ఉపనిషత్కథలు
ఓం
5. బ్రహ్మవిద్బ్రహ్మైవ
భవతి
(బ్రహ్మజ్ఞాని బ్రహ్మమే అవుతాడు)
సృష్టికర్త, జగత్తును
పరిపాలించేవాడు అయిన బ్రహ్మదేవుడు దేవతలందరికంటే ముందు పుట్టాడు. ఆయనే జగత్తును
సృష్టించి, రక్షిస్తున్నాడు. అన్ని శాస్త్రాలకి ఆధారమైన బ్రహ్మ విద్యను మొదట తన
పెద్ద కుమారుడు అథర్వుడికి నేర్పించాడు.
బ్రహ్మ
ఉపదేశించిన బ్రహ్మ విద్యని అథర్వుడు ’అంగిరుడికి’ ఉపదేశించాడు. అదే విద్యని
భరద్వాజ గోత్రంలో పుట్టిన ’సత్యవహుడు’ అథర్వుడి దగ్గరనుంచి ఉపదేశం
పొందాడు. సత్యవహుడు తిరిగి ఆ విద్యనే ’అంగిరసుడికి’ ఉపదేశించాడు. గురుశిష్య సంబంధాలతో
గురువుద్వారా శిష్యుడు, ఆ శిష్యుడు తన శిష్యుడికి ఉపదేశిస్తూ వెళ్ళడం వల్ల
బ్రహ్మవిద్య అంగిరసుడికి చేరింది.
శౌనక మహర్షి ఉత్తమ గృహస్థుడుగా పేరు పొందాడు. బ్రహ్మవిద్యలో అపారమైన
పాండిత్యం కలిగిన మహర్షుల్లో అంగిరస మహర్షి గొప్పవాడని, తనకు కలిగిన సందేహాన్ని ఆయనే
తీర్చ గలడని అనుకుని ఆయన ఆశ్రమానికి బయలుదేరాడు.
పూల
చెట్లతోను, నిండా పండిన పండ్ల చెట్లతోను ఆవరించి ఉన్న ఆ ప్రదేశం ఏ శబ్దం లేకుండా
చాలా ప్రశాంతంగా ఉంది. పూజా మందిరాల్నుంచి వినిపిస్తున్న గంటల మోతలు, బ్రహ్మచారుల వేద
స్వరాలు ఒకే స్వరంతో వినిపిస్తూ అక్కడి నిశ్శబ్ద వాతావరణాన్నిభంగ పరుస్తున్నాయి.
“ “స గురుమేవాభిగచ్ఛేత్
సమిత్ ప్రాణి: శ్రోత్రియం బ్రహ్మనిష్టం”” అని వేదంలో చెప్పబడిన విధంగా శౌనక మహర్షి శాస్త్ర ప్రకారం తనతో
సమిధలు, పూలు, పళ్ళు తీసుకుని వెళ్ళాడు. దట్టమైన చెట్లతో చీకటిగా ఉన్న అడవుల్ని,
చిన్న చిన్న సెలయేళ్ళని దాటుకుంటూ అంగిరసుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఏకాంతంలో
కూర్చున్న మహర్షిని తనతో తెచ్చిన పూలతో పూజ చేసి, సమిధలు, పళ్ళు ఇచ్చిసాష్టాంగ
నమస్కారం చేసి వినయంగా నిలబడ్డాడు.
కొంచెం
సేపయ్యాక “ “పూజ్యుడవైన మహర్షీ !
మానవుడు దేన్ని తెలుసుకోవడం వల్ల ఈ ప్రపంచం మొత్తాన్ని తెలుసుకో గలుగుతాడు ?” అని
తనకు సందేహాన్ని తీర్చమని అడిగాడు.
అంగిరసమహర్షి శౌనకుడికి ఈ విధంగా వివరిస్తున్నారు. “ శౌనకా! పర, అపర అనే
రెండు విద్యలు తెలుసుకోవలసిన విద్యలని బ్రహ్మవిదులు చెప్తున్నారు. ఈ రెండు
విద్యల్లో ధర్మాధర్మాల్ని, వాటి సాధన గురించి, వాటి ద్వారా కలిగే ఫలితాల్ని తెలియ
చేసే నాలుగు వేదాలు, వాటి అర్ధాల్ని తెలియచేసే శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం,
ఛందస్సు, జ్యోతిషం అనే ఆరు వేదాంగాలూ అపర విద్యలు. స్వర్గానికి చేరడానికి అవసరమయిన
కర్మకాండలు కూడా అపరవిద్యలే.
శాశ్వతంగా ఉండేదాన్ని గురించీ, అమరత్వాన్ని గురించీ తెలియ చేసేది పరవిద్య.
జ్ఞానేంద్రియాలయిన కళ్ళు మొదలయిన వాటికి కనిపించంది, చేతులు మొదలైన కర్మేంద్రియాలకి
దొరకంది, పెరుగుదల లేంది, రంగు, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు లేంది, శాశ్వతమైంది,
అంతటా వ్యాపించింది, అత్యంత సూక్షమైంది, సృష్టికి మూలకారణమైంది అయిన
అక్షరతత్త్వాన్ని జ్ఞానులు సకల జగత్తుకూ కారణమైన దాన్నిగా అంతటా చూడగలరు.
సాలెపురుగు తన గూడును నోటినుంచి వెలుపలికి తీసి తిరిగి తనలోకే తీసుకునే
విధంగాను, భూమి నుంచి మూలికలన్నీ పుట్టుకొచ్చే విధంగాను, మానవుని తలమీద, శరీరం మీద
తలవెంట్రుకలు ఏ ప్రయత్నం లేకుండానే పెరిగే విధంగాను అక్షరతత్త్వం నుండి విశ్వం
పుట్టుకొస్తోంది. తపస్సు వల్ల బ్రహ్మం పెరుగుతుంది. ఆ బ్రహ్మం నుండి అన్నం పుడుతోంది.
అన్నం నుంచి ప్రాణశక్తి, మనస్సు, పంచభూతాలు, లోకాలు, కర్మలు అన్నీ
ఉద్భవిస్తున్నాయి.
సృష్టికర్త, సర్వవిదుడు, జ్ఞానమే తపంగా గల బ్రహ్మ, సకల ప్రాణులు, వాటి
ఆహారం అన్నీ పరబ్రహ్మం నుంచే ఉద్భవిస్తున్నాయి.
ఋషులు
వేదమంత్రాల్లో ఏ యే వేదకర్మల్ని దర్శించారో అవి అన్నీ కూడా సత్యమే. మూడు వేదాలు
వీటిని వివరంగా వర్ణిస్తున్నాయి. సత్యాన్ని ఇష్టపడే వాళ్ళందరూ దీన్ని విధిగా ప్రతి
రోజూ అనుష్ఠానం చెయ్యాలి. పుణ్యకర్మల వల్ల కలిగిన ఫలితాల్ని ఏ లోకంలో అనుభవిస్తారో
దాన్ని చేరడానికి ఇదే మార్గం.
హోమాగ్ని
చక్కగా మండుతూ జ్వాలలు లేస్తూ ఉన్నప్పుడు అగ్నికి శ్రద్ధతో ఆహుతులు సమర్పించాలి. అగ్నిహోత్ర
యజ్ఞం చేసే సమయంలో అమావాస్యరోజున, పౌర్ణమి రోజున, చాతుర్మాస్యంలోను, పంటనూర్పిడి
సమయంలోను చేయవలసిన కర్మలు చేయకపోయినా,యజ్ఞసమయంలో చేయాల్సిన కర్మలు చేయకపోయినా,
అతిథులు లేకపోయినా, విశ్వేదేవతలకి ఆహుతులు లేకపోయినా,పశువులకి పక్షులకి ఆహారదానం
చెయ్యకపోయినా, శాస్త్ర పద్ధతికి విరుద్ధమైన కర్మలు చేసినా, అటువంటి యజ్ఞం ఏడు లోకాల్లోను
యజ్ఞకర్త యొక్క ఉత్తరగతుల్ని నాశనం చేస్తుంది.
భుగభుగలాడే
అగ్నికి ఏడు నాలుకలు. అవి కాలీ, కరాలీ, మనోజవా, సులోహితా, సుధామ్రవర్ణా,
స్ఫులింగిని, విశ్వరుచి. దేదీప్యమానంగా వెలిగే ఈ జ్వాలల్లో ఇవ్వవలసిన విధంగా
ఆహుతులిచ్చిన వాళ్ళని ఆ ఆహుతులే సూర్యకిరణాలై దేవతలకి ప్రభువైన ఇంద్రుడి దగ్గరికి
తీసుకుని వెడతాయి.
కళకళలాడుతున్న ఆహుతులు యజ్ఞకర్తని ఆదరంగా
ఆహ్వానించి సూర్యకిరణాల ద్వారా తీసుకుని వెడతాయి. తియ్యని మాటలతో మర్యాదపూర్వకంగా “ మీరు మీ పుణ్యకర్మల వల్ల సంపాదించుకున్న పావనమైన పుణ్యలోకం
ఇదే” అంటూ వెంట తీసుకుని వెడతాయి. పద్ధెనిమిది అంగాలతో ఉండే
యజ్ఞకర్మలన్నీ నిజానికి బలంలేని తెప్పలవంటివే. జీవితపరమార్ధం ఇదేనని చెప్పే
మూర్ఖులు ముసలితనం, మృత్యువు అనే చక్రంలో పడి మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటారనడానికి
సందేహం లేదు.
అజ్ఞానంతో ప్రాపంచిక విషయాల్లో పడి
మునుగుతూ తామే చాలా గొప్పవాళ్ళమని, వేదవేదాంగాలు తమకే బాగా తెలుసునని, తమని గురించి
తామే గొప్పగా చెప్పుకునే మూర్ఖులు రోగం, ముసలితనం, చావు వంటి దు:ఖాలు కలిగించే
వాటితో మళ్ళీమళ్ళీ పుడుతూ, గుడ్డివాళ్ళు నడిపిస్తుంటే నడుస్తున్న గుడ్డివాళ్ళల్లా
జన్మజన్మలకూ దారి తెలియక అనేక జన్మలు
పొందుతారు.
అజ్ఞానంలో మునిగి ఉన్న ఈ మూర్ఖులు
తాము ఏదో సాధించామని అనుకుంటారు. కర్మఫలాల మీద కోరిక ఉన్న వాళ్ళకు ఎప్పటికీ
జ్ఞనోదయం కలగదు. కనుక, పూర్వజన్మ ఫలితంతో స్వర్గలోక సుఖాలు అనుభవించాక మళ్ళీ
వాళ్ళకు కలిగేది అధోగతే .యజ్ఞకర్మలు, పుణ్యకార్యాలు మాత్రమే అన్నింటి కంటే
ఉత్తమమైనవనీ అంతకు మించినవి లేవని అనుకుంటూ ఉంటారు. వీళ్ళు భోగాలతో నిండిన
స్వర్గలోకాల్లో తమ పుణ్య ఫలాన్ని మొత్తాన్ని అనుభవించి తిరిగి హీనమైన లోకాల్లోకి
ప్రవేశిస్తారు.
ప్రశాంతమైన మనస్సు కలవాళ్ళూ, జ్ఞనవంతులూ బిక్షాటన చేస్తూ, అడవిలో ఏకాంతంగా
కూర్చుని, శ్రద్ధతో తపస్సు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ పాపాలన్నింటినీ ఇక్కడే
ప్రక్షాళన చేసుకుని సూర్యమార్గం ద్వారా శాశ్వతమైన బ్రహ్మం ఉండే చోటికి
చేరుకుంటారు. వివిధ కర్మల వల్ల పొందే లోకాల గురించి తెలుసుకుని వాటి పట్ల వైరాగ్యాన్నీ,
ఉదాసీనతనీ పెంచుకోవాలి. కర్మలవల్ల పరబ్రహ్మను పొందలేం కనుక, పరబ్రహ్మతత్త్వాన్ని
తెలుసుకునేందుకు యథావిధిగా వేదాలు నేర్చినవాడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువు దగ్గర
చేరి శిష్యరికం చెయ్యాలి. సాధన చెయ్యగలిగిన శక్తి, ఏకాగ్రత కలిగిన మనస్సుతో వచ్చిన
ఆసక్తి కలిగిన శిష్యుడికి శాశ్వతమైన లోకాన్ని అందించే బ్రహ్మవిద్యని గురువు సంపూర్ణంగా
అందించాలి.
జ్వాలలు లేస్తున్న మంటలనుంచి
అటువంటి నిప్పురవ్వలే వేలకొద్దీ పుట్టుకొస్తున్న విధంగా శాశ్వతమైన బ్రహ్మం నుంచి
అనేక విధాలైన జీవులు పుట్టుకొచ్చి మళ్ళీ అందులోనే లీనమవుతాయి. తనకు తానుగా
ప్రకాశించేవాడు, ఆకారం లేనివాడు, అనాదిగా పరిశుద్ధమైనవాడు, అంతటా వ్యాపించినవాడు
అయిన పరబ్రహ్మ లోపల, బయటా కూడా ఉన్నాడు. జీవుడికి, మనస్సుకి కూడా పూర్వం నుండి
ఉన్న ఆ పరబ్రహ్మం కంటికి కనిపించని విశ్వం యొక్క పుట్టుకకు కారణమై, రూపానికి కూడా
అతీతమై ఉన్నాడు. పరబ్రహ్మ తత్త్వం నుంచే జీవం,
మనస్సు, అన్ని ఇంద్రియాలు, గాలి, ఆకాశం, నిప్పు, నీళ్ళు, అంతటికీ ఆధారమైన భూమి
అన్నీ పుట్టాయి. ఇదే నిజమని తెలుసుకోవాలి.
ఈ పరబ్రహ్మ తత్త్వానికి శిరస్సు
దేవలోకం, కళ్ళు సూర్యుడు చంద్రుడు, చెవులు దిక్కులు, తెరిచి ఉన్న నోళ్ళు
ప్రసిద్ధమైన వేదాలు, ఊపిరి గాలి, జగత్తు గుండె. ఈ భూమి పుట్టేది పాదాలనుంచే. ఈ
తత్త్వమే అన్ని భూతల్లోనూ ఉన్న ఆత్మ.
ఆ తత్త్వం నుంచే దేవలోకం పుట్టింది.
సూర్యుడు దేవలోకాన్ని ప్రకాశింపచేస్తున్నాడు.దేవలోకంలో ఉండే చంద్రుడి నుండి
వర్షించే మేఘాలు, ఆ మేఘాలవల్ల కురిసే వర్షం వల్ల భూమి మీద ఓషధులు పుడుతున్నాయి. పురుషుడు
స్త్రీయందు రేతస్సు విడవడం ద్వారా జీవులు పుడుతున్నాయి. ఈ విధంగా అంతటా వ్యాపించిన
ఆ తత్త్వం నుంచి ఎన్నో జీవులు పుట్టుకొస్తున్నాయి.
ఈ తత్త్వం నుంచి వేదఋక్కులు,
సామగానాలు, యజ్ఞవిధులు, వ్రతాలు, క్రతువులు, కర్మలు, యజ్ఞ దక్షిణలు, యజ్ఞసమయం,
యజమాని, సూర్యచంద్రులు పావనం చేసే లోకాలన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి. వివిధ లోకాల్లో
ఉండే దేవతలు, సాధ్యులు, మానవులు, జంతువులు, పక్షులు, ఉఛ్వాశనిశ్వాసాలు, వరి యవధాన్యాలు,
తపస్సు, శ్రద్ధ, సత్యం, బ్రహ్మచర్యం, విధులు, నిషేధాలు అన్నీకూడా పుడుతున్నాయి.
దాన్నుంచే ఏడు ఇంద్రియాలు, వాటి
గ్రహణ శక్తులు, వాటి విషయాల జ్ఞానం, హృదయ కుహరంలో ఉంటూ జీవశక్తులు సంచరించే ఏడేడు
లోకాలు, అన్నీ ప్రభవిస్తున్నాయి. వీటన్నింటినీ ఏడేడుగా భగవంతుడే సృష్టించాడు.
సముద్రాలు, పర్వతాలు కూడా భగవంతుడి నుండే సంభవిస్తాయి. యజ్ఞకర్మలు, జ్ఞానం,
తపస్సు,ఈ సమస్తంలోనూ ఆ తత్త్వమే నిండి ఉంది.
ఓ సౌమ్యుడా! హృదయ కుహరంలో ఒదిగి ఉన్న
తత్త్వమే అన్నింటికంటే ఉత్తమమైంది, శాశ్వతమైంది అయిన బ్రహ్మం యొక్క తత్త్వంగా
తెలుసుకున్నవాడు అజ్ఞానాన్ని పోగొట్టుకుని ఈ జన్మలోనే మోక్షాన్ని పొందుతాడు.
అన్ని అనుభవాలలోను కనిపించేది, అతి
దగ్గరలోనే ఉన్నది, హృదయ కుహరంలో తిరుగుతూ ఉండేది అయిన ఈ బ్రహ్మం అన్నింటికీ
ఆశ్రయం. కదిలేవి, శ్వాసించేవి, రెప్పలార్చేవి, ఆర్చనివి అన్నీ కూడా బ్రహ్మంలోనే స్థిరంగా ఉన్నాయి.
స్థూలసూక్ష్మాలకు కారణమైంది, అందరూ ఆరాధించేది, అన్నింటి కంటే ఉత్తమమైంది, జ్ఞానానికి
కూడా అందనిది అయిన బ్రహ్మాన్ని తెలుసుకో.
ప్రకాశవంతమైంది, అణువుకంటే
సూక్షమైంది, శాశ్వతమైంది అయిన బ్రహ్మం అన్ని లోకాలకీ, ఆ లోకాల్లో నివసించేవాళ్ళకి
కూడా నిలయమై ఉంది. ఆ బ్రహ్మమే ప్రాణం, వాక్కు, మనస్సు, మంచి వస్తువు, అమరత్వం
కూడా. ఉపనిషత్తులు అందిస్తున్న ఈ మహాస్త్రాన్ని ధనుస్సుగా తీసుకో. నిత్యం చేసే
ఉపాసనవల్ల తీక్ష్ణమైన బాణాన్ని ఎక్కుపెట్టు. ఎటూ చెదరకుండా బ్రహ్మచింతనలోనే కేంద్రీకరించిన మనస్సుతో వింటినారిని చెవిదాకా
లాగు. నాశనం లేని బ్రహ్మమే లక్ష్యం. ఆ బ్రహ్మాన్ని తెలుసుకో.
’ఓం’ అనే ప్రణవ
మంత్రమే ధనస్సు. లోనున్న ఆత్మే బాణం. బ్రహ్మమే లక్ష్యం. ప్రశాంతమైన మనస్సుతో ఆ
లక్ష్యాన్ని ఛేదించాలి. లక్ష్యాన్ని ఛేదించిన బాణం దానితో ఒకటై పోయినట్టే
బ్రహ్మంతో కలిసి పోవాలి. భూమ్యాకాశాలు, వాటి మధ్యనున్న అంతరాళం, మనస్సు, పంచ ప్రాణాలు
దేనితోఅల్లుకుని ఉన్నాయో అదే ఆత్మ అని తెలుసుకో. ఇతరములైన వ్యర్ధ ప్రసంగాలు
వదులుకో. ఈ సంసార సాగరాన్ని దాటి అమరత్వాన్ని చేర్చే సేతువు ఇదే.
రథ చక్రంలో ఉన్న ఆకులన్నీ ఇరుసే
ఆధారంగా ఉన్నట్టు, శరీరంలో ఉన్ననాడులు, సిరలతో నిండి ఉన్న హృదయకోశం లోపల ఆత్మ అనేక విధాలుగా సంచరిస్తూ ఉంటుంది. ఆ
ఆత్మనే ’ఓం’ అని ధ్యానించండి.
అజ్ఞానాంధకారం నుంచి బయట పడాలనుకునే మీకు శుభం కలుగుతుంది. ఆత్మకు అన్నీ తెలుసు.
హృదయాకాశంలో జ్యోతిర్మయమైన బ్రహ్మపురంలోనే అది నివసిస్తుంది. మనస్సే దానికి
వస్త్రం. ప్రాణ శరీరాలకి అది యజమాని. హృదయంలో
స్థిరంగా ఉన్నాశరీరమంతా ఆవహించి ఉంటుంది. జ్ఞానులు మాత్రమే ఆనందమయమైన
అమరత్వస్థితిని తెలుసుకుంటారు.
ఆత్మను తెలుసుకోవడం వల్ల అజ్ఞానం
నశిస్తుంది. సందేహాలన్నీ తీరిపోతాయి. జ్యోతిస్వరూమైన మనిషి యొక్క ఆనందమయకోశంలో
నిర్మలం, నిరవయవం, విశుద్ధం అయిన బ్రహ్మం నివసిస్తుంది. కాంతినిచ్చే వాటన్నింటికీ
కాంతిని ఇచ్చేది అదే. దాన్ని గురించే ఆత్మవిదులు తెలుసుకుంటారు. అక్కడ సూర్యుడు
ప్రకాశించడు. చంద్రుడు తారలు వెలుగునియ్యవు. మెరుపులు కూడా కాంతిని ఇవ్వవు. అగ్ని
విషయం కూడా అంతే. ఆత్మకు ఉండే తేజస్సు వల్ల మాత్రమే అన్నీ కాంతిని పొందుతున్నాయి. విశ్వమంతా
ఆత్మ జ్యోతి వల్లనే దేదీప్యమానంగా
ప్రకాశిస్తోంది.
ఇదంతా శాశ్వతమైన బ్రహ్మమే. కింద, పైన,
అన్ని వైపుల, ముందూ వెనుక అంతటా ఆ బ్రహ్మం విరాజమానమై ఉంది. నిజంగా ఈ విశ్వమంతా
అన్నింటికంటే ఉత్తమమైన ఆ బ్రహ్మమే నిండి ఉంది.
ప్రాణస్నేహితులయిన రెండు పక్షులు
ఒకే చెట్టు మీద కూర్చున్నాయి. వాటిలో ఒకటి చెట్టు మీద ఉన్న పండ్లని ఇష్టంగా
తింటోంది. రెండో పక్షి ఏమీ తినకుండా చూస్తూ కూర్చుంది. ఒకే చెట్టు మీద కూర్చున్న ఆ
రెండు పక్షుల్లో ఒకటి జీవాత్మ. అజ్ఞానంలోను, భ్రమలోను మునిగి తన బలహీనతకి
దు:ఖపడుతోంది. కాని, పూజనీయమైన, యజమాని అయిన పరమాత్మను చూడగానే దాని దు:ఖమంతా
తగ్గిపోతోంది. స్వయంప్రకాశకుడు,
సృష్టికర్త బ్రహ్మకంటే కూడా ముందు ఉన్నవాడు, విశ్వమంతటికి కర్త అయినవాడు, పరమాత్మను
తెలుసుకున్న వివేకవంతుడైన సాధకుడు పుణ్యపాపాల్ని దాటి దు:ఖంలేని అన్నింటికంటే
ఉత్తమమైన సమస్థితిని పొందుతున్నాడు.
ఈశ్వరుడే అన్ని జీవుల్లోను ప్రాణంగా
ప్రకాశిస్తున్నాడు. అది తెలుసుకున్న విద్వాంసుడు మాటను అదుపులో ఉంచుకుని అసలైన
విద్వాంసుడిగా ప్రకాశిస్తాడు. అతడు అత్మయందే విహరిస్తూ, ఆనందిస్తూ, పుణ్యకార్యాలు
చేస్తూ బ్రహ్మజ్ఞానుల్లో మొదటివాడుగా నిలబడతాడు. ఆత్మనిగ్రహం ఉన్నవాళ్ళు కొంచెం
కూడా పాపాలు లేకుండా చేసుకుని జ్యోతిర్మయం, పరిశుద్ధం అయిన ఆత్మానుభూతిని
పొందుతారు. సత్యం, తపస్సు, ధ్యానం, జ్ఞానం, బ్రహ్మచర్యం వంటివి పద్ధతిగా ఎప్పుడూ ఆచరిస్తూ
ఉండడం వల్ల ఆ ఆత్మ అతడి మనస్సులోనే దొరుకుతుంది.
నిజాన్ని మాట్లాడేవాళ్ళే ఎప్పుడూ
గెలుపుని పొందుతారు. అబద్ధాన్ని ఆశ్రయించే వాళ్ళకి ఎప్పుడూ ఓటమే కలుగుతుంది.
కోరికల్ని వదిలిన ఋషులు ఈ మార్గం ద్వారానే సత్యానికి నిలయమైన పరమపదాన్ని
చేరుకుంటారు. ఇంత అని చెప్పడానికి వీలు
లేని జ్యోతి స్వరూపం మనస్సుకి తెలియనంతగా ప్రకాశిస్తుంది. అతి సూక్ష్మమైన, చాలా
దూరంగా ఉన్న పరబ్రహ్మం శరీరంలోనే ఉంది. ఋషులు హృదయంలో ఉన్న పరబ్రహ్మని బ్రతికి
ఉండే చూడగలరు.
ఆత్మని మాటలతో వర్ణించలేం. కళ్ళతో
చూడలేం, ఇంద్రియాలతో అనుభవించలేం. ఏ విధమైన పుణ్యకార్యాలు దాన్ని చూపించలేవు.
మనస్సు ప్రశాంతంగాను, నిర్మలంగాను ఉన్నప్పుడు ప్రాణాన్ని, మనస్సుని, శరీరాన్ని
అన్నింటినీ వదిలేసి ధ్యానంలో నిమగ్నమైనవాడు ఆత్మను దర్శిస్తాడు. ఈ శరీరంలో ప్రాణం
అయిదు విధాలుగా వ్యాపించి ఉంటుంది. సూక్ష్మమైన ఆత్మజ్ఞానం వల్లనే దాన్ని
తెలుసుకోవాలి. మనిషి జ్ఞానం చుట్టూ ఇంద్రియాలు అల్లుకుని ఉంటాయి. స్వచ్ఛమైన,
నిర్మలమైన జ్ఞానంతోనే ఆత్మదర్శనం కలుగుతుంది. పరిశుద్ధమైన మనస్సు కలవాడు తనకి గల
కోరికల్నివేంటనే పొంద గలుగుతాడు. కనుక, లోకంలో సంపదల మీద కోరికలు ఉన్నవాడు
అత్మజ్ఞానం పొందినవాణ్ణి ఆరాధించాలి.
ఆత్మసాక్షాత్కారం పొందినవాడు గొప్ప
ప్రకాశం కలిగిన, జగత్తు మొత్తానికి ఆధారమైన బ్రహ్మాన్ని తెలుసుకుని మోక్షాన్ని
పొందుతాడు. ఇంద్రియ సుఖాలకోసం ఆరాటపడేవాళ్ళు వాటిని తీర్చుకోడం కోసం మళ్ళీ మళ్ళీ పుడుతూనే
ఉంటారు. ఆత్మసాక్షాత్కారం పొందిన జ్ఞానికి కోరికలు ఈ జన్మలోనే నశించి పోతాయి.
గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వడం వల్లగాని, శాస్త్రాలన్నీ చదవడం వల్ల గాని, గొప్ప
పండితులు చెప్పినదాన్ని విని ఆత్మను గురించి తెలుసుకోడం వల్ల గాని ఆత్మానుభవం
కలగదు. మనస్సులో దాన్ని గురించే ఆలోచిస్తూ తపనతో ధ్యానం చేసేవాడికి మాత్రమే ఆత్మయొక్క
స్వరూపం తెలుస్తుంది. మనోబలం లేనివాళ్ళకి, అజాగ్రత్తగా ఉండేవాళ్ళకి, శాస్త్రానికి
వ్యతిరేకంగా తపస్సు చేసేవాళ్ళకి ఆత్మ కనిపించదు. దృఢమైన మనస్సు, తగిన శ్రద్ధ కలిగి
ప్రయత్నించేవాళ్ళ ఆత్మ పరబ్రహ్మలో లీనం అవుతుంది.
ఆత్మానుభవం పొందిన ఋషులు
ఆత్మజ్ఞానంతో తృప్తిపడతారు. వాళ్ళకి కోరికలు అనేవి ఉండవు. వాళ్ళు పరమాత్మ
స్వరూపంగా అంతటా పరమాత్మనే దర్శించుకుంటారు. వైరాగ్యం, నిరంతర సాధన వల్ల
పరమాత్మలోనే మనస్సుని నిలిపే సాధకులు ఆత్మసాక్షాత్కారం పొంది పరబ్రహ్మను దర్శించి
మోక్షాన్ని పొందుతారు. వారిలో ఉండే పదిహేను అంశాలు వాటి స్థానానికి, వాళ్ళ
ఇంద్రియాలు వాటి అధిదేవతల్లోకి, వాళ్ళు చేసిన కర్మలు జీవాత్మకు సంబంధించిన
శాశ్వతమైన తత్త్వంలోకి ప్రవేశిస్తాయి.
ప్రవహించే నదులు తమ పేర్లు
పోగొట్టుకుని సముద్రంలో కలిసిపోయినట్టు జ్ఞాని కూడా తన నామ రూపాల్ని పోగొట్టుకుని
అన్నింటికంటే ఉత్తమమైన, గొప్పప్రకాశం కలిగిన పరబ్రహ్మ తత్త్వంలో లీనమవుతాడు.
పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకున్న ప్రతివాడు పరబ్రహ్మే అవుతాడు. “స యోహ వై తత్పరమం బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి” అతడి వంశంలో అందరూ బ్రహ్మవిదులే జన్మిస్తారు. దు:ఖాలకి, పాపాలకి
అతీతుడై శాశ్వతమైన అమరత్వాన్ని పొందుతాడు. అటువంటి బ్రహ్మవిద్యావేత్తకు నమస్కారాలు
అంటోంది శ్రుతి.
నియమ నిష్ఠలతో కర్మలు చేసినవాళ్ళకి,
వేదాల్ని అభ్యసించినవాళ్ళకి, బ్రహ్మాన్ని ఉపాసించినవాళ్ళకి, శ్రద్ధ కలిగినవాళ్ళకి,
ఏకర్షి అనబడే అగ్నికి ఆహుతులు ఇచ్చినవాళ్ళకి, శాస్త్రబద్ధంగా శిరోవ్రతాన్ని
అనుష్ఠానం చేసినవాళ్ళకి మాత్రమే బ్రహ్మ విద్యను ఉపదేశించాలి.
ఇదే నిజమైన నిజం! ఈ నిజాన్నే
పూర్వకాలంలో అంగిరసుడు తన శిష్యులకి ఉపదేశించాడు.ఏ ఇతర వ్రతాన్నీ చెయ్యనివాడు
దీన్ని నేర్చుకోకూడదు. మహాఋషులారా! మీకు నమస్కారాలు! మహాఋషులారా! మీకు నమస్కారాలు!
(ముండకోపనిషత్తు ఆధారంగా)
No comments:
Post a Comment