About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

 

 

 నాన్నమ్మ చెప్పిన అందరి దేవుడు ఒకడే ! కథ

     పూర్తిగా చీకటి పడకుండానే పిల్లలందరూ చేరిపోయారు. నాన్నమ్మ వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎవరికి వాళ్లే తనే కథ చెప్పేద్దామన్నంత ఆత్రంగా కనిపించారు. నాన్నమ్మ అక్కడ ఉన్నట్టు చూసుకోకుండా కబుర్లు చెప్పేసుకుంటున్నారు.

   నాన్నమ్మ వాళ్ల మాటలన్నీ వింటోంది. కాని అసలు విషయం అర్థం కాలేదు. సరే, వాళ్లే చెప్తార్లే అనుకుని కళ్లజోడు తీసి తుడుచుకుని మళ్లీ పెట్టుకుంది. మరచెంబు తీసుకుని గుక్కెడు మంచినీళ్లు గొంతులో పోసుకుంది.

    ఇంకా కొంచెం సేపు మాట్లాడకుండా ఊరుకుంది. ఇంతకీ వీళ్లంతా అన్నాలు తిన్నారో లేదో అని గుర్తొచ్చి ఏరా! ఇందాకట్నుంచి చూస్తున్నాను. ఒకటే గుసగుసలు. ఏం జరిగిందేమిటీ? ఇంతకీ అన్నాలు తిన్నారా లేదా? అడిగింది.

    నాన్నమ్మ గొంతు విని పిల్లలందరూ ఉలిక్కిపడ్డారు. అందరూ మాట్లాడ్డం ఆపేసి ఆశ్చర్యంగా నాన్నమ్మా! నువ్విక్కడే ఉన్నావా? అని అడిగారు. మళ్లీ వెంటనే తినేశాం! ఈరోజు కథ ఎవరు చెప్పాలా.. అని ఆలోచించుకుంటున్నాం అన్నారు.

   సరే అయితే, ఇంకా ఆలోచించుకోవాలా? పూర్తయిందా? అయినా కథలు చెప్పగలిగిన వాళ్లు ఇంతమంది ఉండి కూడా నన్నెందుకురా కథ చెప్పమని అడుగుతారు? అని అడిగింది నాన్నమ్మ.

  వెంటనే చందూ లేచి అయిపోయింది నాన్నమ్మా! నువ్వు చెప్పిన కథలు మా చిన్న పిల్లలకి నచ్చుతాయి. మేము కథలు వినడమే కాని, చెప్పలేము కదా! ఈ రోజు జగ్గూ కథ చెప్తానంటున్నాడు అన్నాడు.

   వెంటనే జగ్గూ లేచి  అవును నాన్నమ్మా! బాగా చెప్తాను, చెప్పనా? అన్నాడు.

   నాన్నమ్మ అందరి వైపు చూసి ఇంకెవరైనా చెప్తారా? అని అడిగింది. ఎవరూ మాట్లాడలేదు. వీళ్లు ముందే నిర్ణయించేసుకున్నారు బడుద్ధాయిలు అనుకుని సరే మొదలుపెట్టరా! అంది.

   జగ్గూ కథ చెప్పడం మొదలుపెట్టాడు. రాము వాళ్ల పాఠశాలలో గ్రంథాలయం ఉంది. చదువుకోడానికి వాళ్లకి ఒక మంచి కథల పుస్తకం ఇస్తూ ఉంటారు వాళ్ల టీచరు. రాము అందులో చదివిన కథని గుర్తుపెట్టుకుని ఇంటికి వచ్చాక తన స్నేహితులకి చెప్తూ ఉంటాడు. అది వాళ్లకి ఒక అలవాటుగా మారింది.

   అందుకోసం ప్రతి రోజు సాయంత్రం అందరూ ఒక చోట కలుసుకుంటారు. ఆ రోజు అందరూ శరత్ వాళ్ల వరి పొలంలో ఉన్న గడ్డిమేటు దగ్గర కలుసుకున్నారు. అందరూ కాసేపు కబుర్లు చెప్పుకుని కథ వినడానికి సిద్ధమయ్యారు. రాము కథ చెప్పడం మొదలుపెట్టాడు.

   శరత్! ఈ కథ వల్ల మనలో ఇంకా ఐకమత్యం పెరుగుతుంది. మనం పెద్దవాళ్లమయ్యాక కూడా విడిపోకుండా కలిసి మెలిసి ఉంటాం. కథ వినండి మరి...మనం వాయుదేవుడు, అగ్నిదేవుడు, సూర్యదేవుడు అంటూ చాలామంది దేవుళ్ల గురించి వింటున్నాం. అలాగే అసలు దేవుడు ఒకడే ఉన్నాడని కూడా వింటున్నాం. దాన్ని గురించే ఇప్పుడు ఈ కథ ద్వారా తెలుసుకుంటున్నాం.

   ఒకసారి రాక్షసులకి, దేవతలకి మధ్య యుద్ధం జరిగింది. దేవుళ్లందరూ కలిసి బాగా యుద్ధం చేసి రాక్షసుల్ని ఓడించారు. రాక్షసుల్ని జయించిన సంతోషంతో దేవుళ్లందరూ వాళ్లని వాళ్లే అభినందించుకున్నారు. అందరూ ఒకచోట కలిసి సంబరం చేసుకోవాలని కూడా అనుకున్నారు.

   వాళ్ల ఆనందానికి అంతులేకుండా పోయింది. రాక్షసుల్ని ఓడించడానికి తమ బలపరాక్రమాలే కారణమని, తమ కష్టంతోనే రాక్షసుల్ని ఓడించగలిగామని విర్రవీగి పోతున్నారు.

   వాళ్లు ఓడించింది మమూలువాళ్లని కాదుకదా...రాక్షసుల్ని! ఎంత కష్టం? అందుకే అంత అహంకారం.

   ఇదంతా అసలు దేవుడు చూస్తున్నాడు. వీళ్లందరూ తమకున్న బలంతోనే రాక్షసుల్ని ఓడించామని అనుకుంటున్నారు... దేనికైనా భగవంతుడి సహకారం అవసరమని, అది వాళ్లకి ఉంది కాబట్టే రాక్షసుల్ని ఓడించగలిగారని వీళ్లకి తెలియట్లేదు. అది తెలిస్తేనే గాని వీళ్ల అహంకారం తగ్గదు అనుకున్నాడు.

   అసలు దేవుడు ఒక సాధువు వేషంలో వచ్చి వాళ్లకి కొంచెం దూరంలో కూర్చున్నాడు. దేవుళ్లు అతణ్ని చూసి ఈ సాధువు ఎవరో, ఇక్కడికి ఎలా వచ్చాడో, అతడికి ఉన్న శక్తి ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నారు.

   అగ్నిదేవుణ్ని పిలిచి అగ్నీ! నువ్వు వెళ్లి అతడి విషయం ఏమిటో పూర్తిగా తెలుసుకుని, మన పరాక్రమం గురించి కూడా చెప్పిరా! అన్నారు.

   అగ్నిదేవుడు సాధువు దగ్గరికి వెళ్ళి నువ్వెవరివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని దర్పంగా అడిగాడు.

   సాధువు అగ్నిదేవుడికి సమాధానం చెప్పకుండానే అసలు నువ్వెవరు? అని ఎదురు ప్రశ్న వేశాడు.

   అగ్నిదేవుడు గట్టిగా నవ్వి నేనెవరో తెలియదా నీకు? నాపేరు అగ్నిదేవుడు అన్నాడు దర్పంగా.

   అయితే నీకు ఉన్న శక్తి ఏమిటో చెప్పు అని అడిగాడు సాధువు.

   ఈ భూమి మీద ఉన్న ఏ వస్తువునైనా సరే నేను నా వేడితో కాల్చి మసి చేసెయ్యగలను అన్నాడు అగ్నిదేవుడు గర్వంగా. 

   సాధువు ఒక గడ్డిపోచని కింద పెట్టి  దీన్ని మసి చేసి చూపించు! అప్పుడు కదా నీ శక్తి ఎంతటిదో తెలుస్తుంది! అన్నాడు.

    అగ్నిదేవుడు ఇంతేనా అనుకుని వేడిగా ఉండే తన ఊపిరితో గడ్డి పోచని కాల్చి మసి చెయ్యాలని గట్టిగా ఊదాడు. ఎంత ఊదినా అది మాడలేదు. మంటల్ని సృష్టించి దాన్ని మాడ్చాలని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డిపోచ మాడలేదు.

అగ్నిదేవుడు  సిగ్గుపడి సధువు వైపు చూడకుండా తల వంచుకుని మిగిలిన దేవుళ్ల దగ్గరికి వెళ్లిపోయాడు. వాళ్లందరూ తన వైపే చూస్తున్నారు. అక్కడ జరిగిన విషయం వాళ్లకి వివరంగా చెప్పాడు.

  ఈ సారి దేవుళ్లందరూ మాట్లాడుకుని వాయుదేవుణ్ని సాధువు దగ్గరికి పంపించారు.

   వాయుదేవుడు సాధువు దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అని అడిగాడు.

   అది విని సాధువు సమాధానం చెప్పకుండా అసలు నువ్వు ఏం చేస్తుంటావు? నీకు ఉన్న శక్తి ఏమిటి? అని తనే ఎదురు ప్రశ్న వేశాడు.

   నా పేరు వాయువు. నేను వాయుగుండాలు, తుఫాన్లు  సృష్టించగలను అన్నాడు ధీమాగా.

   సాధువు ఒక గడ్డి పోచ తీసి కింద పెట్టి, అయితే నీ బలంతో దీన్ని కదుపు అన్నాడు.

   వాయుదేవుడు దాన్ని చూసి ఇంతేనా అనుకుని ఒకసారి ఊదాడు. గడ్డిపోచ కొంచెం కూడా కదల్లేదు. తన శక్తినంతటినీ ఉపయోగించాడు మళ్లీ ఊదాడు. ఆ గడ్డి పోచ మాత్రం ససేమిరా కదలనంది. వాయుదేవుడు కూడా సిగ్గుపడి వెనక్కి వెళ్లిపోయాడు. జరిగిన విషయం మిగిలిన అందరు దేవుళ్లకి చెప్పాడు.

  ఈ సారి సాధువు సంగతేమిటో తెలుసుకుని రమ్మని వాళ్లు ఇంద్రుణ్ని పంపించారు. తమ దేవుళ్లకి సహాయం చెయ్యడానికి ఇంద్రుడు బయలుదేరి వెళ్లగానే సాధువు అక్కడి నుంచి మాయమైపోయాడు.

   ఇంద్రుడు అయోమయంగా అన్ని వైపులకి చూస్తున్నాడు. తను వచ్చిన పని పూర్తి చెయ్యాలంటే సాధువు కనిపించాలి. అంతలో అక్కడ సాధువుకి బదులు ఒక దేవత ప్రత్యక్షమైంది.

   ఇంద్రుడు దేవతని చూసి ఇంతవరకు ఇక్కడ ఉన్న సాధువు ఎవరు? ఏమయ్యాడు? అని అడిగాడు.

   దేవత ఇంద్రా! అతడే అసలు దేవుడు. మీరందరు భగవంతుడి సహకారం లేకుండా ఏ పని జరగదు అనే విషయాన్ని మర్చిపోయారు. రాక్షసుల్ని ఓడించడానికి మీకున్న బలమే కారణం అనే భ్రమలో ఉన్నారు.

   మీకందరికీ సహాయం చేస్తున్న దేవుడు ఒకడు ఉన్నాడని, అతడి వల్లే మీరు కూడా అన్ని పనులు చెయ్య కలుగుతున్నారని తెలుసుకోలేక పోయారు. ఆయన సహకారం లేనప్పుడు గడ్డి పోచని కూడా కదిలించలేక పోయారు.

   అది తెలియ చెప్పడానికే అసలు దేవుడు సాధువు రూపంలో ఇక్కడికి వచ్చాడు. ముందు ఆ విషయం నువ్వు తెలుసుకో. ఆ నిజాన్ని తెలుసుకున్న వాళ్లల్లో నువ్వు మొదటివాడివి అవుతావు. నీ తరువాత అగ్ని, తరువాత వాయువు అని చెప్పి వెళ్లిపోయింది దేవత.

   అందుకే దేవతల్లో మొదటివాడు ఇంద్రుడు, తరువాత అగ్ని, తరువాత వాయువు అని చెప్తుంటారు. రాక్షసుల్ని చంపడానికి అవసరమైనంత శక్తిని వాళ్లకి దేవుడు ఇచ్చాడు.

   అంటే దేవుడు ఒక్కడే అన్నమాట. దేవుడు ఏ రూపంలో ఉంటే మనకి భక్తి కలుగుతుందో  ఆ రూపంలో మనం దేవుణ్ని కొలుస్తున్నాం. ఎవరికీ కనిపించని ఆ దేవుడు మంచివాళ్లని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు.

    మతాలు ఎన్ని ఉన్నా...రూపాలు, పేర్లు ఎన్ని ఉన్నా...మేమే దేవుళ్లం అని ఎంతమంది చెప్పుకున్నా సరే,  దేవుడు మాత్రం ఒక్కడే!! అని ఈ కథ వల్ల తెలుస్తోంది కదా!

    అందుకని మనమందరం పెద్దవాళ్లమయ్యాక కూడా మంచిపనులు చేస్తూ కలిసిమెలిసి ఉందాం! ఆ దేవుడు మనకి కూడా సాయం చేస్తాడు అని రాము స్నేహితులకి చెప్పాడు అని తను చెప్తున్న కథని పూర్తి చేశాడు జగ్గు.

   కథ విని పిల్లలందరూ చప్పట్లు కొట్టి జగ్గూని అభినందించారు.

   నాన్నమ్మ జగ్గూ వైపు చూస్తూ ఈ కథ నీకెవరు చెప్పారు? అనిఅడిగింది.

   జగ్గు బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లినప్పుడు ఒక పుస్తకం కనిపించింది. అక్కడే కూర్చుని ఆ కథని చదివాను. తరువాత అక్కడి నుంచి వచ్చేశాను. అందుకే ఆ పుస్తకం పేరు చెప్పలేక పోయాను అని చెప్పాడు.

   నాన్నమ్మ జగ్గూతో కథ చాలా బాగా చెప్పావని చెప్తూ కథల పుస్తకం చూడగానే చదివే అలవాటు ఉన్న జగ్గూని అభినందించింది.

   వెంటనే తన దగ్గర ఉన్న ఒక కథల పుస్తకం తీసి జగ్గూకిచ్చింది. జగ్గూ సంతోషంగా ఆ పుస్తకాన్ని తీసుకుని నాన్నమ్మకి కృతజ్ఞతలు చెప్పాడు.

   పిల్లలందరూ జగ్గూని మరోసారి అభినందించి నిద్రకుపక్రమించారు. చందు, నందు ఒకేసారి  కథ కంచికి, మనం నిద్రలోకి అనేశారు.

   వాళ్ల కంగారు చూసి నాన్నమ్మ నవ్వుకుంటూ అప్పటికే నిద్రపోయిన వాళ్లందరికీ దుప్పట్లు కప్పి లైటు తీసి వచ్చి తను కూడా పడుకుంది.

 

No comments:

Post a Comment