3. గోమాలక్ష్మికి కోటిదండాలు (సంచిక అంతర్జాతీయ పత్రికలో ప్రచురింపబడినది)
వేదవ్యాసుడు శుకుడికి గో ప్రభావం గురించి చెప్తున్నాడు- మంచి బుద్ధి కలిగిన శుకుడు సర్వమూ ఎరిగిన తండ్రి వ్యాసుడి పాదాలకి చెదరని
భక్తితో మొక్కి ‘అన్ని వస్తువులకంటే గొప్పది, యజ్ఞాలకి మూలమైనదీ ఏదో నాకు చెప్పు’ అని
ప్రార్థించాడు.
అప్పుడు వ్యాసుడు
‘ఇటువంటి గొప్ప ప్రభావం ఆవులకి తప్ప మరొకదానికి ఎక్కడా, ఎప్పుడూ లేదు.
పుణ్యానికి చివరి మెట్టు అనదగిన లక్షణమూ, యజ్ఞసంపదకి మూలకారణము ఆవులకి తప్ప
మరొకదానికి లేవు.
నాయనా! ఆవులు
బ్రహ్మను గొప్ప నిష్ఠతో సేవించాయి. బ్రహ్మ సంతోషంతో పూర్వం వాటికి లేని కొమ్ములు
సృష్టించాడు. దేవతల్ని, మునుల్నీ చూసి ‘ఆవులు పరమ పవిత్రమైనవి, యజ్ఞాలకి మూలకారణం. వాటిని గురించి
విన్నా, వాటిని చూసినా పాపాలన్నీ నశిస్తాయి. యజమానులకి ఉత్తరలోకాలకి పోయే మార్గం
చూపిస్తాయి. వాటిని శ్రద్ధతో పూజించినవాళ్లు అడ్డులేకుండా స్వర్గానికి చేరుకుంటారు’ అని చెప్పాడు.
వ్యాసుడు
కుమారుడు శుకుడితో గోవుల పవిత్రతని గురించి మరికొన్ని విశేషాలు చెప్తాను
వినమన్నాడు ‘ఆవు మూత్రాన్నీ, పాలనీ, నేతినీ, పేడనీ కలిపి ముందు వరుసగా మూడురోజులు తాగాలి.
తరువాత మూడు
నెలలు ఆవులు తొక్కిన యవలనూకలతో కాచిన గంజిని భోజనంగా గ్రహించాలి. ఇలా చేస్తే
బ్రహ్మహత్యవంటి పాపాలు కూడా రూపుమాసిపోతాయి. దేవతలు ఇలా చేసే రాక్షసుల్ని
గెలిచారు.
ఆవునెయ్యిని
విద్యావంతులకి దానం చెయ్యడమూ, హోమం చెయ్యడమూ, తాగడమూ చాలా గొప్ప విషయం. స్వచ్ఛమైన
నీళ్లతో ఆచమనం చేసి ఆవులమంద నడుమ ఇంద్రియ నిగ్రహంతో ‘గోమతి’ మంత్రాన్ని
హృదయంలో జపిస్తే మానవుడికి పవిత్రత అనే ధనం లభిస్తుంది.
అగ్ని దగ్గరా,
ఆవులమందలోనూ, బ్రహ్మజ్ఞానం కలవాళ్ల దగ్గరా గోమతీ మంత్రాన్ని పఠించినా, విన్నా
కోరిన కోరిక నెరవేరుతుంది. మూడు లోకాల్లో ఆవుని మించినది మరొకటి లేదు’ అని చెప్పాడు.
వ్యాసుడు
చెప్పినది విని శుకుడు తండ్రి మాటల్లో సారమంతా గ్రహించి గోవుల్ని చక్కగా
ఆరాధించడంలో మనస్సు లగ్నం చేశాడని చెప్పాడు భీష్ముడు.
ధర్మరాజు తాతని
బ్రహ్మ సమస్త లోకాలకి ప్రభువు కదా! గోలోకం ఆయన లోకానికి కూడా పైన ఉంటుందని
విన్నాను. దానికి కారణం ఏమిటని అడిగాడు.
బ్రహ్మలోకం కంటే పైన ఉన్న గోలోకం గురించి చెప్తున్నాడు
భీష్ముడు- మనవణ్ని ఆదరంతో
చూస్తూ “పూర్వం దేవతల శిల్పి యజ్ఞం కోసం, మోక్షం
కోసం అమృత స్వరూపం కలిగిన, ఇష్టరూపం ధరించ కలిగిన సురభి అనే కన్యని మనస్సుకి
నచ్చినట్లు సృష్టించాడు. అలాగే గొప్ప తేజోవంతుడైన ఒక మగవాడిని కూడా సృష్టించాడు.
ఆ పురుషుడు
సురభిని చూసి ఇష్టపడ్డాడు. బ్రహ్మ ఆ పురుషుడితో ‘మార్తోభవ’(ఆర్తుడవు కావద్దు) అని అతడి బాధని అర్థం చేసుకుని, అతడికి మార్తాండుడు అని
పేరు పెట్టి సురభిని అతడికి భార్యగా ఇచ్చాడు. ఈమెకీ, నీకూ పుట్టిన సంతానం యాగాలకీ,
మోక్షాలకీ కావలసిన పాలని సృష్టిస్తూ నా లోకానికి పైభాగాన ఉండేలా వరం ఇస్తున్నాను
అని చెప్పాడు.
అలా
వాళ్లిద్దరికి పుట్టిన సంతానం బ్రహ్మ అజ్ఞాపించినట్లు దేవతలు రాక్షసులు మొదలైన
వాళ్లందరితో నమస్కరించడానికి, పూజించడానికి యోగ్యత కలిగి ప్రకాశిస్తోంది. బ్రహ్మ చేసిన కట్టడిని బట్టి ఆవులు తమ మహిమతో
తుది పాపాల్ని పటాపంచలు చేస్తూ, భక్తితో
సేవించే వాళ్లు కోరిన కోర్కెలు తీరుస్తున్నాయి.
సురభి గొప్ప
తపస్సు చేసి మార్తాండుడి వల్ల పదకొండు మంది కొడుకుల్ని పొందింది. వాళ్లని వేదాలు
కూడా ప్రశంసించాయి. అన్ని లోకాలకీ వాళ్లే పాలకులు. బ్రాహ్మణులకి ములకారణం వాళ్లే!
వాళ్లే ఏకాదశ రుద్రులు.
పుణ్యాత్మా!
అజపాదుడూ, అహిర్బుధ్న్యుడు, త్ర్యంబకుడు, వృషాకపి, శంభుడు, కపాలి, రైవతుడు, హరుడు,
బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు, అని ప్రసిద్ధికెక్కి లోకాలకి ఆ రుద్రులు
పూజ్యులయ్యారు.
తరువాతే ఆవులు
పుట్టాయి. ఆవుల ప్రత్యేకతని విను. ఆవు ముఖంలో, నాలుకలో, కొమ్ముల్లో
ఇంద్రుడున్నాడు. ఇంద్రియాల ద్వారాల్లో వాయుదేవుడున్నాడు.
మూపురంలొ శివుడు,
పాదాల్లో దేవతలు, కడుపులో అగ్ని ఉన్నారు. పొదుగులో సరస్వతి, పేడలో లక్ష్మి,
మూత్రంలో కీర్తి, రక్తంలో చంద్రుడూ ఉన్నారు. హృదయంలో భగుడనే దేవతా, పాలల్లో బ్రహ్మ
ఉన్నారు. వెంట్రుకల్లో ఆచారాలు ఉన్నాయి.
తోకలో యముడూ,
కన్నుల్లో సూర్యుడు ఉన్నారు. చర్మంలో తపస్సు, తేజమూ ఉన్నాయి. కీళ్లల్లో అష్ట
సిద్ధులు ఉన్నాయి. ఇంతమంది దేవతలు కొలువై
ఉన్న గోవు మహిమ ఇంతటిది అని చెప్పడం సాధ్యం కాదు కదా! అని వివరంగా చెప్పాడు.
No comments:
Post a Comment