దాగి ఉన్న నిథి కథ
నాన్నమ్మ పిల్లల కోసం ఎదురు చూస్తోంది. మాయదారి కరోనా వచ్చి పిల్లల్ని జైలుపాలు చేసింది. కోతికొమ్మచ్చులూ లేవు, దాగుడు మూతలూ లేవు. తలుపులు మూతేసి నాలుగు గోడల మధ్య బంధించేస్తున్నారు.
ఫోనులోనో, బుల్లి
పెట్టెలోనో పాఠాలు చెప్పేస్తున్నారు. వీళ్ల మొహం వాళ్లకి కనిపించదు, వాళ్ల మొహం
వీళ్లకి కనిపించదు. చెప్పిన పాఠాలు బుర్రకెక్కించుకుంటున్నారో లేదో తెలియదు కాని,
తలనెప్పులూ, మెడనొప్పులూ మాత్రం వచ్చేస్తున్నాయి” అంటూ తనలో తనే మాట్లాడుకుంటోంది.
ఇంతలో నందూ
పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. “నాన్నమ్మా! నీ కథ కోసం అందరం ఎదురుచూస్తున్నాం” అన్నాడు.
వాడి మాటలు విని
నాన్నమ్మ “ ఒరేయ్! ఎన్ని మాటలు నేర్చావురా?
ఇందాకట్నుంచీ నేను మీ కోసం పడగాపుళ్లు పడి కూర్చున్నాను. మీరు రాకుండా నన్ను అంటావురా?
ఉండు నీ పని చెప్తా. అసలు కథే చెప్పను పొండి!” అంది నాన్నమ్మ.
నందూ భయపడిపోయాడు.
“అయ్యో నాన్నమ్మా! అంత పని చెయ్యకు.
ఇప్పుడే అందర్నీ లాక్కొస్తాను. నువ్విక్కడే కూర్చో!” అంటూ తుర్రుమన్నాడు.
వాణ్ని చూసి
నాన్నమ్మ “పిచ్చి సన్నాసికి కథ వినకపోతే
నిద్రపట్టదు” అనుకుంటూ పిల్లల కోసం ఎదురు చూస్తూ
కూర్చుంది.
అంతలోనే
బిలబిల్లాడుతూ వచ్చేశారు. చాపలు వేసుకుని పడకలు సిద్ధం చేసుకుని నాన్నమ్మ ఎదురుగా
కూర్చున్నారు.
వాళ్లని చూస్తే
నాన్నమ్మకి ముచ్చటేసింది. “ఎమర్రా! అందరూ వచ్చేశారా? ఈ రోజు మీకు ‘దాగి ఉన్న నిథి’ కథ చెప్తాను వినండి” అంది.
పిల్లలందరూ
ఒకేసారి “ఓ...” అని అరిచారు. నాన్నమ్మ
కథ మొదలు పెట్టింది.
మార్జలపురంలో సోములు అనే రైతు ఉండేవాడు. అతడికి ఇద్దరు కొడుకులు.. వాళ్లిద్దరు పరమ
బద్ధకస్తులు. ఏ పనీ చేసేవాళ్లు కాదు. తినడం తిరగడమే
వాళ్ల పని.
సోములుకి చాలా
విచారంగా ఉండేది. ‘వీళ్లు ఏ పని చెయ్యకుండా తిరిగి
తిరిగి భోజనానికి మాత్రం ఇంటికి వస్తారు. తనకి కూడా పనిలో సాయం చెయ్యరు.
ఇలా అయితే నేను
వెళ్లిపోతే ఎలా బతుకీడుస్తారు? ఎప్పటికైనా బాగుపడతారా? అది నేను చూస్తానా?’ అని బాధపడేవాడు. అతడికి ఎప్పుడూ అదే ఆలోచన అయిపోయింది.
హఠాత్తుగా
సోములుకి ఒక మంచి ఆలోచన తట్టింది. వెంటనే ఆలస్యం చెయ్యకుండా తన కొడుకులిద్దరినీ
పిలిచాడు. “నాయనలారా! మన పొలంలో నిథి దాగి ఉంది” అని చెప్పాడు.
మర్నాడు ఏదో పని
ఉందని చెప్పి పొరుగూరు వెళ్లాడు. సోములు ఊరు వెళ్లగానే అన్నదమ్ములిద్దరూ తండ్రి
లేని సమయంలో ఆ
నిథి ఎక్కడుందో కనిపెట్టడానికి ఏదో ఒకటి
చెయ్యాలనుకున్నారు.
వాళ్లకి తండ్రి
చెప్పిన విషయం గుర్తుకి తెచ్చుకున్నారు. నిథి
పొలంలో ఉందని చెప్పాడు కదా...దాగి ఉన్న నిథిని గురించి తెలుసుకోవాలనుకున్నారు.
అది దక్కించుకుంటే
దాన్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్లి స్వతంత్రంగా బతకచ్చు అనుకున్నారు.
అనుకున్నారో లేదో వెంటనే పొలానికి బయలుదేరారు. చాలా
రోజులు కష్టపడి పొలమంతా తవ్వేశారు. వాళ్లకి నిథి ఎక్కడ ఉందో కనిపించలేదు. నిరాశతో
ఇంటికి వచ్చేశారు.
ఒకరోజు బాగా
వర్షం పడింది. పొరుగూరు వెళ్లిన సోములు తిరిగి వచ్చేశాడు. కొడుకులిద్దరూ వచ్చి “పొలంలో నిథి ఉందని చెప్పావని పొలమంతా తవ్వేశాము. కాని, ఎంత
తవ్వినా మాకు నిథి కనిపించలేదు” అని చెప్పారు.
సోములు పొలం
చూడ్డానికి వెళ్లాడు. వర్షం బాగా పడడం వల్ల పొలమంతా మొక్కలు బాగా లేచాయి. సోములు
ఊరు వెళ్లేటప్పుడు పొలమంతా విత్తనాలు చల్లి వెళ్లాడు.
వర్షం
తోడయ్యేసరికి చక్కగా పైరు బయలుదేరింది.
కొడుకులిద్దర్నీ
పిలిచాడు. “చూశారా! మీరు పడిన
కష్టానికి ఫలితం లేదని అనుకున్నారు. కాని, మన పొలం ఎంత చక్కగా పండిందో చూడండి” అని
పొలాన్ని చూపించాడు.
“మీరు కష్టపడి పొలాన్ని తవ్వారు. కాబట్టే పొలంలో ఇంత పంట
పండుతోంది. కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది. మీరే స్వయంగా చూస్తున్నారు కదా!” అన్నాడు
సంతోషంగా.
అన్నదమ్ములిద్దరూ
పొలం వైపు చూసి ఆశ్చర్యపోయారు. “మనమిద్దరం కలిసి తవ్వడం, వెంటనే వర్షం రావడం వల్ల నాన్న వేసిన విత్తనాలకి పైరు
పెరిగి ఇంత పంట చేతికొస్తోంది.
ఇంతకంటే గొప్ప
నిథి ఏముంటుంది? అంటే, మన పొలంలో పంట రూపంలో నిథి దాగి ఉంది. అది మనం
తెలుసుకోలేకపోయాం” అని ఆనందపడ్డారు.
’బాగా కష్టపడితే బాగా సంపాదించవచ్చు, తిని కూర్చుంటే ఏదీ తమ దగ్గరికి రాదు’ అని వాళ్లు అర్థం చేసుకున్నారు.
అప్పటినుంచి
బద్ధకం వదిలించుకుని పని చెయ్యడం మొదలుపెట్టి బాగా ధనవంతులయ్యారు. బద్ధకం వదిలి
కష్టపడి పనిచెయ్యడం నేర్చుకున్న కొడుకుల్ని చూసుకుని సోములు ఆనందానికి అవధులు
లేవు.
ఇదర్రా ఆ
అన్నదమ్ముల కథ. మీకు అర్థమైందా? మీరు కూడా బద్ధకాన్ని పెంచుకోకుండా బాగా చదువుకుని
పెద్ద ఉద్యోగాలు తెచ్చుకోండి” అంటూ నాన్నమ్మ నందూ వైపు చూసింది.
వెంటనే నందూ “కథ కంచికి, మనం నిద్రలోకి” అని చెప్పేశాడు. అందర్నీ పడుకోమని చెప్పి నాన్నమ్మ కూడా నిద్రపోయింది.
‘ఫలితం కావాలంటే కష్టపడాలి!’
No comments:
Post a Comment