కవితలు
2016 పుస్తక మహోత్సవం సందర్భంగా ఏప్రిల్ 23న విజయవాడ ఐలాపురం హొటల్లో జరిగిన సదస్సులో బాలసాహిత్యంలో భాగంగా ఒక పసిపాప మనస్సుతో నడిపించి చదివిన కవిత.
నేనే ఒక మంచి పుస్తకం
ఇప్పుడే పుట్టిన నాకు ఈ ప్రపంచమే
ఒక మంచి పుస్తకం!
నాకు భాష రాదు.. కాని,
భావ వ్యక్తీకరణ తెలుసు
కళ్ళు విప్పార్చి చూస్తూ
అన్నీ తెలుసుకోగలను
బాధ చెప్పగలను, ఆనందం
పంచుకోగలను
అవసరాన్ని తెలుపగలను,
లాలనకి పరవశించగలను
లాల పొయ్యమని అడగగలను,
శుభ్రత గురించి నేర్పగలను!
నా మెదడే నాకు మంచి పుస్తకం
అమ్మభాష రాదు, అమ్మని
గుర్తించడం తెలుసు
నన్నే చూస్తూ తిరిగే
అమ్మని నేను గుర్తించగలను
గొంతెత్తి ఏడ్చి అందర్నీ
దగ్గరికి రప్పించుకోగలను
కాళ్ళూ చేతులూ ఆడిస్తూ
అమ్మని ఆట పట్టించగలను
ఎత్తుకోమని అమ్మని
మౌనంగానే అడగగలను
నన్ను పైకి ఎగరేసి పట్టిన
అమ్మకి ప్రేమని పంచగలను!
నా శరీరమే నాకు మంచి
పుస్తకం
అక్షరాలు రావు, అమ్మ
మాటలు తెలుసు
నాలో తిరిగే అక్షరాల
ఆకారాన్ని గుర్తించగలను
నాలుకని తిప్పి తిప్పి
అక్షరాల్ని పేర్చగలను
గొంతు లోపలి నుంచి
శబ్దాన్ని రాబట్టగలను
శబ్దానికి అక్షరాలు
చేర్చి అమ్మను అలరించగలను
అందరూ నన్నే అనుకరించేలా
చెయ్యగలను!
అమ్మ నాన్నలే నాకు మంచి
పుస్తకం
అమ్మ భాష వచ్చు, నాన్న
ప్రేమ తెలుసు
తోబుట్టువులు తెలుసు,
బంధువుల్ని గుర్తించగలను
పక్షుల్ని, జంతువుల్ని పలకరించ
గలను
రంగుల్ని పువ్వుల్ని చూసి
పులకరించగలను
పండుగలు పర్వ దినాలు
కొత్త బట్టల్లు చూసి కనిపెట్టగలను
అమ్మ నాన్నలు చెప్పిందే నాకు
వేదం
జీవితమే నాకు మంచి పుస్తకం!
నేనిప్పుడు పుస్తకాలు
చదవగలను, పుస్తకాల్లో రాయగలను
పుస్తకాల్లో ఉండే కథల
నీతిని గ్రహించగలను
జీవితాన్ని క్రమశిక్షణవైపు
మలుచుకోగలను
మంచి పుస్తకాలు
రాసేవాళ్ళని, ముద్రించేవాళ్ళని గౌరవించగలను
మంచి పుస్తకం
నిలబెడుతుంది జీవితం....
ఆ జీవితమే అవుతుంది ఒక
మంచి పుస్తకం!
ఆ పుస్తకం నేనే
కావాలని....
అది కలకాలం నిలిచి
ఉండాలని కోరుకుంటున్నాను!!
No comments:
Post a Comment