కాలం గమనంలో మార్పులు సహజం!
కాలం ముందుకి సాగుతూనే ఉంటుంది..
వెనక్కి చూడదు..
మార్పులు ముందు వెనుకలకి
మారుతూ ఉంటాయి!
చర్మం చుట్టుకునే కాలం మారి..
నిండుగా దుస్తులు ధరించాం!
ఆధునిక కాలం కదా...
దుస్తులు నిండుకున్నాయి!
పచనం చెయ్యడం తెలియనప్పుడు..
పచ్చి మాంసం తిన్నాం!
రుచి తెలిసాక..
ప్రతి జంతువునీ తింటూనే ఉన్నాం!
భాషకి లిపి తెలియని కాలంలో..
బొమ్మల లిపితో మాట్లాడాం!
లిపి తెలిసిన తరువాత..
పోయే కాలంతో భాషనే వదిలేశాం!
కాలంతీరిన వాళ్లతో కాటి దాకా తోడెళ్లి...
కాలం తీరక..వాహనం దగ్గర ఆగిపోయాం!
బంధుత్వంతో మమకారాల్ని పెంచుకుని..
కాలం లేదంటూ కుటుంబాల్నే తెంచుకున్నాం!
విద్య అవసరమని అందరికీ పంచి..
కాలమానం మార్చడానికి చదువుని కొంటున్నాం!
పంటల కోసం కాలువలు తవ్వించి...
పంటకాలం పోయిందని ఇళ్ల స్థలాలుగా మార్చేశాం!
చెట్లుకొట్టి, పక్షుల కూతల్ని నొక్కేసి..
ఎత్తైన మిద్దెల్లో ఏకాకుల్లా ఉంటున్నాం!
స్వేచ్ఛా జీవితానికి ఆహ్వానం పలికి
వందేళ్ల కొకసారి కట్టకట్టుకు పోతున్నాం!
కాలం మారుతోందా? మార్పులు కాలాన్ని సూచిస్తున్నాయా?
కాలం మారదు.. కాలం ఆగదు.. కాలం ఎవరినీ లెక్కచెయ్యదు!
యముడు కూడా కాలం చేతిలో కీలుబొమ్మే!
ఎవరికి, కాలం చెల్లిందని, కాలం
చెప్తుందో, అక్కడికి వెడతాడు...
ఆ జీవుణ్ని తనతో తీసుకుని చక్కాపోతాడు!!
No comments:
Post a Comment