About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నాన్నమ్మ చెప్పిన సింహం కథ

 

 

                                                       నాన్నమ్మ చెప్పిన సింహం కథ    

   పిల్లలందరూ ఒకళ్ల చొక్కా మరొకళ్లు పట్టుకుని ఒకళ్ల వెనకాల మరొకళ్లూ పరుగెత్తుకుంటూ రైలుబండిలా కూతవేస్తూ వచ్చేశారు. వచ్చినవాళ్లు అందరూ ఒక్కసారిగా ఆగిపోయారు.

   నాన్నమ్మ కళ్లజోడు కనిపించింది కాని, నాన్నమ్మ కనిపించలేదు. ఇల్లంతా వెతికి మళ్లీ అదే గదిలోకి వస్తుంటే తలుపు వెనకనుంచి నాన్నమ్మ ’’భౌ’’ అని అరిచింది. పిల్లలందరూ భయపడిపోయి పట్టుకున్న చొక్కాలు వదిలేశారు.

   వాళ్లని చూసి నాన్నమ్మ “ఏమర్రా! పెద్దదాన్ని నన్ను చూసి భయపడితే ఎలా బతుకుతారు? అయినా ఆమాత్రం ఆలోచన ఉండద్దా? నాన్నమ్మ చెప్పులు, కళ్లజోడు ఇక్కడే ఉన్నాయి.

   కళ్లజోడు, చెప్పులూ లేకుండా నాన్నమ్మ ఎక్కడికీ వెళ్లదు. పైగా చీకటి పడి అందరూ నిద్రపోయేవేళ.. కాబట్టి, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది! అన్న ఆలోచన లేకపోతే ఎలా? అంటూనే భయపడుతూ నిలబడ్డ పిల్లల్ని చూసి గట్టిగా నవ్వింది నాన్నమ్మ.

   పాపం పిల్లలకి అవమానంగా అనిపించింది. మొహాలు ముడుచుకుని కూర్చున్నారు. నాన్నమ్మకి జాలేసింది. “మీకివాళ బుర్ర పనిచేయలేదు కనుక, బుర్ర ఉన్న కథ చెప్తా! ఇది సింహం కథ. ఈ కథలో బుర్ర ఎవరికి ఉందో చూద్దాం సరేనా!” అంది నాన్నమ్మ.

   వెంటనే పిల్లల మొహాలు వికసించాయి. కథంటే చాలు పిల్లలు అన్నీ మర్చిపోతారు. అదే మరి బాల్యమంటే!

    తొందరగా చెప్పు నాన్నమ్మా!” అరిచారు పిల్లలు ఆతృతగా.

   నాన్నమ్మ కథ మొదలుపెట్టింది. అడవికి రాజెవరు? సింహం కదా! అడవంతకీ నేనే రాజుని, అన్ని జంతువులూ నేను చెప్పినట్టే వింటాయి... అనుకుని మురిసిపోతోంది ఒక సింహం. అలా అనుకోగానే దానికి గర్వం బాగా పెరిగింది.

   ఒకరోజు అడవిలో ఉన్న అన్ని జంతువుల్నీ పిలిచి సభ ఏర్పాటు చేసింది. వాటితో “సభకి అందరూ రావాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా?” అంది. దాని ఆజ్ఞ ప్రకారం జంతువులన్నీ సరయిన సమయానికి సభకి వచ్చేశాయి.

   సింహంరాజు సభ ప్రారంభించింది. “అడవిమృగాల్లారా! అందరూ వచ్చేశారా.. ఇంకా ఎవరేనా రాకుండా ఆగిపోయారా? సరే, నేను చెప్పేది వినండి. నేనీ సభ ఎందుకు ఏర్పాటు చేశానో చెప్తాను. నేను ఈ అడవికి రాజుని. మీకందరికీ ఆ విషయం తెలుసుకదా! అంది.

   తెలుసు మహారాజా! అసలు విషయం చెప్పండి” అన్నాయి అడవి జంతువులు.

   నేను ఈ అడవికి రాజునై ఉండి అడవిలో తిరిగి నా ఆహారం నేను తెచ్చుకోవడం బాగుండలేదు. అది నాకు చాలా అవమానంగా ఉంది. అసలు మీ రాజు తన ఆహారం తనే తెచ్చుకోడం మీక్కూడా అవమానమే కదా? ఇది పద్ధతిగా లేదు అంది సింహం.

  సింహం అలా అనగానే నువ్వు తిండానికే కదా.. గొణుక్కున్నాయి జంతువులు.

   మధ్యలో ఆ గుసగుసలేమిటి? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. రేపటి నుంచి మీలో ఒకళ్లు నాకు ఆహారంగా రావాలి. ఎవరొచ్చినా నాకు అభ్యంతరం లేదు. ఈ రోజు మీరంతా ఆలోచించుకుని రేపటి నుంచి ఎవర్నో ఒకళ్లని నాకు ఆహారంగా పంపించండి! ఇంక మీరు వెళ్లచ్చు! అని చెప్పి సింహం సభలోంచి వెళ్లిపోయింది.

   అడవిలో ఉన్న జంతువులన్నీ కలిసి ఆలోచించాయి. చివరికి అంత పెద్ద సింహానికి ఒక బుజ్జి కుందేలు పిల్లని ఆహారంగా పంపించాలని నిర్ణయించుకున్నాయి. కుందేల్ని పిలిచి చెప్పాయి.

   పాపం, బుజ్జి కుందేలు ఏమంటుంది? సరే! అని సింహానికి ఆహారంగా బయలుదేరింది. కుందేలు పిల్ల నడుస్తూ ఆలోచిస్తోంది. దానికి మెరుపులా ఒక ఉపాయం తట్టింది. ఆహా! నా బుర్రే బుర్ర! అనుకుని గెంతుకుంటూ సింహంరాజుని చేరుకుంది.

   సింహంరాజు కుందేల్ని చూసింది. “ఇదేమిటీ! నాకు ఆహారంగా వస్తూ ఉషారుగా గెంతుకుంటూ వస్తోంది? పాపం బుజ్జిది కదా చచ్చిపోతానని తెలియదేమో!  దానికి అసలు విషయం చెప్పకుండ పంపించి ఉంటారు” అనుకుంది.

   కుందేలు పరుగెత్తుకుంటూ వచ్చి “సింహంరాజా! సింహంరాజా! ఈ అడవిలో వేరే సింహం తనే రాజునని చెప్పుకుంటోంది. నన్ను తినేస్తానని నా వెంటపడింది. నేనూరుకుంటానా...పరుగెత్తుకుని వచ్చేశాను” అంది ఆయాసపడుతూ.

   ఇంకొక సింహమా? తనే రాజునంటోందా? ఏదీ చూపించు!” అంది సింహం. కుందేలు సింహాన్ని తీసుకుని వెళ్లి ఒక బావి దగ్గర ఆగింది. చేత్తో బావిలోకి చూపించింది.

   సింహానికి బావిలో తన నీడ కనిపించింది. “నేను కాకుండా ఇంకొక సింహం ఈ అడవిలో ఉండడానికి వీల్లేదు. పైగా తనే రాజునంటుందా? దీన్ని ఈ బావిలోనే చంపేస్తా! అంటూ బావిలోకి దూకేసింది.

   ఇంకేముంది? అన్ని అడవిజంతువులకి రాజైన సింహం ఆలోచన లేకుండ బావిలోకి దూకేసి, ఆ బావిలోనే చచ్చిపోయింది. బుజ్జి కుందేలు అడవంతా తిరుగుతూ తన ప్రతాపం అన్ని జంతువులకీ చెప్పేసింది. జంతువులన్నీ పండగ చేసుకున్నాయి. బుజ్జి కుందేల్ని ఎత్తుకుని అడవంతా ఊరేగించాయి.

   చూశారర్రా! కొంచెం బుర్ర ఉపయోగించి ఉంటే అలా చచ్చిపోయేదా? అందుకే మనకున్న తెలివితేటల్ని మనం ఉపయోగించుకోవాలి. తెలివితేటలు అందరికీ ఉంటాయి. ఉపయోగించడంలోనే కనబడుతుంది మన తెలివి. కుందేల్ని చూడండి! అంత చిన్న కుందేలయినా ఎలాంటి తెలివితేటల్ని ఉపయోగించిందో! తన తెలివితేటలతో అడవిలో ఉన్న జంతువులన్నింటినీ రక్షించింది. ఇందాక మీరు చూపించిన తెలివి సింహం తెలివిలా ఉంది” అని కథ ముగించింది నాన్నమ్మ.

   నిజమే నాన్నమ్మా! ఇప్పటి నుంచీ తెలివిగా ఉంటాం!” అన్నారు పిల్లలు.

   సరే, కథ రేపటికి...మనం నిద్రలోకి! అంది నాన్నమ్మ ఆవులిస్తూ.

   పిల్లలు కథ విన్నాక సంతృప్తిగా నిద్రపోయారు. అమాయికంగా నిద్రపోతున్న పిల్లలవైపు తృప్తిగా చూసుకుంది నాన్నమ్మ.

  

           

No comments:

Post a Comment