About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నాన్నమ్మ చెప్పిన ఎలుక కథ


వేసవి శలవులకి తాతగారి ఊరు వచ్చిన పిల్లలకి నాన్నమ్మ చెప్పిన కథలు
నాన్నమ్మ చెప్పిన ఎలుక కథ
   నాన్నమ్మ భోజనం చేసి వచ్చి విశ్రాంతిగా వాలు కుర్చీలో కూర్చుంది. అప్పటికే వచ్చేసిన పిల్లలు “నాన్నమ్మా! ఇవాళేం కథ చెప్తున్నావు?” అనడిగారు.
   అప్పటి వరకు ఎక్కడుంటారో తెలియదు. నాన్నమ్మ భోజనం అయిందని తెలియగానే గాలిదుమారంలా వచ్చేస్తారు.
   అప్పటికే వాళ్లల్లో ఒకడు తను కూర్చున్న తుంగచాప పుల్లల్ని పీకేస్తున్నాడు. వాణ్ని చూసి నాన్నమ్మ  ఒరేయ్! భడవా! ఆ చాపెందుకురా అలా పీకేస్తున్నావు. రేపట్నుంచి కింద కూర్చుంటావా ఏమిటి? ఒక్క నిముషం కుదురుగా కూర్చోలేరు కదా! అంటూ కేకలేసింది.
   ఏ కథ చెప్పాలా.. అని ఆలోచిస్తూ వాడి వైపే చూస్తున్న నాన్నమ్మకి వాడు ఎలుకలా కనిపించాడు. వెంటనే “ ఎలుక కథ చెప్తానర్రా!” అంది.
   అందరూ ’సరే నాన్నమ్మా!’ అంటూ ఒక్కసారిగా అరిచారు.
   “అందరూ నిశ్శబ్దంగా ఉండండి! అంటూ నాన్నమ్మ కథ మొదలుపెట్టింది. అడవిలో నివసిస్తున్న ఎలుక ఒక పెద్ద చెట్టుకింద ఇల్లు  కట్టుకుంది. పగలంతా హాయిగా అడవంతా చుట్టేస్తుంది. చీకటిపడగానే తన ఇంటికి వెళ్లిపోతుంది.
   సరేగాని, ఎలుకల ఇంటిని ఏమని పిలుస్తారో మీకు తెలుసా?” మధ్యలో ఒక ప్రశ్న వేసింది నాన్నమ్మ.
   కలుగు’ అరిచారందరూ ఒకే కంఠంతో.
   “బాగా చెప్పారు. మళ్లీ కథ వినండి!  అని నాన్నమ్మ మళ్లీ కథ చెప్పడం మొదలుపెట్టింది. ఎలుక తన కలుగులోనే సుఖంగా ఉంటోంది.
   ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక పెద్దపులి వచ్చింది. బాగా తిని విశ్రాంతి తీసుకోడానికి అదే చెట్టు కింద పడుక్కుంది. అది పడుక్కున్న చోటే మన ఎలుక కలుగు ఉంది.
   అది పడుక్కున్నప్పుడు అటూ ఇటూ చూడకుండా సరిగ్గా కలుగుకి ఆనుకుని పడుక్కుంది. గర్వంతో విర్రవీగే పులికి ఆ చిన్న కలుగు ఎందుకు కనిపిస్తుంది!
   ఎలుకకి కోపం వచ్చింది. అడవిలో అంత చోటుంది కదా! ఆ చోటంతా వదిలేసి నా కలుగుకే ఆనుకుని అడ్డంగా పడుక్కోవాలా?
   ఇది నా సొంత ఇల్లు. నేను కష్టపడి కట్టున్నాను. నా ఇంటి దగ్గర నేను బయటికి రావడానికి వీలు లేకుండా పడుక్కుంటుందా? దీని సంగతి తేలుస్తా!” అనుకుంది.
   “వెంటనే పులిరాజా! పులిరాజా! అని గట్టిగా పిలిచింది ఎలుక.
   ఎవరు?” కళ్లు తెరవకుండానే అడిగింది పులి.
   పులితో ముందే గొడవ పెట్టుకోడం ఎందుకని నేను ఎలుకని. నా ఇంటికి అడ్డంగా పడుక్కున్నావు. చూశావో లేదో.. అని చెప్తున్నాను  అంది.
    దాని మాటలు విని కళ్లు తెరవకుండానే పులి తెలియకే పడుక్కున్నాను. నేను దాన్ని చూడలేదు. అయినా తెలిసి  పడుక్కుంటే మాత్రం... ఇంతోటి ఇల్లు ఏమైపోతుంది? నిద్ర పోతుంటే లేపుతున్నావెందుకు? నోరు మూసుకుని లోపల కూర్చో అంది కోపంగా.  
   ఎలుక వదలకుండా పులిరాజా! నేను బయటికి ఎలా రాగలను? నేను కూడా ఆహారం వెతుక్కోవాలి కదా? కొంచెం పక్కకి పడుక్కో!” అంది నెమ్మదిగా.
   పులిరాజుకి కోపం వచ్చింది. “నేను నిద్రపోతున్నాను.. కనిపించట్లేదా? ఇప్పుడు నువ్వు బయటికి వచ్చి ఏం చేస్తావు? మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చో” అంది పులి కర్కశంగా.
      ఎలుకకి కోపం వచ్చింది. ఎలుకైతే మాత్రం.. దానికి కోపం రాకూడదా? అందుకే  కోపంతో “నా ఇంటికి అడ్డు తప్పుకో! లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు” అంది ఎలుక.
   “చూడు నువ్వు ఎలుకవి.. నేనేమో పెద్దపులిని. నా కాలి గోరంత లేవు. నన్నేం చెయ్యగలవు? మాట్లాడకుండా లోపల కూర్చో! అని అరిచింది పెద్దపులి.
    ఎలుకకి బాగా కోపం వచ్చింది. తన ఇంటిలోకి కొంచెం కనిపిస్తున్న దాని అరికాళ్లు చూసింది. బలంగా ఉండే తన పళ్లతో  పెద్దపులి అరికాళ్లు కొరికేసి మాట్లాడకుండా లోపలే కూర్చుంది.
   పులికి అరికాళ్లు ఒకటే నొప్పి. అరుపులూ, కేకలూ పెడుతూ అటూ ఇటూ తిరిగేస్తోంది. దాని కాలి గోళ్లతో ఎలుక ఇంటిని గీకేసింది. ఎంత గీకేసినా ఎలుక ఇంటినీ, ఎలుకనీ ఏమీ చెయ్యలేకపోయింది.
   ఎలుక చక్కగా తన ఇంటిలోపలే కూర్చుని అనందపడుతోంది. మళ్లీ పులిని పలకరించలేదు. దానికి కనిపించలేదు. కుంటు కుంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది పులి.
   వెడుతూ వెడుతూ ఆలోచిస్తోంది పులి. “ నేను పులిరాజుని. నా శరీరం ఎంతో పెద్దది. ఒక్క తోకతోనే ఏ జంతువునయినా, ఎంత పెద్ద జంతువునయినా చంపెయ్యగలను.
   అడవిలో ఉండే జంతువుల్నే కాదు. ఊళ్లో ఉన్న మనుషుల్ని కూడా ఒక్క దెబ్బతో చంపెయ్యగలను.
   కాని, నా చిటికెనవేలంత కూడ లేని చిట్టెలుక వచ్చి నా అరికాలు కొరికి వెళ్లిపోయింది. దాన్ని నేనేమీ చెయ్యలేకపోయాను.
   అంటే, శారీరకంగా ఉన్న బలమే కానీ, బుద్ధి బలం నాకు లేకపోయింది. ఏం చేస్తాను నాకు రోజులు బాగుండలేదు” అనుకుంటూ అడవిలోకి వెళ్లిపోయింది అంటూ నాన్నమ్మ కథ ముగించింది.
   “ఏమర్రా! వింటున్నారా.. నిద్రపోయారా..? ఇప్పుడర్థమయిందా? శరీరాన్ని మాత్రమే పెంచితే కుదరదు.  బుద్ధిబలం కూడా బాగా ఉండాలి.
   ఎప్పుడూ తింటూ కూర్చోడం.. లేకపోతే అది అరిగేదాకా అల్లరి చెయ్యడం కాకుండా.. మీరు కూడా కాస్త బుద్ధికి పదును పెట్టండి! నేను చెప్పింది వినబడుతోందా?
   సరే, ఇంక పడుక్కోండి. పొద్దున్నే లేవాలి. కథ రేపటికి... మనం నిద్రలోకి! అంది నాన్నమ్మ.
   గబ గబా పక్కలు పరుచుకుని పడుక్కుని నిజంగా చిట్టెలుక భలే చేసింది కదురా? పులికి బాగా అయిందిలే! అనుకుంటూ పిల్లలందరు నిద్రలోకి జారిపోయారు.
నాన్నమ్మ చెప్పిన కథలో నీతి కండబలం ఒక్కటే చాలదు.. బుద్ధిబలం కూడా ఉండాలి! అని.     

1 comment:

  1. నీతి కధ బాగుంది. తుంగచాప, కలుగు, భడవా...ఈ మాటలు విని చాలా కాలం అయ్యింది :-)

    ReplyDelete