Xray సాహితీ సంస్థ నెలనెలా వెన్నెల
కార్యక్రమంలో 05-02-2023 చదివిన కవిత
ప్రాచీన జానపద సాహిత్య ప్రతిబింబమే – ఆధునిక జనపద సాహిత్యం
అక్షరస్పృహ లేకపోయినా...
రంజింప చేయగలది, ఆలోచింపచేయగలదీ
జానపద సాహిత్యం!
ప్రత్యేక పాట, ఆట, సహజస్పందనలు కలిగి..
సంగీత, సాహిత్యాల్లో నిరక్షరాస్యుల భావగీతమే
ప్రాచీన జానపద సాహిత్యం!
ఒక
జాతి జీవన విధానాన్ని, సంస్కృతిని
ప్రతిబింబింప
చేస్తుంది..
జీవితానుభవాలను
వర్ణిస్తూ..
విలక్షణత, మాటలు, సామెతలు,పొడుపు కథలు,
జాతీయాలు, చమత్కారాలు, మాండలికాలు
జానపదుల భాషలో
ప్రత్యేకాలు!
అంత్య
ప్రాసలతో శబ్ద ప్రధానంగా ..పనిలో అలసట
తెలియకుండా,ఆసక్తిగా పెరిగేలా..
లయబద్ధ ధ్వనులు జోడించి
పాడేదే..
జానపద సంగీతం!
తరతరాల జానపద
సాహిత్యమే..
నేటి ఆధునిక జనపద సాహిత్యానికి
ప్రతిబింబం!
చుట్టూ ఉన్నమూలతత్త్వం
పాటల రూపంలో...
ప్రేమ, హాస్యం, వెటకారం, ఆవేశం, బాధ, భక్తి..
ఎన్నో భావోద్వేగాలతో
జనపదంలోకి చేరింది!
ఒకనాడు భిక్షువుల ద్వారా వ్యాపింపబడిన
జానపదానికి ఒక ప్రతిబింబం
ఏర్పడింది...
జానపద సమాహార కళగా
ప్రసిద్ధి చెందిన..
తోలుబొమ్మలాటల
ప్రతిబింబాలే
నేటి సినిమాలు!
పండుగలు, ఉత్సవ సందర్భాల్లో
స్త్రీ పురుషులు
ఆడే కోలాటాల ప్రతిబింబాలే
నేటి ‘డీజే’లు!
లయ ప్రధానమై, రస భావాన్ని పెంచే
ప్రాచీన జానపద సంగీతానికి ...
చెవులు బద్దలు
కొట్టే వికృత పాశ్చాత్య
వెర్రి కూతలే
ప్రతిబింబాలు!
సంగీత సాహిత్యం
సంస్కృతులు ప్రవహించే జీవనదులు
మూలబింబాలైన జానపద
కళారూపాలు
సహజత్వాన్ని
కోల్పోతే...
ఆధునిక జనపద
ప్రతిబింబానికి అస్తిత్వం ఉండదు!
ప్రతిబింబాలు లేని
బింబం కళావిహీనమవుతుంది!
మూలబింబం
ప్రకాశిస్తేనే.. ప్రతిబింబాలకి ప్రకాశం!!
No comments:
Post a Comment