X-ray సంస్థ ప్రతి నెల
మొదటి ఆదివారం నిర్వహించే కవిసమ్మేళనం నెలనెలావెన్నెల లో చదివిన కవిత
శాంతి తీరం చేరే మార్గం.. ధర్మరాజు తపన
మహాభారతయుద్ధంలో గెలిచాడు ధర్మరాజు
శ్రీకృష్ణుడు అశేష కృపాకటాక్షాలు వర్షించాడు ..
బ్రాహ్మణులు
అనుగ్రహించారు ..
భీమార్జునుల భుజబల ప్రదర్శనతో విజయం సాధించారు
కురు రాజ్యాన్ని
దక్కించుకున్నారు..
అయినా ధర్మరాజు
శాంతి తీరమే చేరతానన్నాడు!
బంధుమిత్రులు, గురువులు, తండ్రులు, వంశాంకురాలు..
అభిమన్యు, ఉపపాండవులు గర్భస్థశిశువులు..
ఇరావంతుడు, ఘటోత్కచుల్ని కోల్పోయానన్నాడు!
కలిగేది సుయోధనుడి మాటలకు కోపం.. కర్ణుడు ముఖం చూస్తే శాంతం
చేతులారా అన్న కర్ణుణ్ని చంపుకున్నాను.. నారదమహర్షికి చెప్పుకున్నాడు
ధర్మరాజు శాంతి
తీరం చేరడానికి తపనపడ్డాడు!
బ్రాహ్మణ, పరశురాముల శాపం, ఇంద్రుడికి కవచకుండలాలు..
కుంతీదేవిచ్చిన వరం, భీష్ముడు అర్ధ రథుడిగా ప్రకటించడం..
శల్యుడు ములుకుల వంటి మాటలతో హింస..
దివ్యాస్త్రాలను అర్జునుడు తపస్సుచేసి పొందడం..
అర్జునుడు కర్ణుడిని వధించగలిగాడు.. నారదుడు చెప్పాడు.
ధర్మరాజు శాంతి
తీరం చేరాలని పట్టుపట్టాడు!
ఎవ్వరూ లేని ఈ రాజ్యమెందుకన్నాడు.. భిక్షుక వృత్తి
స్వీకరించి బ్రతికితేనే మనస్సుకు శాంతన్నాడు.
అర్జునా ! దాయాదులను చంపాము.
రాజ్యమనే మాంసం ముక్క కోసం పశువుల్లా కొట్టుకున్నాము,
చంపుకున్నాము, వంశనాశనం చేసుకున్నాము.
ధర్మరాజు శాంతి
తీరం చేరడానికి నిర్ణయించుకున్నాడు!
దేవుడి కృప వలన అమృత తుల్యమైన జ్ఞానం పొందాను
అదే శాశ్వతం,
అదే మోక్షమార్గం,
వదులుకోనన్నాడు
భీమసేనుడు ధర్మరాజుని కర్మయోగివన్నాడు
శృతి విహితమైన కర్మలు ఆచరించమన్నాడు
కర్మలను కాదు కర్మఫలాన్ని త్యాగం చెయ్యమన్నాడు
ధర్మరాజు శాంతి
తీరం చేరడానికి మార్గం చూపించమన్నాడు!
గృహస్థు ధర్మాలను పాటించు అతిథుల్ని, దేవతల్ని
పితృదేవతల్ని సంతృప్తిపరుచు, యజ్ఞ యాగాదులు చేసి
వంశధర్మాలు నిర్వర్తించు.. కలుగుతుంది
మోక్షం నకులుడన్నాడు.
తల్లి, తండ్రి, గురువు, దైవం, చెలి, చుట్టం. నువ్వే
అన్నారు
తమ మాటలను విశ్వసించమన్నారు నకులసహదేవలు..
ధర్మరాజు శాంతి
తీరం చేరడానికి ఇది చాలదన్నాడు!
అరణ్య అజ్ఞాతవాసాలు ముగియగానే రాజ్యసంపదలు తిరిగి
కైవశం చేసుకుంటామని తమ్ములకు నచ్చచెప్పావు
ఇచ్చిన మాటకు కట్టుబడి రాజ్యసుఖాలు అందించక తప్పదు
భార్యనవమానించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణులను శిక్షించావు.
రాజ్యరక్షణ చేయడం క్షత్రియ ధర్మం..
ద్రౌపది అనునయించింది
ధర్మరాజు శాంతి
తీరం చేరడానికి ఇదీ చాలదన్నాడు!
ధర్మజుడు మాటలు వ్యాసుడు విన్నాడు
లోకమంతా ద్వంధములతో నిండింది.. వృద్ధి చెందడం నశించడానికే
పుట్టడం మరణించడానికే,
పెరగడం తరగడానికే
విధాత నీకు విధించిన కర్మను నిర్వర్తించి తీరాలి
శాంతి సముద్రం
నీ మనస్సే..తీరం నీ మనసులోనే ఉంది
ధర్మరాజుని శాంతి
తీరానికి వ్యాసుడు చేర్చాడు!
No comments:
Post a Comment