04-10-2023 సాహితీస్రవంతి సమూహంలో చదివిన కవిత
అంశం:- అంతర్వాహిని
శీర్షిక:- అంతర్వాహినిలో కొట్టుకుపోయిన హృదయం
నిరంతరం
మనసుకి మెదడుకి
జరుగుతుంది
పోరాటం ..
పోరాట
ప్రవాహమే అంతర్వాహిని..!
మనసు, మెదడు రెండు ఒకటైతే ..
ఓడిపోతాడు మనిషి!
వయసు పెరుగింది..
ఉద్యోగ విరమణ జరిగింది..
అంతర్వాహిని
వేగం పెరిగింది..
జ్ఞాపకాల్ని
తడిమింది!
ఆలోచనల
ప్రవాహం వెనక్కి మళ్లింది..
చదువుకన్న
ఎక్కువ.. ప్రపంచాన్ని చదివే రోజులు..
ఏదో చేయమని
అడిగే ఆలోచనలు..
చేయాలనే
ఆవేశం..
ఉద్యమాలు, విప్లవాలు, పోరాటాలు,
ఊరేగింపులతో..
పెద్ద హీరోగా గుర్తింపు ..
ఆగిపోయింది
చదువు ..ఆగిపోలేదు ఫాలోయింగ్!
వూరేగింపులతో
సమాజ సంస్కరణ మొదలైంది..
మాటలు
కలిపింది స్వప్న…
పారిజాత
పరిమళంలా, వోణీ వేసిన
సన్నజాజిలా,
ప్రోగుపడిన
ముగ్ధతలా!
“ జీవితాంతం తోడుగా వుంటావా ”
అడిగేశానొకరోజు...
నవ్వింది చక్కగా
అందంగా..
పుస్తకాలు ఇచ్చింది..
ఫీజు తానే కట్టింది!
పూర్తిచేశా
చదువు!
ఉద్యోగాల
వేట.. ఉత్తరాలలో ఆశ!
పెళ్ళి
చేసుకోమంది.. ఇప్పుడే కాదన్నాను
తాను చేసుకుంది
పెళ్లి.. నాకు స్వప్న గతమైంది!
మంచి
వుద్యోగం.. అనుకూలవతి
అయిన భార్య..
సంఘంలో గౌరవం..!
జీవితం ఇచ్చింది స్వప్న..
అంతర్వాహినిలో..
దాగిన అహంకారం నవ్వింది.
నీ జ్ఞాపకం
ఒక గులాబీ పరిమళం,
నిను వదిలలిందీ
లేదు, నిను
మరచిందీ లేదు,
నిరంతరం
నాలో కదిలే నా అంతర్వాహిని నీవే…
నీ పాద
రేణువునై నీ ప్రేమకై అర్ధిస్తున్నా..
వస్తావా
ఒకసారి?… క్షమిస్తావా
ఈ మూర్ఖుణ్ని!
మళ్ళీ
నవ్వుతుందేమో నన్ను క్షమించిన దేవతలా…
తట్టుకోగలదా
నా అహంకారం.. మనసు వినదుగా..
కబురు
పంపానొక రోజు!
మనసుని మెదడు
గెలిపించింది ..
ఓడిపోయాను
మనిషిగా!
స్వప్న రాలేదు..
ఇంక రాదు..
తెలిసింది..ఈ
ప్రపంచం లోనే లేదని
గుండెకి
ఏదో అవుతోంది.. ఆంతా నేనే అనుకున్నా
అహంకారంతో
పోగొట్టుకున్న దేదో తెలుసుకున్నా
ఆలోచనల
అంతర్వాహినిలో కొట్టుకుని పోతున్నా
మనసు,
మెదడు ఒకటై.. హృదయ కవాటాన్ని మూసాయి!
No comments:
Post a Comment