సాహితీరసస్రవంతికి చదివిన కవిత
కబుర్లాడే కనులు -కవుల కనులతో – కలాలు కబుర్లు
ఆదికవి వాల్మీకి చర్మ చక్షువులు
చూశాయి పక్షి జంట!
హృదయ చక్షువులకి చెప్పాయి కబుర్లు
కదిలింది ఘంటం.. పూర్తిచేసాడు రామాయణం!
వ్యాసుడు హృదయ చక్షువులు చెప్పాయి కబుర్లు..
విరటుడి కొలువులోకి వచ్చాడు భయంకరంగా మల్లుడు
ఇతర మల్లుల కనులు చూశాయి
బెదురుగా..
కాళ్లు వెనక్కి నడిచాయి..
ప్రవేశించాడు వలలుడు...
ఇద్దరి కనులు ఒకరితో మరొకరు..
చెప్పుకున్నాయి కబుర్లు!
అంతఃపురకాంతల కనులు ఆసక్తిగా
చూశాయి మల్లయుద్ధం
కురిపించాయి కనులతో వలలుడికి
అభినందనలు...
కదిలింది వ్యాసఘంటం..
పూర్తి చేశాడు విరాటపర్వం!
నాటి కవులనుండి..నేటి విశ్వనాధవారి వరకు ..
కవుల కనుల కబుర్లు.. కలాలే చెప్పాయి!
సామాజిక, ఆర్థిక, కౌటుంబిక
ప్రతిబింబాలు
చూసి.. దేహ చక్షువులతో.. సంప్రదించి
హృదయ చక్షువులతో.. అనుభవాల్ని జతకలిపి..
విరుపు.. మెరుపులు మేళవించి..
జొన్న చేనుకాడ సొగసుగత్తెను జూచి /
నిన్నటేలనుంచి నిదురాదు /
దాని నన్ను గూర్చి దయజూపు మాధవా /
పొన్నపూలు దెచ్చి పూజసేతు.
కవి తన కన్నులకు తనే చెప్పుకున్నాడు కబుర్లు!!
శ్రీనాధుడు పల్నాటి సీమ పర్యటన .. చూసి
..హృదయ చక్షువులతో ..చెప్పాయి కబుర్లు
చిన్న చిన్నరాళ్ళు చిల్లరదేవుళ్ళు /
నాగులేలినీళ్లు నాపరాళ్ళు /
సజ్జజొన్న కూల్లు సర్పాంబులును దేశి /
పల్లెనాటిసీమ, పల్లెటూళ్ళు!
పదాల అల్లిక, పద మాలికలో
చమత్కారం, చతురత .. తెలుస్తాయి
కవుల హృదయ చక్షువులకి!
చర్మ చక్షువులతో చెప్తాయి కబుర్లు
కవి కలానికి పని చెప్తాడు...
భాషామాధుర్యాన్ని చవి చూపిస్తాడు!
అడిగెదనని కడువడి జను అడిగిన ..
తనుమగుడ నుడుడవడని..
రెచ్చిపోయి కబుర్లు చెప్పింది పోతన కలం ..
తోకకొకమేక తోక తోక.. చమత్కారంతో
చేసింది అక్షర నిన్యాసాలు!
తెనాలి రామకృష్ణ కవి కలం-
సంఘ సంస్కరణ.. హృదయ చక్షువులతో చూసి...
మంచి.. గతమున కొంచెమేనోయ్
అంది గురజాడ కనుల కబుర్లు విన్న కలం!
తన హృదయ చక్షువులతో చూసి..
మంచి.. గతమున ఘనమేనోయ్
అంది ఆరుద్ర కనుల కబుర్లు విన్న కలం!
కబుర్ల కనులతో స్పందించిన కవుల
ప్రతిస్పందనే.. కవితలు!
కవికి తన కనుల కబుర్లే కవితలు
కలమే కవిత్వ సామగ్రి!
No comments:
Post a Comment