About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

ఏకాగ్రత ఏకలవ్యుడు కథ

ఏకాగ్రత
ఏకలవ్యుడు కథ
   అతడు ఎవరో ఎవరికీ తెలియకపోయినా, సమాజంలో ఎవరికీ కనిపించకుండానే చచ్చిపోయినా... తనకు తానుగా చేసిన త్యాగం వల్ల ఒక ఆటవిక బాలుడు భూమి మీద గొప్ప విలుకాడుగా శాశ్వతమైన కీర్తితో ఇప్పటికీ ప్రకాశిస్తున్నాడు.
   ఏకలవ్యుడు ఒక ఆడవిజాతికి సంబంధించిన నిషధ రాజ్యానికి చెందినవాడు. అడవిలో పుట్టాడు, అడవిలోనే జీవించాడు. అతడు ప్రత్యేకమైన స్వభావం, చాలా ఉన్నతమైన లక్ష్యాలు కలవాడు. తను ఒక గొప్ప విలుకాడు కావాలన్న కోరికతో దానికోసం అతడెంతో కృషి చేసి చివరికి సాధించాడు.
   తనను ఎవరేనా గుర్తించాలి అని అతడు అనుకునేందుకు అతడు బయట ప్రపంచంలో ఎవరికీ తెలియడు. అనుకోకుండా ఒకరోజు ఒక విశేషం జరిగింది. అది అతడి జీవితాన్ని మార్చేసింది.
   ఆ రోజు అడవంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడప్పుడు పక్షుల కూతలు తప్ప ఇంకే శబ్దమూ లేదు. ఎప్పటిలా అడవంతా ప్రశాంతంగా ఉంది. అంతలోనే ఏం జరిగిందో ఏమో.. ఉన్నట్టుండి అడవిలో ఉన్న ప్రశాంతతకి భంగం కలిగింది. పక్షులు, జంతువులు అప్రమత్తంగా ఉన్నాయి. ఎక్కడో ఒక కుక్క మాత్రం గట్టిగా అరుస్తోంది.
   ఏకలవ్యుడికి కూడా కుక్క అరవడం వినిపించింది. అడవిలో కుక్కా? దాన్ని ఇక్కడికి ఎవరు తెచ్చి ఉంటారు? ఏకలవ్యుడు ఆలోచిస్తున్నాడు. అడవిలో ఉన్న జంతువులన్నీఅలజడిగా ఉన్నాయి. అరుపు ఇంకా గట్టిగా వినిపిస్తూనే ఉంది.
   అది హస్తినాపుర రాజకుమారులకి చెందిన కుక్క. రాజకుమారులు కౌరవులు, పాండవులు తమ గురువు ద్రోణుడుతో కలిసి అడవిలో విహారానికి వచ్చారు. ఆ కుక్కంటే అర్జునుడికి చాలా ఇష్టం. అది మొరగడం ఎప్పటికీ ఆపకపోతే ఏకలవ్యుడు దాని శబ్దం వస్తున్న వైపుకి కొన్ని బాణాలు వేశాడు.
   దూరంలో ఎక్కడో కుక్క మొరగడం విని, దాని నోటిలోకి బాణాలు వెయ్యగల విలుకాళ్ళు ఎంతమంది ఉంటారు? మొరుగుతున్న కుక్క నోటిలోకి దాన్ని చూడకుండా.. దానికి దెబ్బ తగలకుండా బాణాలు వెయ్యగలగడం చాలా గొప్ప విషయం.
  అలా చెయ్యడం తప్పకుండా మామూలు విలుకాళ్ళ మనస్సుల్ని రగిలించి వాళ్ళల్లో చెప్పలేనంత అసూయ పుట్టిస్తుంది.
   కుక్క మూలుగుతూ నోటిలోఉన్న బాణాలు కింద పడెయ్యడానికి ప్రయత్నిస్తూ అర్జునుడి దగ్గరికి వచ్చింది. దాన్ని చూసి అర్జునుడు నిర్ఘాంత పోయాడు.
   విలుకాడి ప్రతిభని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. అప్పటి వరకు అర్జునుడు ప్రపంచంలో తనే గొప్ప విలుకాడని అనుకుంటున్నాడు.
  మరి ఇప్పుడో...అచార్యుడు దరోణుడి వైపు చూసి ఆచార్యా! చూశారా..? అని అడిగాడు.
   అంత గొప్ప ప్రావీణ్యతని చూసి ద్రోణుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇంత అద్భుతంగా బాణాలు వేసిన ఈ గొప్ప విలుకాడు ఎవరో...ఇప్పుడు తనకి ఇతడు ఒక పెద్ద సమస్యగా తయారవుతాడు అనుకున్నాడు ద్రోణుడు.
   ఆయన జీవితంలో చాలా సమస్యల్ని ఎదుర్కున్నాడు. ఆయన మీద ఒక రాజు కక్ష కట్టాడు. అందువల్ల తనని, తన తన కొడుకు అశ్వత్థామని రక్షించుకోడం కోసం  హస్తినాపురంలో తలదాచుకున్నాడు.
   అతడిలో దాగి ఉన్న శక్తి సామర్ధ్యాల్ని గమనించిన హస్తినాపుర చక్రవర్తి తమ రాజకుమారులకి విద్య నేర్పించమని అడిగాడు.
   వందలకొద్దీ యువకులు అతణ్ణి చుట్టుముట్టినా అర్జునుణ్ణి మాత్రం ప్రపంచంలోకెల్లా గొప్ప విలుకాడుగా చెయ్యాలని ద్రోణుడు నిర్ణయించుకున్నాడు.
   అందుకు తన కుమారుడు అశ్వత్థామని కూడా పక్కన పెట్టాడు. ద్రోణుడు తను అనుకున్నదాన్ని సాధించగలడు. కుక్క నోటిలో బాణాలు వేసిన వాడు ఎవరోగాని అర్జునుడు కూడ చెయ్యలేని విధంగా తన విద్యని ప్రదర్శించాడు.
   రాజకుమారులు ఆశ్చర్య పోయారు. కనిపించని ఆ విలుకాణ్ణి గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. చుట్టు పక్కల చూశారు. వాళ్ళకి ఎవరూ కనిపించలేదు.
   అంతలోనే వాళ్ళ ముందు ఒక అడవి జాతి యువకుడు చేతిలో బాణాలతో కనిపించాడు. ద్రోణాచార్యుడి పాదాలకి భక్తితో  నమస్కరించి ఆచార్యా! నమస్కారం! అని మౌనంగా నిలబడ్డాడు.
   అర్జునుడు మరోసారి నిర్ఘాంతపోయాడు. నేను విన్నది నిజమేనా? ఆచార్యుడు ద్రోణుణ్ణి గురువర్యా! అని పిలిచాడా? అలా పిలవడంలో అతడి ఆంతర్యం ఏమిటి? నిజంగా ద్రోణుడు అతడికి గురువా? అర్జునుడు ఆలోచనలతో సతమతమవుతున్నాడు.
   నీ గురువు ఎవరు? అడిగాడు ఏకలవ్యుణ్ణి. మిగిలిన రాజకుమారులందరు ఏకలవ్యుడి చుట్టూ చేరిపోయారు.
   ఇదంతా చూస్తున్న ద్రోణుడు నిర్ఘాంత పోయాడు. ఆ పరిస్థితిని నవ్వుతూ మార్చెయ్యాలనుకున్నాడు. ఆడవి నుంచి వచ్చి తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు ఎవరైనా ఉన్నాడా? అని ఆలోచిస్తున్నాడు.
    ఇంతలో ఒక రాజకుమారుడు అడిగాడు ఆచార్యా! మీరు మాకే గురువు. మా రాజకుమారులకే మీరు గురువు అనుకున్నాం. మీరు వేరే వాళ్ళకి కూడా విద్య నేర్పిస్తున్నారని ఇప్పుడే తెలిసింది అన్నాడు.
   అర్జునుడికి కోపం వచ్చింది. ఆచార్యా! నన్ను ప్రపంచంలో అందరి కంటే గొప్ప విలుకాడుగా చేస్తానని వాగ్దానం చేశారు. చూడండి ఇప్పుడేం చేశారో! మీ శిష్యుణ్ణని చెప్పుకుంటున్న ఇతడు నా కంటే గొప్ప విలుకాడుగా కనిపిస్తున్నాడు అన్నాడు.
   అర్జునుడు చిన్న పిల్లవాడు అందుకే అతణ్ణి చూసి ఈర్ష్య పడుతున్నాడు. ద్రోణుడు అతడికి నచ్చచెప్తూ అర్జునా! నువ్వు అందరికంటే ఎక్కువ విలువిద్య తెలిసినవాడివి. ఇదేమంత గొప్ప విద్య కాదు అన్నాడు.
   కాని, పరిస్థితులు దార్లోకి రావట్లేదు. ద్రోణుడు అర్జునుణ్ణి ప్రంచంలో అందరి కంటే గొప్పవాడుగా నిలబెడతానని అన్నాడు. ఇంకొకడు అర్జునిడి కంటే గొప్పగా బాణాలు వేస్తూ అక్కడికి వచ్చి తనని గురువర్యాఅని సంబోధించాడు.
   అంత నిక్కచ్చిగా అడుగుతున్న అర్జునుణ్ణి చూసి ద్రోణుడు కొంచెం భయపడ్డాడు. అర్జునుడుతో పాటు మిగిలినవాళ్ళ పరిస్థితి కూడా అర్ధం కాని విధంగా మారిపోయింది. ఈ పిల్లవాడు తనకు శిష్యుడు ఎప్పుడయ్యాడు? తను నేర్పకుండానే తన దగ్గర విలువిద్యని ఎలా నేర్చుకున్నాడు?
   ద్రోణుడు కొంచెం తేరుకుని నువ్వెవరు నాయనా? అని అడిగాడు.
   ఆ విలుకాడు గౌరవనీయులైన ఆచార్యా! నేను ఏకలవ్యుణ్ణి. ఇక్కడ ఈ అడవిలోనే జీవిస్తున్నాను. మీ దయవల్ల విలువిద్యను నేర్చుకున్నాను అన్నాడు. మళ్ళీ అవే మాటలు అర్జునుడు విన్నాడు.
   రాజకుమారుల గుంపు అక్కడికి చేరి పోయి జరుగుతున్న దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు. బహుశా ఆచార్యుడు ఇతడికి విద్య నేర్పిస్తూ ఎవరికీ చెప్పలేదేమో...అర్జునుణ్ణి ప్రపంచం మొత్తానికి గొప్ప వీరుడుగా తయారు చేస్తానని వాగ్దానం చేసి రహస్యంగా మరొకడికి కూడా శిక్షణ ఇస్తున్నారేమో అనుకున్నారు.
   ద్రోణుడు ఏకలవ్యుణ్ణి నాయనా! నా దగ్గర విలువిద్య ఎప్పుడు నేర్చుకున్నావు? అడిగాడు.
   మహాత్మా! నేను విలువిద్య నేర్చుకోవాలని మీ దగ్గరికి వచ్చాను. మిమ్మల్ని విలువిద్య నేర్పించమని అడిగాను. కాని, మీరు అందుకు అంగీకరించలేదు. ఒక చెట్టు వెనకాల నిలబడి మీరు రాజకుమారులకి నేర్పిస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను అన్నాడు ఏకలవ్యుడు తల వంచుకుని.
   ద్రోణుడికి ఇప్పుడు కొంచెం ప్రశాంతత చిక్కింది. అతడి చుట్టూ ఉన్న వాతావరణంలో కొంత మార్పు కనిపించింది. అర్జునుడికి గురువుగారి మీద కోపం తగ్గింది. మిగిలిన రాజకుమారులకి కూడా సందేహం తీరింది.
కానీ.... అని ఏదో చెప్పబోయి ఆగాడు ఏకలవ్యుడు. మళ్ళీ అందరిలో ఉత్కంఠ కలిగింది.
   నేను విలువిద్య నేర్చుకోవాలన్న కోరికతో ఉన్నాను. మీరు ప్రపంచంలో విలువిద్య నేర్పేవాళ్ళల్లో మొదటివారు. అందుకని... చెప్పడం ఆపాడు.
   అందరూ నిశ్శబ్దంగా దీక్షగా వింటున్నారు. అడవంతా కూడా నిటారుగా నిలబడి వింటోంది. మీరు కొంచెం నేను నేర్చుకునే ప్రదేశానికి వచ్చి చూస్తే మీకే విషయం అర్ధమవుతుంది...అన్నాడు ఏకలవ్యుడు.
    ఆచార్యుడు ద్రోణుణ్ణి తీసుకుని నడుస్తున్నాడు ఏకలవ్యుడు, మిగిలినవాళ్ళు అతణ్ణి అనుసరిస్తున్నారు. అందరూ ఒక చోట ఆగారు.
   ఆ పిల్లవాడు ద్రోణుడి ప్రతిమని తయారు చేసి ఒక పీఠం మీద పెట్టాడు. గురువుగారి ప్రతిమని  పూజిస్తూ గురువుగారు అక్కడే ఉండి నేర్పిస్తున్నట్టు ఊహించుకుంటూ  విలువిద్యని సాధన చేశాడు.
    ఆ ప్రతిమని చూపించి ఆచార్యా! మీరే నా గురువు అన్నాడు ఏకలవ్యుడు.
   అర్జునుడు ఆ ప్రతిమని చూసి ఏకలవ్యుడు చెప్పింది విని, అనుకోకుండా అవును నిజంగా ఆయనే నీ గురువు అన్నాడు.
   చిన్నవాడైన ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకుని దాన్ని సాధన చేసి తను గురువుగా భావించిన ద్రోణాచార్యుడి యందు అంకిత భావంతో అయనే తనకు విద్య నేర్పిస్తున్నట్టుగా ఊహించుకుని తనలో ఉన్న శక్తిని బయటకు లాగి గొప్ప విలుకాడుగా తయారయ్యాడు. జరిగింది అదే!
   ఏకలవ్యుడు చిన్నవాడైనా అంకిత భావంతో తన ప్రతిమని ప్రతిష్ఠించి దాని ఎదురుగా నిలబడి విలువిద్యని నేర్చుకున్న అతడిలో ఉన్న క్రమశిక్షణ, అంకితభావం ద్రోణుడికి అర్ధమయింది.
   అదే అతడిలో జ్ఞానాన్ని పెంచిందనీ, అదే అతణ్ణి ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుందని ద్రోణుడు అర్ధం చేసుకున్నాడు.
   ఏకలవ్యా! నీకు విద్య నేర్పించిన గురువు గారికి గురుదక్షిణగా ఏమిస్తావు? అడిగాడు ద్రోణుడు.
   గౌరవనీయులైన ఆచార్యా! మీరు ఏది అడిగితే అదే ఇస్తాను అన్నాడు ప్రశాంతంగా ఏకలవ్యుడు.
   ద్రోణుడు తన శరీరం కంపిస్తుంటే, పెదవులు వణుకుతుంటే నిలదొక్కుకుంటూ నీ కుడిచేతి బొటన వేలు నాకు గురుదక్షిణగా ఇస్తావా? అని అడిగాడు.
   ఏకలవ్యుడు ఎప్పటికీ అర్జునుణ్ణి మించి ఎదగ కూడదు అని ఆలోచించాడు ద్రోణుడు. ఏకలవ్యుడు సంతోషంగా తన కుడిచేతి బొటన వేలుని కత్తిరించి గురువుగారికి ఇచ్చేశాడు.
   ఈ విధంగా గురువుగారి ప్రతిమని పెట్టుకుని అంకితభావంతో పూజించి, ఏకాగ్రతతో విలువిద్య నేర్చుకుని, సాధన చేసి ప్రపంచలోకెల్లా గొప్ప విలుకాడుగా ఎదిగి తన కుడిచేతి బొటన వేలుని గురువుగారికి గురు దక్షిణగా ఇచ్చేశాడు.
   అర్జునుడు సంతోషించాడు. మిగిలిన రాజకుమారులు కూడా సంతోషించారు. అర్జునుడికి గురువుగారి మీద అంత వరకు ఉన్న కోపం పోయింది. ఎప్పటికేనా ఈ అడవి బాలుడు తనని మించి ఎదిగి పోతాడు అన్న భయం ఇప్పుడు అతడికి లేదు. అర్జునుడికి అంతకు ముందు ఉన్న కోపం, ఈర్ష్య, తన గురించి జాగ్రత్త పడాలన్న కోరిక అన్నీ మాయమయ్యాయి.
   ఏకలవ్యుడు కూడ సంతోషంగా ఉన్నాడు. తన గురువుగారు అడిగిన దక్షిణ ఇవ్వగలిగినందుకు అతడికి చాలా తృప్తిగా ఉంది. అతడి విధేయతని ఇప్పుడు ఎవరూ శంకించలేరు.
   గురువు యందు అతడికి ఉన్న అంకితభావం వెలకట్ట లేనిది. ఒక్క దెబ్బతో ప్రపంచం మొత్తానికి అంకితభావం అంటే ఏమిటో తెలియచేశాడు.
  విజయాన్ని సాధించాలంటే గురువు యందు పరిపూర్ణమైన అంకితభావం ఉండాలనీ, నిజమైన త్యాగం అంటే ఏమిటో...నిజమైన శిష్యుడు ఎలా ఉండాలో...ఏకాగ్రత అంటే ఏమిటో అన్నింటి గురించీ తెలిసేటట్టు చేశాడు.
   తనకు గురువు యందు గల అంకితభావాన్ని తన కుడిచేతి బొటన వేలుని ఇచ్చి తెలియ చేసుకున్నాడు తరువాత విలువిద్యలో తనకు గల జ్ఞానాన్ని వదిలేసుకున్నాడు.
    అది అతడు చేసిన గొప్ప త్యాగం. బాగా చదువుకున్న రాజకుమారుల కంటే ఎక్కువ ప్రావీణ్యతని ఒక ఆటవిక బాలుడు ప్రదర్శించాడు.
   ఆ సమయంలో గురువు కూడా సిగ్గుపడే విధంగా ఏకలవ్యుడు క్రమశిక్షణతో నడుచుకున్నాడు.
  ఒకవేళ ఏకలవ్యుడే కనుక అతడి బొటనవేలు ఇవ్వకపోయి ఉంటే గురువుగారితో సమానమై ఉండేవాడు. కాని, ఆ విధంగా జరగలేదు కనుక ఏకలవ్యుడు చిరంజీవిగా మిగిలాడు, తరతరాల విద్యార్ధులకి ఆదర్శంగా నిలిచాడు.
   ఎవరు పోగొట్టుకున్నారు? ఏకలవ్యుడు మాత్రం కాదు. అతడు చిన్నతనంలోనే ఎనలేని కీర్తిని సంపాదించుకున్నాడు. అతడికి అన్యాయం జరిగింది.
   కాని, అతడు ఎవరికీ తెలియని విలుకాడుగా మాత్రం చచ్చిపోలేదు. గురువుగారి కోసం జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన బాలుడిగా పేరు తెచ్చుకున్నాడు.
   ఏకలవ్యుడు తన బొటనవేలిని పోగొట్టుకున్నా ఆ స్థితిలోనే సాధన చేసి ఉంటే.. బొటనవేలు లేని తన వంటి వందల మంది విద్యార్ధులకి విలువిద్య నేర్పించి ఉండేవాడు. బొటన వేలు లేకపోయినా విలువిద్యలో రాణించవచ్చు! అని నిరూపించేవాడు.  అతడి ఏకాగ్రత అంత గొప్పది.
స్వార్ధపూరితమైన గురువులకి, శిష్యులకి ఏకలవ్యుడి జీవితం ఒక గుణపాఠం!!



1 comment:

  1. దీనికి మూలం చూపిస్తారా . నేను మళ్ళీ ఈ పేజీకి రాగలనో లేదో - నా వాట్సప్ నం. 9985604196 కి పంపగలరు.

    ధన్యవాదాలు
    రామకృష్ణుడు

    ReplyDelete