంకేమైనా సందేహాలుంటే అడగమన్నాడు భీష్ముడు.
ధర్మరాజు భీష్ముడితో ““ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు కనుక ఈ పూటకి వెళ్లి రేపు ఉదయమే వచ్చి
అడుగుతాను”” అని చెప్పాడు. భీష్ముడి పాదాలకి
నమస్కరించి ధర్మరాజు వెళ్లిపోయాడు. అలాగే శ్రీకృష్ణుడు మొదలైనవాళ్లు భీష్ముడికి నమస్కరించారు.
మునులు ఆశ్రమాలకి వెళ్లిపోయారు.(1-5-2021)
No comments:
Post a Comment