మాఘపూర్ణిమ విశిష్టత
మాఘమాస ప్రాశస్త్యం
చైత్రం మొదలుకొని పన్నెండు మాసాలకూ
ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. చాంద్రమానం ప్రకారం చంద్రుడు
"మఖ'' నక్షత్ర మండలంతో వుండే మాసం కనుక ఈ మాసానికి "మాఘమాసం” అనే పేరు వచ్చింది. అందుకే మాఘం -
అమోఖం. మకర సంక్రమణం జరిగినది మొదలు కుంభసంక్రమణం జరిగేవరకు మధ్య ఉండే మధ్యకాలమే మాఘమాసం''.
ఈ మాసానికి పరిపోషకుడు మాధవుడు. "మా'' అంటే మహాలక్ష్మి. "ధనుడు'' అంటే
భర్త. మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త. లక్ష్మీనారాయణులకు ప్రీతికరమైన మాసం కనుక
శ్రీవైష్ణవులకు ప్రధానమైంది. విద్యాధిదేవత, వాగ్దేవి, జ్ఞానప్రదాయిని
అయిన సరస్వతీదేవి మాఘమాసం శుద్ధ పంచిమినాడు జన్మించింది. అందుకే మాఘశుద్ధ పంచమిని
"శ్రీపంచమి''అంటారు. మానవులకి అవసరమైన సంపదల్లో విద్యాసంపద ఒకటి. కనుకనే
శ్రీమహాలక్ష్మీ "శ్రీపంచమి''నాడు సర్వతీదేవి రూపంలో
భాసిస్తుంది.
ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు సప్తమి తిథినాడు జన్మించాడు. అందుకే
మాఘశుద్ధసప్తమి "రథసప్తమి'' పర్వదినం. లయకారుడైన పరమేశ్వరుడు
లింగాకారంలో ఉద్భవించి మాఘ బహుళ చతుర్దశి "శివరాత్రి'' పర్వదినం.
విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని సర్వమానవాళికి అందించిన భీష్మ పితామహుడు పరమపదించిన రోజు
మాఘశుద్ధ ఏకాదశి "భీష్మ ఏకాదశి'' పర్వదినం.
మాఘశుద్ద నవమిని "మధ్వనవమి''గా
పాటిస్తూ త్రిమతాచార్యుల్లో ఒకరైన "మధ్వాచార్యుడు'' మాఘశుద్ధ
నవమినాడు వైకుంఠ ప్రాప్తి పొందాడు.
ఈ మాసాన్ని "కేతువు'' పరిపాలిస్తూంటాడు. కేతువు
జ్ఞానప్రదాత, మోక్షకారకుడు. “మా - అఘం'' అంటే
పాపం యివ్వనిది అని అర్థం. కనుకనే మాఘమాసం అన్నారు.
మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత:
హిందూ పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున, విష్ణువు గంగా నదిలో నివసిస్తాడని
నమ్ముతారు. గంగా నదిలో ఉన్నది భక్తులకి మోక్షాన్నిచ్చే
పవిత్ర జలం. మాఘ పూర్ణిమ వ్రతాన్ని భక్తితో ఆచరించిన భక్తులకి మోక్షం కలుగుతుంది.
మాఘ పూర్ణిమ నాడు దానధర్మాలు చేయడం వల్ల మహాయాగాలు చెయ్యడం వల్ల కలిగినంత
ఫలితాన్ని పొందుతారు.
మాఘ పూర్ణిమ మాఘ నక్షత్రం పేరు నుండి ఉద్భవించింది, ఇది 27 నక్షత్రాలలో ఒకటి. పురాణ గాధ ప్రకారం, మాఘ మాసంలో దేవతలు మానవ రూపాలతో భూమి
పైకి వస్తారు. వారు పవిత్ర నదులలో స్నానం చేస్తారు, పూజలు చేస్తారు, మానవ రూపాల్లో దానాలు కూడా
చేస్తారు. ఈ రోజున, విష్ణువు
యొక్క ఆరాధన జరుగుతుంది. విష్ణువును భక్తి విశ్వాసాలతో పూజించే భక్తులు ఆయన
అనుగ్రహాన్ని పొందుతారు.
మాఘపౌర్ణమి వ్రతం:
మాఘ్హ పౌర్ణిమ రోజున, ఉదయం సూర్యోదయానికి ముందే స్నానం చేసి, సూర్య మంత్రాన్ని పఠిస్తూ సూర్యుడుకి అర్ఘ్యం ఇవ్వాలి. ఉపవాస వ్రతం చేసి
మధుసూదనుడిని పూజించాలి. మధ్యాహ్న సమయంలో, పేద ప్రజలకి, బ్రాహ్మణులకి అన్నదానం, ఇంకా ఇవ్వవలసిన దానాలు, దక్షిణలు
ఇవ్వాలి. నల్ల నువ్వులు ప్రత్యేకంగా దానానికి ఇవ్వాలి. మాఘమాసంలో నల్ల నువ్వులతో
హవనాన్ని,
పూర్వీకులకు నైవేద్యాన్ని సమర్పించాలి. గాయత్రీ
మంత్రం లేదా నారాయణ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ వ్రతాన్ని ఆచరించేవాళ్లు పగటిపూట ఉపవాసం ఉండి, రాత్రికి మాత్రమే భోజనం చెయ్యాలి. ఈ వ్రతంచేసి కాళీ మాత అనుగ్రహం పొందిన బ్రాహ్మణ
దంపతుల గురించి ప్రాచీన కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.
మాఘ పూర్ణిమ వ్రతం గురించి పురాతన కథ
పురాతన పురాణాల ప్రకారం, ధనేశ్వరుడు
అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు కాంతికా నగరంలో బిచ్చమెత్తుకుంటూ నివసించేవాడు. ఆయనకు
పిల్లలు లేరు. ఆ దంపతుల్నిఅందరూ ఎగతాళి చేయడం ప్రారంభించారు. ధనేశ్వరుడి భార్య
చాలా బాధపడింది. ఒక యోగి కనిపించి ఇచ్చిన సలహా ప్రకారం16
రోజులు భక్తిప్రపత్తులతో కాళికా దేవిని పూజించారు. ఆ దంపతుల భక్తికి ప్రసన్నురాలైన కాళికాదేవి
16వ రోజున ప్రత్యక్షమై, ఆ దంపతులకు సంతానం కలగాలని
అనుగ్రహించింది. ప్రతి పూర్ణిమ నాడు దీపం వెలిగించమని, ప్రతి పూర్ణిమకు దీపాల
సంఖ్యను పెంచమని, మాఘ పూర్ణిమ నాడు ఉపవాసం పాటించమని కాళీదేవి దంపతులకు చెప్పింది.
బ్రాహ్మణ
దంపతులు వ్రతం పాటించి మాఘ పూర్ణిమ రోజున కాళీ దేవి చెప్పిన విధంగా దీపాలు
వెలిగించారు. వాళ్ళకి మగబిడ్డ కలిగాడు. అతడికి దేవదాసు అని పేరు పెట్టారు. దేవదాసు
పెరిగిన తరువాత కాశీలో చదువుకోవడానికి పంపించారు. చిన్నతనంలోనే కాశీలో దేవదాసు
వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత మృత్యువు అతణ్ని వెంటాడింది. ఆ రోజు పూర్ణిమ
కావడం వల్ల అతడి తలితండ్రులు తమ కొడుకు కోసం ఉపవాసం ఉన్నారు. వారి ఉపవాసం ఫలితంగా దేవదాసు మృత్యువు బారి
నుంచి బయటపడ్డాడు. అతడి తల్లితండ్రులు 32 సార్లు చేసిన పూర్ణిమ వ్రత ఫలితం
వల్ల దేవదాసు మరణం నుంచి కాపాడబడ్డాడు. మాఘ పూర్ణిమ రోజున వ్రత మాచరించి ఉపవాసం
చెయ్యడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
మాఘపూర్ణిమ - సముద్రస్నానం
మాఘ పూర్ణిమ రోజు సముద్రస్నానం ఎందుకు చెయ్యాలి...
"మాఘమాసేరటం
తాప్యః కించి దభ్యుదితే రవౌ\ బ్రహ్మఘ్నం వా సురాపం వా కంపతంతం పునీమహే'' - మాఘమాసంలో
సూర్యోదయానికి ముందే, అంటే ...
బ్రాహ్మీముహూర్తం నుంచే జలములన్ని మహా పాతకాల్ని పోగొట్టి మానవుల్ని పవిత్రులుగా చెయ్యడానికి
సంసిద్ధముగా వుంటాయి'' అని అర్థం. అందుకనే మాఘమాసం నెలరోజులు
పవిత్రస్నానాలు చేయాలని మన ఋషులు చెప్పారు.
మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు చేయడం పుణ్యప్రదం. కనీసం "మాఘపూర్ణిమ'' నాడైనా
నదీస్నానం గానీ, సముద్రస్నానం గానీ చేస్తే మాఘమాసం మొత్తం పవిత్రస్నానాలు
చేసిన ఫలితం వస్తుందని పెద్దలంటారు. శివ, కేశవులిద్దరికీ ప్రీతికరమైన మాఘ పూర్ణిమ
నాడు తప్పకుండా సముద్రస్నానం చేసి శివ, కేశవులిద్దరినీ ఆరాధించాలి.
మాఘపౌర్ణమి
నాడు సముద్ర స్నానమే ఎందుకు చెయ్యాలి... "నదీనాం సాగరో
గతి:'' నదీ, నదాలన్నీ చివరకు సముద్రంతోనే
సంగమిస్తాయి. కనుక, సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ
స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. సముద్ర ధర్మం స్థిరత్వం, అఘాది, జడత్వాలు
సముద్ర తత్త్వం. ప్రతినిత్యం
సూర్యకిరణాలవల్ల, ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్రం యొక్క పరిమాణం తగ్గదు.
ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుని పరిమాణం పెరగదు.
సూర్యోదయకాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే
సూర్యకిరణాలలోని విద్యుచ్చక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం
చేసుకుంటాయి. వెండి వెలుగులతో జగతిని నింపే చంద్రుడు తన కిరణాలలో ఉండే
అమృతత్త్వాన్ని, ఔషధీ విలువల్ని నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో వుండే ఈ
అద్భుతశక్తులు ... తిరిగి సూర్యకిరణాలతో పరావర్తనం చెంది అంతరించి పోతాయి. మన
మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీస్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు.
సముద్రం, నదులు అందుబాటులో లేనివారు బావుల దగ్గరగానీ, చెరువుల వద్దగానీ "గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి'' నదుల
పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం
వస్తుంది.
మాఘమాసం చివరి మూడురోజులైనా పవిత్రస్నానాలు చేస్తే మంచి ఫలాన్ని పొందవచ్చు. చివర
మూడుస్నానాలనూ "అంత్యపుష్కరిణీ స్నానాలు'' అంటారు.
"దుఃఖదారిద్యనాశాయ
శ్రీవిష్ణోస్తోషణాయాచ\ ప్రాతః స్నానం
కరోమ్యద్య మాఘేపాపవినాశనం\
మకరస్దే రవౌ
మాఘే గోవిందాచ్యుత మాధవ\ స్నానేనానేన
మే దేవ యథోక్త ఫలదోభవ''|
అని పఠించి, మౌనంగా స్నానం చేయాలి, అంటే "దుఃఖాలు, దారిద్ర్యము
నశించడానికి పాపం నశించాలంటే శ్రీవిష్ణుప్రీతి పూర్వకంగా ఈ పవిత్ర మాఘస్నానం చేస్తున్నాను.
కనుక ఓ గోవిందా! అచ్యుతా! మాధవా! ఈ స్నానానానికి యథోక్తఫలం కలిగేలా అనుగ్రహించు'' అని ప్రార్థించడం.
“సవిత్రే ప్రసవితే చ పరంథామ జలేమమ \ త్వత్తేజసా పరిభష్టం పాపం యాటు సహస్రథా''
అని సూర్యునకు ఆర్ఘ్యప్రదానం చేయాలి. అంటే "ఓ పరంజ్యోతి స్వరూపుడా! నీ తేజస్సుచే నా పాపములు సర్వము వేయి తునాతునకలుగా వ్రక్కలై ఈ జలములందు బడి నశించుగాక'' అని ప్రార్థించడం..
“ఉత్తమంతు సనక్షత్రం, మధ్యమం లుప్తతారకమ్ సవితుర్యుదితే భూప, తతోహీనం ప్రకీర్తితమ్II
తెల్లవారుఝామున నక్షత్రాలుండగా స్నానం చేయడం ఉత్తమం. తారకలు లేనప్పుడు స్నానం చేయడం మధ్యమం. సూర్యోదయం తర్వాత స్నానం చేస్తే అధమం, నిష్ఫలమని పండితులు చెబుతున్నారు..
ఈ విధంగా మాఘస్నానం చేసిన తరువాత, పితృతర్పణాది నిత్యకర్మలు
పూర్తిచేసుకుని, ఇష్టదైవాన్ని ఆరాధించాలి. ఆ తర్వాత, దానధర్మాలు
చేయాలి. వస్త్రాలు, కంబళ్ళు, పాదరక్షలు, గొడుగు, తైలము, నెయ్యి, తిలపూర్ణఘటము, బంగారము, అన్నము
మొదలైనవి దానం చేస్తే మహాపుణ్యఫలం లభిస్తుంది. చేయగలితే సమర్థత, అవకాశం
ఉన్నవారు "నేతితో తిలహోమం'' చేస్తే మరింత పుణ్యం కలుగుతుంది.
భక్తులందరూ శక్తిననుసరించి మాఘ పూర్ణిమ వ్రతం ఆచరించి, సముద్ర స్నానం చేసి,
ఉపవాస విధిని ఆచరించి, చెయ్యగలిగినంతలో దానధర్మాలు చేసి భగవంతుడి అనుగ్రహం
పొందాలని ఆశిస్తూ...
భమిడిపాటి
బాలాత్రిపురసుందరి
చరవాణి:
9440174797